WPL 2024 RCB: ఫైనల్‍లో అడుగుపెట్టిన స్మృతిసేన.. ఎలిమినేటర్‌లో ముంబైపై బెంగళూరు గెలుపు-royal challengers bangalore reaches final of wpl 2024 after win over mumbai indians rcb vs dc will fight for title ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Wpl 2024 Rcb: ఫైనల్‍లో అడుగుపెట్టిన స్మృతిసేన.. ఎలిమినేటర్‌లో ముంబైపై బెంగళూరు గెలుపు

WPL 2024 RCB: ఫైనల్‍లో అడుగుపెట్టిన స్మృతిసేన.. ఎలిమినేటర్‌లో ముంబైపై బెంగళూరు గెలుపు

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 15, 2024 11:33 PM IST

WPL 2024 RCB vs MI Eliminator: డబ్ల్యూపీఎల్ ఫైనల్‍కు దూసుకెళ్లింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఎలిమినేటర్ మ్యాచ్‍లో ముంబైను చిత్తుచేసిన స్మృతిసేన టైటిల్ ఫైట్‍కు చేరుకుంది. తక్కువ స్కోరును కాపాడుకొని మ్యాచ్ గెలిచింది బెంగళూరు.

WPL 2024 RCB: ఫైనల్‍లో అడుగుపెట్టిన స్మృతిసేన.. ఎలిమినేటర్‌లో ముంబైపై బెంగళూరు గెలుపు
WPL 2024 RCB: ఫైనల్‍లో అడుగుపెట్టిన స్మృతిసేన.. ఎలిమినేటర్‌లో ముంబైపై బెంగళూరు గెలుపు (PTI)

Women’s Premier League 2024 RCB vs MI: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‍లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు ఫైనల్ ఫైట్‍కు చేరుకుంది. ఎలిమినేటర్‌లో ముంబై ఇండియన్స్ (MI) జట్టుపై స్మృతి మంధాన సారథ్యంలోని బెంగళూరు ఉత్కంఠ విజయం సాధించింది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 ఎలిమినేటర్ మ్యాచ్‍లో బెంగళూరు 5 పరుగుల తేడాతో ముంబైపై ఉత్కంఠ పోరులో గెలిచింది. దీంతో హర్మన్ ప్రీత్ సారథ్యంలోని డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి ఔట్ అయింది. డబ్ల్యూపీఎల్ రెండో ఎడిషన్‍లో బెంగళూరు ఫైనల్‍కు దూసుకెళ్లింది.

ఈ ఎలిమినేటర్ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 135 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా స్టార్ ఎలిస్ పెర్రీ (66) నిలకడగా ఆడి కీలకమైన అర్ధ శకతం చేశారు. జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో నిలిచారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో హేలీ మాథ్యూస్, నాట్ స్కీవెర్ బ్రంట్, సైకా ఇషాక్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. లక్ష్యఛేదనలో 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేసి ముంబై ఓడింది. ఓ దశలో ముంబై గెలిచేలా ఉండగా.. బెంగళూరు బౌలర్లు చివర్లో కట్టడి చేశారు. ముంబై బ్యాటర్లలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ (33), అమెలియా కేర్ (27 నాటౌట్) పర్వాలేదనిపించారు.

ఆదుకున్న పెర్రీ

ఈ మ్యాచ్‍లో బెంగళూరు ముందుగా బ్యాటింగ్‍కు దిగగా స్మృతి మంధాన (10), సోఫీ డివైన్ (10), దిక్షా కసట్ (0), రిచా ఘోష్ (14) వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దీంతో 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది బెంగళూరు. ఈ తరుణంలో ఎలీస్ పెర్రీ మరోసారి అద్భుతంగా ఆడారు. పరిస్థితికి తగ్గట్టు నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. మరో ఎండ్‍లో వికెట్లు పడుతున్నా ముంబై బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో 40 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశారు ఎలీస్ పెర్రీ. చివరి ఓవర్ వరకు నిలిచారు. చివర్లో జార్జియా వరేహమ్ (18 నాటౌట్) విలువైన రన్స్ చేశారు. దీంతో 135 రన్స్ చేయగలిగింది ఆర్సీబీ.

కట్టడి చేసిన ఆర్సీబీ బౌలర్లు

ముంబై ఇండియన్స్ గెలిచేందుకు చివరి మూడు ఓవర్లలో 20 పరుగులే చేయాల్సి ఉండింది. ఈ క్రమంలో హర్మన్ ప్రీత్, అమేరియా కేర్ క్రీజులో ఉన్నారు. అయితే, 18వ ఓవర్ వేసిన బెంగళూరు బౌలర్ శ్రేయాంక పాటిల్ కేవలం 4 పరుగులు ఇచ్చి.. కీలకమైన హర్మన్ వికెట్ తీశారు. ఆ తర్వాతి ఓవర్లో సోఫీ మలీనెక్స్ కూడా నాలుగు రన్స్ మాత్రమే ఇచ్చి సంజనను పెవిలియన్ పంపారు. దీంతో చివరి ఓవర్లో గెలుపునకు ముంబై జట్టుకు 12 రన్స్ అవసరమయ్యాయి. బెంగళూరు స్పిన్నర్ ఆశా శోభన్ కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఇలా ఓడిపోతుందనుకున్న దశ నుంచి చివర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన ఆర్సీబీ విజయం సాధించింది.

ఫైనల్ ఫైట్

డబ్ల్యూపీఎల్ 2024 ఫైనల్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ఫైనల్‍లో ఆడనుంది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ ఫైనల్ మార్చి 17వ తేదీన ఢిల్లీ వేదికగానే జరగనుంది. మరి ఈ రెండో ఎడిషన్ డబ్ల్యూపీఎల్ టైటిల్‍ను ఢిల్లీ, బెంగళూరుల్లో ఏ జట్టు కైవసం చేసుకుంటుందో చూడాలి.

Whats_app_banner