RCB New Captain: షాకింగ్.. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి కాదు.. ఈ యువ ఆటగాడికి అవకాశం
RCB New Captain: ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తమ కెప్టెన్సీని ఓ యువ ఆటగాడికి అప్పగించింది. మరోసారి విరాట్ కోహ్లికే ఈ కెప్టెన్సీ దక్కుతుందని భావించినా.. ఆర్సీబీ నిర్ణయం షాక్ కు గురి చేసింది.

RCB New Captain: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి కొత్త కెప్టెన్ వచ్చేశాడు. పలు సీజన్లుగా ఆ టీమ్ తరఫున నిలకడగా ఆడుతున్న రజత్ పటీదార్ కు కెప్టెన్సీ అప్పగించారు. విరాట్ కోహ్లికి మరోసారి కెప్టెన్సీ అప్పగిస్తారన్న వార్తలు వచ్చినా.. ఆ టీమ్ అనూహ్యంగా రజత్ కు పగ్గాలు అప్పగించడం గమనార్హం.
రజత్ పటీదార్‌కు ఆర్సీబీ కెప్టెన్సీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) కొత్త సీజన్ ప్రారంభానికి ముందు ఆర్సీబీకి కొత్త కెప్టెన్ వచ్చాడు. గురువారం (ఫిబ్రవరి 13) రజత్ పటీదార్ కు కెప్టెన్సీ అప్పగిస్తున్నట్లు ఆ టీమ్ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ వెల్లడించాడు. గత మూడు సీజన్లుగా కెప్టెన్సీ వహించిన ఫాఫ్ డుప్లెస్సి వెళ్లిపోవడంతో కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది. అయితే గతంలో కెప్టెన్సీ వహించిన విరాట్ కోహ్లికే మరోసారి పగ్గాలు అప్పగించవచ్చని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి.
కానీ ఆర్సీబీ మాత్రం రజత్ పటీదార్ ను దీనికోసం ఎంపిక చేసింది. ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ యువ ప్లేయర్ రజత్ కెప్టెన్సీలో కొత్త సీజన్లో టైటిల్ వేట మొదలుపెట్టనుంది.
ఆర్సీబీతో రజత్ కెరీర్ ఇలా..
రజత్ పటీదార్ కొన్నాళ్లుగా ఆర్సీబీ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది ఇండియన్ టీమ్ కు కూడా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ తో సిరీస్ లో అతడు రెండుసార్లు డకౌట్ కావడంతోపాటు 32, 9, 5, 17 స్కోర్లు చేశాడు. దీంతో అతన్ని పక్కన పెట్టారు. ఈ మధ్యే అతడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్య ప్రదేశ్ ను ఫైనల్ కు చేర్చాడు. అయితే అక్కడ ముంబై చేతుల్లో ఓడిపోయింది.
ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీతో రజత్ చేరాడు. ఆర్సీబీ రిటెయిన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్స్ లో రజత్ ఒకరు. ఆర్సీబీ తరఫున తొలి సీజన్లో ఫెయిలైనా 2022లో 333 రన్స్ చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది. 2023 సీజన్ గాయం కారణంగా ఆడలేదు. ఇక గతేడాది మరింత చెలరేగి 395 రన్స్ చేశాడు.
ఆర్సీబీ తరఫున రజత్ మొత్తం 27 మ్యాచ్ లు ఆడాడు. అందులో 799 రన్స్ చేశాడు. సగటు 34.74. స్ట్రైక్ రేట్ 158.85. అయితే తమ జట్టు తరఫున ఇంత తక్కువ అనుభవం ఉన్న రజత్ కు ఆర్సీబీ కెప్టెన్సీ అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గతేడాది వేలంలో ఆర్సీబీ కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, లివింగ్‌స్టన్, బేతెల్, టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్ లాంటి స్టార్లను తీసుకుంది.
ఐపీఎల్ 2025లో ఆర్సీబీ టీమ్: రజత్ పటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, యశ్ దయాల్, లివింగ్‌స్టన్, ఫిల్ సాల్ట్, జితేష్ శర్మ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ దర్, సుయశ్ శర్మ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, స్వాప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, నువాన్ తుషార, మనోజ్ భండాగే, జాకబ్ బేతెల్, దేవదత్ పడిక్కల్, స్వాస్తిక్ చికారా, లుంగి ఎంగిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠీ
సంబంధిత కథనం