Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత నీ ఫ్యూచరేంటో చూసుకో..: రోహిత్‌కు స్పష్టం చేసిన బీసీసీఐ.. కోహ్లికి మరింత సమయం!
Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ టీమిండియాలో ఉంటాడా లేదా అన్నదానిపై బీసీసీఐ కీలకమైన హింట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రోహిత్ కు బోర్డు సూచించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు వెల్లడించింది.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీ అతని కెరీర్లో చివరిది అవుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. ఈ మెగా టోర్నీ తర్వాత తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా రోహిత్ కు బీసీసీఐ స్పష్టం చేసింది. విరాట్ కోహ్లికి మాత్రం మరింత సమయం దక్కనుంది.

రోహిత్ శర్మకు ఛాంపియన్స్ ట్రోఫీ చివరిదా?
స్వదేశంలో న్యూజిలాండ్ చేతుల్లో వైట్ వాష్, ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్ ఓటమి, ఫామ్ లేమితో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో అతడు ఏం చేయబోతున్నాడన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ నేపథ్యంలో ఈ మెగా టోర్నీ తర్వాత తన భవిష్యత్తుపై రోహిత్ నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ స్పష్టం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు తెలిపింది. "గత సెలెక్షన్ కమిటీ మీటింగ్ లోనే సెలెక్టర్లు, బీసీసీఐ సభ్యులు రోహిత్ శర్మతో ఈ విషయంపై చర్చించారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్తు ఎలా ఉండాలన్నది తనే నిర్ణయించుకోవాలని సూచించారు.
వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్ విషయంలో టీమ్ మేనేజ్‌మెంట్ కు ఓ ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. అందరూ అందుకు అనుగుణంగా ఉండాలని భావిస్తోంది" అని బోర్డు వర్గాలు వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు తెలిపింది. 38 ఏళ్ల రోహిత్ శర్మ మరెంతో కాలం ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా వరుస ఓటములు, ఫామ్ లేమితో అతని కెరీర్ అర్ధంతరంగా ముగిసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇప్పటికే టీ20 క్రికెట్ కు అతడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్పుడు ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో అత్యద్భుతమైన ప్రదర్శన ఇస్తే తప్ప రోహిత్ ఆ తర్వాత ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లే అవకాశాలైతే కనిపించడం లేదు.
విరాట్ కోహ్లికి మరింత సమయం
రోహిత్ శర్మలాగే మరో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా కొన్నాళ్లుగా ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. అయితే రోహిత్ లాగా కాకుండా కోహ్లికి మరింత సమయం ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు కూడా ఈ రిపోర్టు తెలిపింది.
రోహిత్ కంటే కోహ్లి ఓ ఏడాది చిన్నవాడు. అతని ఫిట్‌నెస్ పరంగా చూసినా మరో వన్డే వరల్డ్ కప్ వరకూ ఆడగలడు. అయితే అది జరగాలంటే అతనికి కూడా ఇంగ్లండ్ తో వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కీలకం కానున్నాయి.
తనకు బాగా అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్ కావడంతో కోహ్లి తనను తాను నిరూపించుకోవడానికి ఇదే మంచి సమయం. అయితే టెస్టుల విషయంలోనూ కోహ్లికి మరో ఛాన్స్ ఇవ్వాలని సెలెక్టర్లు భావిస్తున్నారు. ఆ లెక్కన అతడు ఇంగ్లండ్ టూర్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత కథనం