Rohit Sharma Daughter: మా నాన్న మళ్లీ నవ్వుతాడు..: రోహిత్ శర్మ కూతురి క్యూట్ ఆన్సర్.. వీడియో వైరల్
Rohit Sharma Daughter: మా నాన్న మళ్లీ నవ్వుతాడు అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూతురు ఇచ్చిన ఆన్సర్ అభిమానుల మనసులు గెలుచుకుంటోంది. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
Rohit Sharma Daughter: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు ఎలా ఉన్నాడు? వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి తర్వాత అతడు మళ్లీ మీడియా కంట పడలేదు. ఆ ఓటమి తర్వాత ఫీల్డ్ లోనే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఎంతో నిరాశగా కనిపించాడు. అయితే ప్రస్తుతం అతడు ఎలా ఉన్నాడో రోహిత్ కూతురు సమైరా ఓ క్యూట్ అప్‌డేట్ ఇచ్చింది.

ఆమె ఎంతో అమాయకంగా మా నాన్న తొందర్లోనే మళ్లీ నవ్వుతాడు అని చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో సమైరా తన తల్లి, రోహిత్ భార్య రితికాతో కలిసి ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అప్పుడు అక్కడే ఉన్న కొంతమంది అభిమానులు.. ఆమెను చూసి పలకరించారు. హాయ్ హౌ ఆర్ యూ అని అడిగారు.
దీనికి సమైరా స్పందించడంతో.. మీ నాన్న ఎక్కడ? ఇప్పుడెలా ఉన్నాడు అని వాళ్లు అడిగారు. "అతడు తన రూమ్ లోనే ఉన్నాడు. చాలా పాజిటివ్ గానే ఉన్నాడు. నెల రోజుల్లో మళ్లీ నవ్వుతాడు" అని సమైరా చెప్పింది. దీంతో అక్కడున్న వాళ్లంతా నవ్వేశారు. ఇంతలో రితికా పిలవడంతో ఆమె వెళ్లిపోయింది. సమైరా ఎంత ముద్దుగా ఉందో.. ఆమె ఇచ్చిన సమాధానం కూడా అంతే ముద్దుగా అనిపించింది.
సమైరా అలా చెబుతంటే.. రితికా కూడా నవ్వుతూ ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లింది. అయితే తమ పాపను రోహిత్, రితిక ఎంత బాగా పెంచుతున్నారో దీనిని బట్టే తెలుస్తోందని నెటిజన్స్ ఈ వీడియో చూసి కామెంట్స్ చేస్తున్నారు. పరిచయం లేని వాళ్లు మాట్లాడించినా కూడా ఆ పాప ఎంతో వినయంగా మాట్లాడి, అడిగిన వాటికి సమాధానాలు చెప్పడం ఫ్యాన్స్ కు బాగా నచ్చింది.
మరోవైపు వరల్డ్ కప్ లో ఓడిన తర్వాత రోహిత్ ఫ్యూచర్ ఏంటన్నది ఇంకా తెలియలేదు. ప్రస్తుతానికి అతడు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఇక భవిష్యత్తులో టీ20లు ఆడకపోవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి. వన్డే, టెస్ట్ క్రికెట్ లోనే మరికొన్నాళ్లు కొనసాగవచ్చు. 2027లో వరల్డ్ కప్ వరకూ అతడు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగేది మాత్రం అనుమానమే.