RR vs RCB IPL 2024: బెంగళూరును కట్టడి చేసిన రాజస్థాన్.. మోస్తరు టార్గెట్
RR vs RCB IPL 2024 Eliminator: రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు రాణించి బెంగళూరు బ్యాటర్లను నిలువరించారు. దీంతో ఆర్సీబీ మోస్తరు స్కోరు చేసింది. రాజస్థాన్ బౌలర్లు రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.
RR vs RCB IPL 2024 Eliminator: ఐపీఎల్ 2024 సీజన్ ఎలిమినేటర్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్‍లో సత్తాచాటలేకపోయింది. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మోస్తరు స్కోరుకే ఆర్సీబీ పరిమితమైంది. అహ్మదాబాద్ వేదికగా నేడు (మే 22) జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 172 పరుగులే చేసింది. రాజస్థాన్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (2/19), పేసర్ ట్రెంట్ బౌల్ట్ (1/16) అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఆవేశ్ ఖాన్ (3/44) మూడు వికెట్లు తీసినా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. రాజస్థాన్ ముందు 173 పరుగుల మోస్తరు టార్గెట్ ఉంది.
కోహ్లీ దూకుడుగా మొదలుపెట్టినా..
టాస్ ఓడి ముందుగా ఈ ఎలిమినేటర్ మ్యాచ్‍లో బ్యాటింగ్‍కు దిగింది బెంగళూరు. స్టార్ ఓపెనర్ విరాట్ కోహ్లీ (24 బంతుల్లో 33 పరుగులు; 3 ఫోర్లు, ఓ సిక్స్), కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (14 బంతుల్లో 17 పరుగులు; 2 ఫోర్లు, ఓ సిక్స్) మంచి ఆరంభమే ఇచ్చారు. స్టార్ ప్లేయర్ కోహ్లీ దూకుడుగా ఆడగా.. ఫాఫ్ ఆచితూచి ముందుకు సాగాడు. అయితే, ఈ క్రమంలో ఐదో ఓవర్లో డుప్లెసిస్‍ను రాజస్థాన్ పేసర్ బోల్ట్ పెవిలియన్‍కు పంపాడు. దీంతో 37 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది. భారీ సిక్సర్ కొట్టే ప్రయత్నంలో ఎనిమిదో ఓవర్లో విరాట్ కోహ్లీ.. యజువేంద్ర చాహల్ బౌలింగ్‍లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
తిప్పేసిన అశ్విన్.. మ్యాక్సీ డకౌట్
కామెరూన్ గ్రీన్ (27) కాసేపు నిలిచినా దూకుడుగా ఆడలేకపోయాడు. అయితే, 13వ ఓవర్లో రాజస్థాన్ సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. గ్రీన్‍ను ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికే స్టార్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (0)ను అశ్విన్ పెవిలియన్‍కు పంపాడు. డకౌట్ అయి నిరాశగా వెళ్లాడు మ్యాక్సీ. దీంతో 97 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బెంగళూరు.
పటిదార్, లోమ్రోర్ దూకుడు.. కార్తీక్ నిరాశ
ఆ తర్వాత బెంగళూరు యువ బ్యాటర్లు రజత్ పాటిదార్ (22 బంతుల్లో 34 పరుగులు), మహిపాల్ లోమ్రోర్ (17 బంతుల్లో 32 పరుగులు) దూకుడుగా ఆడారు. వికెట్లు పడినా వెనక్కి తగ్గలేదు. పటిదార్ 2 సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. 15వ ఓవర్లో ఆవేశ్ ఖాన్ అతడిని ఔట్ చేశాడు. సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తీక్ (13 బంతుల్లో 11 పరుగులు) నిరాశపరిచాడు. లోమ్రోర్ 19వ ఓవర్లో ఔటవటంతో ఆర్సీబీకి ఎదురుదెబ్బ తగిలింది. చివర్లో స్వప్నిల్ (9 నాటౌట్) పర్వాలేదనిపించాడు.
అశ్విన్, ఆవేశ్, బౌల్ట్ సూపర్
రాజస్థాన్ బౌలర్లలో ఆవేశ్ ఖాన్ 3 వికెట్లతో రాణించాడు. అయితే, రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీసి 4 ఓవర్లలో కేవలం 19 పరుగులే ఇచ్చాడు. పేసర్ ట్రెంట్ బౌల్డ్ 4 ఓవర్లలో 16 పరుగులే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. అశ్విన్, బౌల్ట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో బెంగళూరు తడబడింది. యుజువేంద్ర చాహల్, సందీప్ శర్మ కూడా చెరో వికెట్ తీశారు.
రాజస్థాన్ రాయల్స్ ఈ 173 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుందా.. లేకపోతే బెంగళూరు బౌలింగ్‍లో సత్తాచాటిన స్కోరును కాపాడుకోగలదా అనేది చూడాలి. ఈ ప్లేఆఫ్స్ ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. గెలిచిన టీమ్ హైదరాబాద్‍తో మే 24న సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో తలపడుతుంది.