భారత మాజీ కెప్టెన్, బీసీసీఐ చైర్మన్‌గా పనిచేసిన సౌరవ్ గంగులీ రోహిత్ శర్మ టెస్ట్ ఫామ్ గురించి స్పందించారు. గత నాలుగు-ఐదు సంవత్సరాలుగా రోహిత్ టెస్ట్ ఫామ్ ఆయనను ఆశ్చర్యపరుస్తోందని గంగులీ అన్నారు.
ఈ కాలంలో రోహిత్ తన సామర్థ్యాన్ని కంటే చాలా తక్కువగా ఆడాడని, అతను మరింత బాగా ఆడగలడని ఆయన అభిప్రాయపడ్డారు. టెస్ట్ క్రికెట్లో రోహిత్ శర్మ ఫామ్ మాత్రమే కాదు, కెప్టెన్సీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. భారత్ గత 10 టెస్ట్ మ్యాచ్‌లలో కేవలం 3 మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌లలో రోహిత్ 8 మ్యాచ్‌లు ఆడాడు. ఒక్కసారి కూడా అర్ధశతకం సాధించలేదు.
ఈమేరకు గంగులీ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ ఫామ్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. రెవ్‌స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ, "గత 4-5 సంవత్సరాలలో రెడ్ బాల్ క్రికెట్‌లో అతని ఫామ్ నన్ను ఆశ్చర్యపరిచింది. అతని స్థాయి, సామర్థ్యం ఉన్న ఆటగాడు. అతను ఇప్పుడు చేస్తున్న దానికంటే చాలా బాగా చేయగలడు. అతను తన ఆలోచనలపై దృష్టి పెట్టాలి, ఎందుకంటే ఇంగ్లాండ్‌తో 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాలి. ఇది మరో కష్టతరమైన సిరీస్ కాబోతుంది." అని అన్నారు. ఇప్పటి వరకు ఉన్న వార్తల ప్రకారం, రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనలో కూడా జట్టు కెప్టెన్‌గా ఉండవచ్చు.
"ఆస్ట్రేలియాలో జరిగినట్లే బంతి స్వింగ్ అవుతుంది, సీమ్ అవుతుంది. ఇంగ్లాండ్ పర్యటనలో రెడ్ బాల్ క్రికెట్‌లో అతని ప్రదర్శన భారత జట్టుకు చాలా అవసరం. కానీ వైట్ బాల్ క్రికెట్‌లో అతను ఇప్పటివరకు అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడు." అని గంగూలీ వ్యాఖ్యానించారు.
ఛాంపియన్స్ ట్రోఫీ విజయం రోహిత్ శర్మ ప్రతిభకు మరింత వెలుగునిచ్చింది. అతను ఒక సంవత్సరం కంటే తక్కువ సమయంలో రెండు ఐసీసీ టోర్నమెంట్లు గెలిచాడు. అందువల్ల, అతను కెప్టెన్‌గా ఇంగ్లాండ్ వెళితే ఆశ్చర్యం ఉండదు. ఇక చీఫ్ సెలెక్టర్ దీనిపై నిర్ణయం తీసుకోవాలి.
సంబంధిత కథనం