Sachin Tendulkar: “అఫ్గాన్‍పై ఇంగ్లండ్ చేసిన తప్పు అదే”: సచిన్ టెండూల్కర్
Sachin Tendulkar on ENG vs AFG: ప్రపంచకప్‍లో అఫ్గానిస్థాన్‍పై డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్‍లో ఇంగ్లిష్ జట్టు చేసిన తప్పేంటో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చెప్పారు.
Sachin Tendulkar on ENG vs AFG: వన్డే ప్రపంచకప్‍లో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్‍కు అఫ్గానిస్థాన్ భారీ షాకిచ్చింది. అంచనాలు లేకుండా టోర్నీలో బరిలో ఉన్న అఫ్గాన్.. ఇంగ్లిష్ జట్టును చిత్తు చేసి సత్తాచాటింది. ఏ ఫార్మాట్‍లో అయిన ఇంగ్లండ్‍పై అఫ్గానిస్థాన్‍కు ఇదే తొలి గెలుపుగా ఉంది. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా ఆదివారం ఢిల్లీలో జరిగిన మ్యాచ్‍లో అఫ్గానిస్థాన్ ఏకంగా 69 పరుగుల తేడాతో ఇంగ్లండ్‍పై విజయం సాధించింది. అఫ్గానిస్థాన్ స్పిన్ త్రయం ముజీబుర్ రహ్మన్, రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ ధాటికి ఇంగ్లిష్ జట్టు కేవలం 215 పరుగులకే చాపచుట్టేసింది. అయితే, అఫ్గాన్‍పై ఇంగ్లండ్ ఓటమికి ప్రధాన కారణాన్ని భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వెల్లడించారు.
285 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక అఫ్గానిస్థాన్‍పై ఇంగ్లండ్ ఎందుకు పరాజయం పాలైందో సచిన్ గుర్తించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అద్భుతమైన విజయాన్ని సాధించిన అఫ్గానిస్థాన్‍ను ప్రశంసించిన సచిన్.. ఇంగ్లండ్ బ్యాటర్లు చేసిన ప్రధానమైన తప్పిదమేంటో కూడా పేర్కొన్నారు.
“అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రతిభను అఫ్గానిస్థాన్ ప్రదర్శించింది. రహ్మనుల్లా గుర్బాజ్ అదరగొట్టాడు. ఇంగ్లండ్‍కు బ్యాడ్ డే. నాణ్యమైన స్పిన్నర్లను ఎదుర్కొనేటప్పుడు, వారి చేతిలో నుంచే బంతిని గమనించి అంచనా వేయాలి. ఇది చేయడంలో ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. చేతిలో నుంచి అంచనా వేయకుండా బంతి పిచ్ అయ్యాక రీడ్ చేశారు. ఇదే వారి పతనానికి కారణమైంది. అయితే, ఫీల్డ్‌లో వారు చూపిన ఎనర్జీ నచ్చింది. అఫ్గానిస్థాన్ టీమ్ అద్భుతంగా ఆడింది” అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు.
పేసర్ ఫజల్ హక్ ఫరూకీ.. ఇంగ్లండ్ ఓపెనర్ జానీ హెయిర్ స్టోను ఔట్ చేసి తొలి బ్రేక్‍త్రూ ఇచ్చాడు. ఆ తర్వాత అఫ్గాన్ స్పిన్నర్లు ముజీబుర్ రహ్మన్, రషీద్ ఖాన్, మహమ్మద్ నబీ వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‍ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. ముజీబ్, రషీద్ చెరో మూడు, నబీ రెండు వికెట్లు పడగొట్టారు. దీంతో 285 పరుగుల లక్ష్య ఛేదనలో 40.3 ఓవర్లలోనే 215 పరుగులు మాత్రమే చేయగలిగింది ఇంగ్లండ్. హ్యారీ బ్రూక్ (66) ఒంటరి పోరాటం చేసినా.. మిగిలిన బ్యాటర్లు ఎవరూ నిలువలేకపోయారు.
మరోవైపు, ప్రపంచకప్ సెమీస్‍కు చేరేందుకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా ఇక చాలా కష్టపడాల్సిందేనని సెహ్వాగ్ ట్వీట్ చేశారు.
సంబంధిత కథనం