WPL 2025: ఆ రనౌట్లే ముంబయి ఇండియన్స్ కొంప ముంచాయా? ఔటైనా నాటౌట్ గా ఇచ్చారా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే!
WPL 2025: డబ్ల్యూపీఎల్ 2025 లో ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో రనౌట్ నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. ఈ రనౌట్ల పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. రూల్స్ గురించి ప్రశ్నిస్తున్నారు.

వడోదరలో శనివారం (ఫిబ్రవరి 15) ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ లాస్ట్ బాల్ కు థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. రెండు వికెట్ల తేడాతో క్యాపిటల్స్ విజేతగా నిలిచింది. అయితే ఈ మ్యాచ్ లో అంపైర్ రనౌట్ నిర్ణయాలు వివాదానికి దారితీశాయి. దీనిపై ముంబయి ఇండియన్స్ ప్లేయర్లతో పాటు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మూడు రనౌట్లు
ముంబయి ఇండియన్స్ తో మ్యాచ్ లో ఢిల్లీ ఛేదనలో మూడు రనౌట్ అప్పీల్స్ వివాదానికి దారితీశాయి. ఢిల్లీ గెలవాలంటే చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సి వచ్చింది. అరుంధతి రెడ్డి రెండో పరుగు కోసం ప్రయత్నించగా వికెట్ కీపర్ స్టంప్స్ లేపేసేంది. కానీ వెంట్రుక వాసి తేడాతో అరుంధతి నాటౌట్ గా తేలడంతో ఢిల్లీ గెలిచింది. అంతకంటే ముందు రెండు రనౌట్ అప్పీళ్ల విషయంలో ముంబయి జట్టు అసహనం వ్యక్తం చేసింది.
హర్మన్ ప్రీత్ కోపం
ఛేజింగ్ లో 18వ ఓవర్లో శిఖా పాండే సింగిల్ కోసం ప్రయత్నించగా ఆమెను నికీ ప్రసాద్ వెనక్కి పంపింది. ఈ లోపు డైరెక్ట్ త్రోతో స్టంప్స్ ఎగిరిపోయాయి. బంతి తగిలి ఎల్ఈడీ లైట్ వెలిగినప్పుడు పాండే బ్యాట్ క్రీజు బయటే ఉంది. కానీ టీవీ అంపైర్ గాయత్రి వేణుగోపాలన్ మాత్రం రెండు బెయిల్స్ ఎగిరే సమయానికి పాండే బ్యాట్ క్రీజులోపలికి వచ్చిందని నాటౌట్ గా తెలిపింది. దీనిపై అంపైర్లతో హర్మన్ ప్రీత్ వాగ్వాదానికి దిగింది. 19వ ఓవర్లో రాధా యాదవ్ రనౌట్ విషయంలోనూ అంపైర్ ఇలాగే నాటౌట్ గా ప్రకటించింది.
రూల్స్ ఏం చెప్తున్నాయి?
డబ్ల్యూపీఎల్ నిబంధన 4.2 ప్రకారం ‘‘ఎల్ఈడీ వికెట్లు ఉపయోగించిన మ్యాచ్ లో మొదట లైట్స్ వెలిగిన దాన్ని పరిగణించాలి. ఆ తర్వాత స్టంప్స్ పై నుంచి బెయిల్ పూర్తిగా పడిపోయిందా లేదా చూడాలి. స్టంప్స్ పై నుంచి ఒక బెయిల్ పూర్తిగా తొలగిస్తే ఔట్ అని ప్రకటించొచ్చు’’ అని ఉంది. కానీ మ్యాచ్ లో మాత్రం టీవీ అంపైర్ నిర్ణయాలు విరుద్ధంగా ఉన్నాయనే చర్చ సాగుతోంది.
సంబంధిత కథనం