Rohit Sharma: టెస్టు కెప్టెన్సీ గురించి సెలెక్టర్లకు రోహిత్ శర్మ క్లారిటీ ఇచ్చేశాడట! ఏం చెప్పాడంటే..
Rohit Sharma - Team India: వరుసగా రెండు టెస్టు సిరీస్‍ల్లో పరాభవాలు ఎదురవడంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. అతడి కెప్టెన్సీ ఉంటుందా అనే సందేహాలు ఉన్నాయి. ఈ తరుణంలో టెస్టు కెప్టెన్సీ గురించి తన మాటను సెలెక్టర్లకు రోహిత్ చెప్పేశాడట. ఆ వివరాలు ఇవే..
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా తీవ్రంగా నిరాశపరిచింది. ఇటీవల ఆసీస్ గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍ను 1-3తో కోల్పోయింది. అంతకు ముందు స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‍లో న్యూజిలాండ్ చేతిలో 0-3తో టీమిండియా పరాభవం చెందింది. సొంతగడ్డపై తొలిసారి టెస్టు సిరీస్‍లో క్లీన్ స్వీప్‍నకు గురైంది. చివరిగా ఆడిన 8 టెస్టుల్లో ఆరింట ఓడింది భారత్. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్‍లోనూ అతడు పేలవ ఫామ్‍లో ఉన్నాడు. ఈ తరుణంలో టీమిండియా పర్ఫార్మెన్స్ గురించి రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, బీసీసీఐ అధికారుల మధ్య తాజాగా ఓ సమావేశం జరిగింది. దీంట్లో టెస్టు కెప్టెన్సీ గురించి రోహిత్ ఓ స్పష్టత ఇచ్చాడని సమాచారం.
కొన్ని నెలలే..
తాను టీమిండియా టెస్టు కెప్టెన్‍గా ఇక కొన్ని నెలల పాటే ఉంటానని బీసీసీఐ అధికారులకు రోహిత్ శర్మ చెప్పేశాడని తెలుస్తోంది. ఈ విషయాన్ని దైనిక్ జాగరణ్ రిపోర్ట్ వెల్లడించింది. “తదుపరి కెప్టెన్‍ను బీసీసీఐ ఎంపిక చేసే వరకు అతడు ఇంకొన్ని నెలలు టెస్టు టీమ్ సారథిగా ఉంటాడు” అని ఆ రిపోర్ట్ వెల్లడించింది. కెప్టెన్‍గా ఎవరిని ఎంపిక చేసినా తాను పూర్తి మద్దతు ఇస్తానని రోహిత్ శర్మ చెప్పాడట.
రోహిత్ శర్మ వన్డే కెప్టెన్సీపై ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ టోర్నీలో టీమిండియా పర్ఫార్మెన్స్‌ను బట్టి రోహిత్‍ను వన్డే జట్టుకు సారథిగా కొనసాగించాలా లేదా అనేది డిసైడ్ కానుంది. మొత్తానికైతే.. టెస్టు కెప్టెన్‍గా కొన్ని నెలలే ఉంటానని హిట్‍మ్యాన్ క్లారిటీ ఇచ్చేసినట్టు తెలుస్తోంది.
2024 టీ20 ప్రపంచకప్ టైటిల్ కైవసం చేసుకున్న తర్వాత అంతర్జాతీయ టీ20ల నుంచి రోహిత్ శర్మ రిటైర్ అయ్యాడు. టెస్టు, వన్డే జట్లకు కెప్టెన్‍గా కొనసాగాడు. భారత టీ20 జట్టు కెప్టెన్సీని సూర్యకుమార్ యాదవ్ చేపట్టాడు.
బుమ్రాకు కెప్టెన్సీ?
భారత టెస్టు కెప్టెన్సీ స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రాకు ఇచ్చే విషయంపై కూడా ఈ మీటింగ్‍లో చర్చ జరిగిందట. బుమ్రా అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‍లోనూ 32 వికెట్లు పడగొట్టి అదరగొట్టారు. ఈ సిరీస్‍లో తొలి, చివరి టెస్టులకు బుమ్రా కెప్టెన్సీ చేశాడు. దీంట్లో ఫస్ట్ మ్యాచ్‍లో భారత్ గెలిచింది. రోహిత్ తర్వాత టెస్టు జట్టు కెప్టెన్సీని బుమ్రా ఇవ్వాలనేలా చర్చ సాగిందని సమాచారం.
అయితే, బుమ్రాపై పని భారం ఎక్కువగా పడుతుందనేలా కూడా బీసీసీఐ ఆలోచిస్తోందని తెలుస్తోంది. అలాగే, గాయం రిస్క్ కూడా అతడికి ఎక్కువగా ఉంటుందని భావిస్తోందట. దీంతో బుమ్రాను తదుపరి కెప్టెన్‍గా చేయాలనే నిర్ణయంపై మరింత సమాలోచనలు జరపాలని బీసీసీఐ అధికారులు చెప్పారని తెలుస్తోంది. బుమ్రాను ఫుల్ టైమ్ కెప్టెన్‍ను చేసే విషయాన్ని ఇప్పటికి వాయిదా వేశారని తెలుస్తోంది.
భారత్ తదుపరి ఇంగ్లండ్‍తో స్వదేశంలో ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‍లు ఆడనుంది. జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 మధ్య ఈ సిరీస్‍లు జరగనున్నాయి. ఫిబ్రవరి 19న ఐసీసీ వన్డే ఛాంపియన్స్ ట్రోఫీ మొదలుకానుంది.
సంబంధిత కథనం