RR vs RCB IPL 2024 Eliminator: టాస్ గెలిచిన రాజస్థాన్.. అందుబాటులోకి వచ్చిన హిట్టర్.. మార్పుల్లేకుండా బెంగళూరు
RR vs RCB IPL 2024 Eliminator: రాజస్థాన్, బెంగళూరు మధ్య ఐపీఎల్ 2024 ఎలిమినేటర్ పోరు షురూ అయింది. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచింది రాజస్థాన్.
RR vs RCB IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఎలిమినేటర్ సమరానికి రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బరిలోకి దిగాయి. లీగ్ దశలో చివరి ఆరు మ్యాచ్‍ల్లో వరుసగా గెలిచిన ఆర్సీబీ జోష్‍లో ఉంటే.. తొలుత అదరగొట్టినా చివర్లో రాజస్థాన్ తడబడింది. అహ్మదాబాద్‍లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా నేడు (మే 22) రాజస్థాన్, బెంగళూరు మధ్య ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ ఎలిమినేటర్ మ్యాచ్ మొదలైంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో బెంగళూరు బ్యాటింగ్‍కు దిగనుంది.

ఫిట్‍గా హిట్మైర్
ఇటీవల గాయపడిన రాజస్థాన్ రాయల్స్ హిట్టర్ షిమ్రన్ హిట్మైర్ ఈ ఎలిమినేటర్ మ్యాచ్‍కు అందుబాటులోకి వచ్చాడు. నేటి మ్యాచ్‍లో షిమ్రన్ హిట్మైర్ ఆడతాడని టాస్ సమయంలో సంజూ శాంసన్ చెప్పాడు. కానీ తుదిజట్టులో అతడు లేడు. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్‌గా హిట్మైర్ బరిలోకి దిగనున్నాడు.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విన్నింగ్ టీమ్‍ను కొనసాగించింది. తుదిజట్టులో మార్పులు చేయలేదు. ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్‍కు దిగనుంది. ఇప్పటికే కోహ్లీ.. కోహ్లీ అంటూ అహ్మదాబాద్ స్టేడియం మోతెక్కిపోతోంది.
ఈ సీజన్ లీగ్ దశలో తొలి తొమ్మది మ్యాచ్‍ల్లో ఎనిమిది గెలిచిన రాజస్థాన్ రాయల్స్ దుమ్మురేపింది. అయితే, ఆ తర్వాత వరుసగా నాలుగు ఓడగా.. చివరి మ్యాచ్ వాన వల్ల రద్దయింది. టాప్‍లో నిలుస్తుందని అంచనా వేసిన శాంసన్ సేన ఎట్టకేలకు మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు వచ్చింది. తొలి ఎనిమిది మ్యాచ్‍ల్లో ఏడు ఓడి ఓ దశలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచిన బెంగళూరు.. అద్భుతమే చేసింది. వరుసగా ఆరు మ్యాచ్‍లు గెలిచి నాలుగో స్థానంలో ప్లేఆఫ్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆర్సీబీ తన దూకుడు కొనసాగించాలని పట్టుదలగా ఉంటే.. రాజస్థాన్ మళ్లీ సత్తాచాటాలనే కసితో ఉంది. ఈ రెండు జట్లు ఎలిమినేటర్‌లో గెలువాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ పోరులో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఔట్ అవుతుంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు: ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, యశ్ దయాల్, మహమ్మద్ సిరాజ్, లూకీ ఫెర్గ్యూసన్
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు: యశస్వి జైస్వాల్, టామ్ కోహ్లోర్ కాడ్మోర్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, రోవ్మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్, సందీప్ శర్మ, యుజువేంద్ర చాహల్
రాజస్థాన్, బెంగళూరు మధ్య నేటి ఎలిమినేటర్లో ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ మ్యాచ్‍లో గెలిచిన టీమ్ మే 24వ తేదీన సన్‍రైజర్స్ హైదరాబాద్‍తో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో క్వాలిఫయర్-2లో తలపడనుంది. క్వాలిఫయర్-1లో హైదరాబాద్‍పై గెలిచిన కోల్‍కతా ఇప్పటికే ఫైనల్‍లో అడుగుపెట్టింది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు ఫైనల్‍లో కేకేఆర్‌తో తలపడనుంది. మే 26న తుదిపోరు కూడా చెపాక్‍లోనే జరుగుతుంది.