WPL 2025: వాట్ ఏ మ్యాచ్.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. అదరగొట్టిన పెర్రీ, రిచా.. 202 టార్గెట్ ఉఫ్-royal challengers bengaluru thrilling victory vs gujarat giants ellyse perry richa ghosh ashleigh gardner ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2025: వాట్ ఏ మ్యాచ్.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. అదరగొట్టిన పెర్రీ, రిచా.. 202 టార్గెట్ ఉఫ్

WPL 2025: వాట్ ఏ మ్యాచ్.. ఆర్సీబీ థ్రిల్లింగ్ విక్టరీ.. అదరగొట్టిన పెర్రీ, రిచా.. 202 టార్గెట్ ఉఫ్

WPL 2025: వుమెన్స్ ప్రిమియర్ లీగ్ 2025 కు అదిరే ఆరంభం. పరుగుల వరద పారిన మ్యాచ్ తో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ గ్రాండ్ గా స్టార్ట్ అయింది. ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్ అద్భుత బ్యాటింగ్ తో 202 లక్ష్యాన్ని అందుకున్న ఆర్సీబీ.. గుజరాత్ పై థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది.

గుజరాత్ తో మ్యాచ్ లో చెలరేగి ఆర్సీబీని గెలిపించిన రిచా ఘోష్ (x/Virat Kohli Fan Club)

డబ్ల్యూపీఎల్ 2025 సీజన్ తొలి మ్యాచ్ లోనే సంచలనం. డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అదరగొట్టింది. శుక్రవారం (ఫిబ్రవరి 14) వడోదరలో జరిగిన సీజన్ ఆరంభ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ పై గెలిచింది. 202 పరుగుల టార్గెట్ ను మరో 9 బంతులు ఉండగానే అందుకుంది. గుజరాత్ మొదట 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు సాధించింది. ఫీల్డింగ్ ఫెయిల్యూర్ గుజరాత్ కొంపముంచింది.

మొదట పెర్రీ

భారీ లక్ష్య ఛేదనలో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ ఎలీస్ పెర్రీ (34 బంతుల్లో 57), రిచా ఘోష్ (27 బంతుల్లో 64 నాటౌట్) అసాధారణ బ్యాటింగ్ తో జట్టును గెలిపించారు. మొదట ఆష్లీ గార్డ్ నర్ ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆర్సీబీ కెప్టెన్ మంధాన (9), డాని వ్యాట్ (4)ను ఔట్ చేసింది. అక్కడి నుంచి రాఘ్వి (25)తో కలిసి పెర్రీ ఇన్నింగ్స్ నడిపించింది. కానీ అర్ధశతకం తర్వాత పెర్రీ పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ ఆశలు ఆవిరయ్యేలా కనిపించాయి.

ముగించిన రిచా

రిచా ఘోష్ భారీ షాట్లతో గుజరాత్ బౌలర్లను బెంబేలెత్తించింది. అలవోకగా ఫోర్లు, సిక్సర్లు బాదింది. 4 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టింది. గార్డ్ నర్ వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్లో రిచా.. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టింది. ఆ ఓవర్లో మొత్తం 23 పరుగులు రావడం ఆర్సీబీకి కలిసొచ్చింది. కనిక (13 బంతుల్లో 30 నాటౌట్) కూడా కీలక సమయంలో పరుగులు సాధించింది. ఈ జోడీ అయిదో వికెట్ కు అజేయంగా 37 బంతుల్లోనే 93 పరుగులు చేసింది. చివరకు సిక్సర్ తోనే రిచా మ్యాచ్ ముగించడం విశేషం.

ఆష్లీ అదుర్స్

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ లో ఆష్లీ గార్డ్ నర్ ఆటే హైలైట్. 160 పరుగులు కూడా చేస్తుందా లేదా అనుకున్న గుజరాత్ స్కోరు 200 దాటిందంటే అందుకు ఆష్లీ మెరుపు ఇన్నింగ్సే కారణం. క్రీజులో అడుగుపెట్టినప్పటి నుంచి ఆమె భారీ షాట్లతో చెలరేగింది.

ఆష్లీ ఏకంగా 8 సిక్సర్లు కొట్టింది. కేవలం 37 బంతుల్లోనే 79 పరుగులు చేసింది. బెత్ మూనీ (56) తో కలిసి ఆష్లీ విధ్వంసకర బ్యాటింగ్ ను కొనసాగించింది. డాటిన్ (25) కూడా జట్టు భారీ స్కోరులో కీలక పాత్ర పోషించింది. ఆర్సీబీ బౌలర్ల లో రేణుక సింగ్ (2/25) మెరిసింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం