Rohit Sharma: ఆ ముగ్గురి వల్లే టీ20 వరల్డ్ కప్ గెలిచాం.. తగ్గేదే లేదు.. ఆ ట్రోఫీ కూడా గెలుస్తాం: రోహిత్ శర్మ వార్నింగ్
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తాము టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురు మూల స్తంభాల గురించి వెల్లడించాడు. అంతేకాదు తాను ఇక్కడితో ఆగనని, వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుస్తామని స్పష్టం చేశాడు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బుధవారం (ఆగస్ట్ 21) సియెట్ అవార్డుల కార్యక్రమం వేదికగా ప్రత్యర్థులకు గట్టి వార్నింగే ఇచ్చాడు. తాను ఊరికనే ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవలేదని, ఇక్కడితో ఆగనని స్పష్టం చేశాడు. అంతేకాదు ఈ మధ్యే గెలిచిన టీ20 వరల్డ్ కప్ విజయంలో ముఖ్యపాత్ర పోషించిన ముగ్గురు మూడు స్తంభాల గురించి కూడా వెల్లడించాడు.
ఆ ముగ్గురి వల్లే గెలిచాం: రోహిత్
టీమిండియా 17 ఏళ్ల తర్వాత ఓ టీ20 వరల్డ్ కప్.. 11 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ ట్రోఫీ.. 13 ఏళ్ల తర్వాత ఓ వరల్డ్ కప్ గెలిచిన సంగతి తెలుసు కదా. ఇండియాకు టీ20 వరల్డ్ కప్ అందించిన రెండో కెప్టెన్ గా నిలిచిన రోహిత్ శర్మ.. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన వాళ్ల గురించి సియెట్ అవార్డు వేడుకలో చెప్పుకొచ్చాడు. ఈ విజయానికి బీసీసీఐ సెక్రటరీ జై షా, అప్పటి హెడ్ కోచ్ ద్రవిడ్, చీఫ్ సెలక్టర్ అగార్కర్ లకు క్రెడిట్ ఇచ్చాడు.
బుధవారం (ఆగస్ట్ 21) రాత్రి ముంబైలో సియెట్ క్రికెట్ అవార్డుల కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొన్న రోహిత్ మాట్లాడుతూ.. "ఈ టీమ్ ను పూర్తిగా రూపాంతరం చెందించడం అనేది నా కలగా ఉండేది. స్టాల్స్, ఫలితాల గురించి ఆలోచించకుండా ప్లేయర్స్ అందరూ ఫీల్డ్ లోకి వెళ్లి స్వేచ్ఛగా రాణించే వాతావరణం కల్పించాలని భావించాను. అదే అవసరం అయ్యింది. దీనికి ముగ్గురు మూల స్తంభాల నుంచి నాకు సాయం దక్కింది. వాళ్లు జై షా, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్. నేను సాధించినదానికి అదే కీలకం అయ్యింది. ఇక ప్లేయర్స్ ను తక్కువ చేయలేం. టీమ్ సాధించిన ఘనతలో ఎవరి పాత్ర వాళ్లు పోషించారు" అని రోహిత్ అన్నాడు.
ఇక్కడితో ఆగను: రోహిత్
ఈ సందర్భంగా రోహిత్ శర్మ ప్రత్యర్థులకు ఓ వార్నింగ్ కూడా ఇచ్చాడు. తాను ఏదో అలా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవలేదని, ఇక్కడితో ఆగనని చెప్పాడు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ లాంటివి ఉన్న నేపథ్యంలో రోహిత్ కామెంట్స్ కు ప్రాధాన్యత సంతరించుకుంది. మరిన్ని ట్రోఫీలు తన కేబినెట్ లో చేర్చుకోవడమే లక్ష్యమని అతడు స్పష్టం చేశాడు.
"నేను ఐదు ఐపీఎల్ ట్రోఫీలు గెలవడానికి ఓ కారణం ఉంది. నేను ఆగేదే లేదు. ఎందుకంటే ఒక్కసారి గెలుపు రుచి చూసిన తర్వాత, ట్రోఫీల రుచి చూసిన తర్వాత ఆగాలని అనిపించదు. టీమ్ ను ఆ దిశగా ముందుకు తీసుకెళ్తాం. భవిష్యత్తులో మరిన్ని మరుపురాని విజయాలు సాధించడానికి ప్రయత్నిస్తాం" అని రోహిత్ స్పష్టం చేశాడు.
అయితే ఈ మధ్యే శ్రీలంక చేతుల్లో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ ఓడిపోయింది టీమిండియా. ఇప్పుడు వచ్చే నెలలో బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడానికి స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్ సిరీస్ లతోపాటు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్ లు కీలకం కానున్నాయి.