Rohit Sharma Retirement Talk With Ajit Agarkar: గత ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌కు సారథ్యం వహించిన రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు.
దీంతో ఈ ముగ్గురి రిటైర్‌మెంట్‌పై అత్యంత క్యూరియాసిటీ నెలకొంది. అయితే, పీటీఐ నివేదిక ప్రకారం ముంబై ఇండియన్స్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇవాళ (మార్చి 9) జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ తర్వాత తన వన్డే భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్‌మెంట్, భవితవ్యంపై తనతో బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ చర్చించనున్నారు. దీంతో రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై ఆసక్తిగా మారింది. కాగా ఫైనల్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో శుభ్‌మన్ గిల్‌ను కూడా రోహిత్ వన్డే భవితవ్యం గురించి అడిగారు.
దాంతో రోహిత్ శర్మ రిటైర్‌మెంట్ గురించి "డ్రెస్సింగ్ రూమ్‌లో కానీ, నాతో కానీ ఎలాంటి చర్చ జరగలేదు. రోహిత్ భాయ్ కూడా మనలాగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు అయితే అలాంటిదేమీ లేదు" అని శుభ్‌మన్ గిల్ సమాధానం ఇచ్చాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌పై ఓ క్లారిటీ రానుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఓపెనర్లలో ఒకరిగా పేరొందిన రోహిత్ శర్మ కెరీర్‌లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3), ప్రపంచకప్‌లలో అత్యధిక సెంచరీలు (7), టీ20ల్లో అత్యధిక సెంచరీలు (5) చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. ఐదు టీ20 సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా, టీ20ల్లో 35 బంతుల్లోనే అత్యంత వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్‌గా సత్తా చాటాడు.
37 ఏళ్ల రోహిత్ శర్మ ఒక వన్డే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన ఆటగాడిగా, వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు నమోదు చేసిన ఏకైక క్రికెటర్‌గా, ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా ఘనత సాధించాడు. టీ20ల్లో కెప్టెన్‌గా 50 మ్యాచ్‌లు గెలిచిన ఏకైక ఆటగాడిగా, అన్ని ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్‌లో ఒక జట్టుకు నాయకత్వం వహించిన తొలి, ఏకైక కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు.
ఇకపోతే న్యూజిలాండ్‌తో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ భారీ స్కోర్ సాధించాలని చూస్తున్నాడు. అలాగే, వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలవడానికి మరో 55 పరుగులు చేయాల్సిన విరాట్ కోహ్లీపై ఇవాళ అందరి దృష్టి ఉంది.
2023 ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్ టెండూల్కర్ (49 వన్డే సెంచరీల) రికార్డును అధిగమించాడు విరాట్ కోహ్లీ. అయితే, విరాట్ కోహ్లీ రిటైర్‌మెంట్‌పై మాత్రం ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేదు.
సంబంధిత కథనం