Yuvraj Singh on Rohit: టీమిండియాలో ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు: యువరాజ్ సింగ్
Yuvraj Singh on Rohit Sharma: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‍లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రదర్శనపై మాజీ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. మరిన్ని విషయాలపై మాట్లాడాడు.
Yuvraj Singh on Rohit Sharma: ఈ ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నీకి భారత్ అతిథ్యమివ్వనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీన వరకు ఈ మెగాటోర్నీ జరగనుంది. ఈ టోర్నీలో టీమిండియా ప్రధాన ఫేవరెట్‍గా ఉన్నా కొందరి ఫామ్, మరికొందరు ఆటగాళ్ల గాయాలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొంతకాలంగా సరైన ఫామ్‍లో లేడు. దీంతో ప్రపంచకప్‍లో అతడు ఎలా ఆడతాడోననే టెన్షన్ కొందరిలో ఉంది. అయితే, ఈ విషయంపై టీమిండియా మాజీ స్టార్ ఆల్‍రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు.
ఈ ఏడాది ప్రపంచకప్‍లో రోహిత్ శర్మ చెలరేగుతాడని యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. క్రిక్ బసు యూట్యూబ్ ఛానెల్‍లో ఈ విషయంపై మాట్లాడాడు. “ప్రస్తుతం రోహిత్ శర్మ తన బెస్ట్ ఫామ్‍లో లేడనే విషయాన్ని నేను అర్థం చేసుకున్నా. గతసారి 2019 ప్రపంచకప్ ముందు కూడా ఐపీఎల్‍లో రోహిత్ ఫామ్‍లో లేడు. కానీ 2019 ప్రపంచకప్ టోర్నీలో ఐదు సెంచరీలు చేశాడు. ప్రపంచకప్‍లో చెలరేగి ఆడేందుకే అతడు ప్రస్తుతం ఫామ్‍లో లేడేమో. ప్రతీది ఏదో ఓ కారణం వల్లే జరుగుతుంది. నాతో సచిన్ కూడా ఇలాంటి మాటలే గతంలో చెప్పాడు” అని యువరాజ్ సింగ్ అన్నాడు. 2019 ఐపీఎల్‍లో రోహిత్ సరైన ఫామ్ కనబరచలేదని యువీ ఈ ఇంటర్వ్యూలో చెప్పినా.. వాస్తవంగా ఆ సీజన్లో అతడు బాగానే రాణించాడు.
మంచి కెప్టెన్‍కు మంచి టీమ్ ఉండడం కూడా ముఖ్యమని యువరాజ్ సింగ్ అన్నాడు. ఎంఎస్ ధోనీ మంచి కెప్టెన్ అని, అయితే అతడికి అనుభవజ్ఞులతో కూడిన మంచి జట్టు అప్పుడు దొరికిందని యువీ చెప్పాడు. జట్టు ఒత్తిడిలో ఉన్నప్పుడు నేనున్నాంటూ ముందుకు వచ్చి సత్తాచాటే ఆటగాళ్లు అప్పటి టీమ్‍లో ఉన్నారని, అయితే ప్రస్తుతం టీమిండియాలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని యువరాజ్ అన్నాడు.
“రోహిత్ మంచి కెప్టెన్. ముంబై ఇండియన్స్ జట్టుకు అతడు చాలా కాలంగా సారథ్యం వహిస్తున్నాడు. ఒత్తిడిలోనూ అతడు సెన్సిబుల్‍గా ఉంటాడు. ఎంత మంచి కెప్టెన్ అయినా.. అతడికి మంచి టీమ్ ఉండాలి. గతంలోనూ ఇది నిరూపితమైంది. ఎంఎస్ ధోనీ ఒక గుడ్ కెప్టెన్. అయితే, అతడికి అంతే సమానమైన అనువజ్ఞులతో కూడిన మంచి జట్టు దొరికింది. వారందరూ కొన్ని స్పెషల్ ఇన్నింగ్స్ ఆడారు. మంచి స్పెల్స్ వేశారు. ఒత్తిడిలో ఉన్నప్పుడే ఆటగాళ్లు ముందుకు వచ్చి రాణించాలి. అయితే, ప్రస్తుతం అది టీమిండియాలో కనిపించడం లేదు” అని యువరాజ్ సింగ్ అన్నాడు.