Rohit Sharma on Retirement: వాళ్లు నిర్ణయించలేరు: రిటైర్మెంట్‍పై రోహిత్ కీలక కామెంట్స్.. ఎందుకు ఆడడం లేదో చెప్పిన స్టార్
Rohit Sharma on Retirement - IND vs AUS: తాను టెస్టు క్రికెట్‍కు రిటైర్మెంట్ ప్రకటిస్తాననే రూమర్లపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తాను ఎక్కడికీ వెళ్లడం లేదంటూనే కొన్ని కీలక కామెంట్లు చేశాడు. రిటైర్మెంట్ పుకార్లకు గట్టి సమాధానం ఇచ్చాడు.
భారత కెప్టెన్ రోహిత్ శర్మ.. టెస్టు క్రికెట్‍కు ఇక గుడ్‍బై చెబుతాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆస్ట్రేలియాతో కీలకమైన ఐదో టెస్టు తుదిజట్టులో రోహిత్ శర్మ లేడు. అతడే తప్పుకున్నాడని కెప్టెన్‍గా బాధ్యతలు తీసుకున్న స్టార్ పేసర్ జస్‍ప్రీత్ బుమ్రా చెప్పాడు. ఫామ్‍లో లేని కారణంగా హిట్‍మ్యాన్‍పై మేనేజ్‍మెంట్ వేటువేసిందని, అతడు రిటైర్మెంట్ పలికినట్టేననే రూమర్లు గట్టిగా వస్తున్నాయి. ఈ తరుణంలో ఐదో టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయంలో కామెంటేటర్లో రోహిత్ శర్మ మాట్లాడాడు. తన రిటైర్మెంట్‍పై వస్తున్న రూమర్ల గురించి స్పందించాడు.
అందుకే ఈ మ్యాచ్ ఆడడం లేదు
తాను సరైన ఫామ్‍లో లేనందునే ఆస్ట్రేలియాతో ఐదో టెస్టు ఆడడం లేదని కామెంటేటర్లతో ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ స్పష్టం చేశాడు. “నేను ఫామ్‍లో లేను. అందుకే ఆడడం లేదు. జీవితం ప్రతీ రోజూ మారుతుంటుంది. పరిస్థితులు మారతాయని నేను కచ్చితంగా నమ్ముతున్నా” అని హిట్‍మ్యాన్ అన్నాడు. తాను ఇప్పట్లో రిటైర్ అవనని చెప్పేశాడు.
జట్టు నుంచి తప్పించారా, విశ్రాంతి ఇచ్చారా అనే ప్రశ్నకు కూడా రోహిత్ శర్మ స్పందించాడు. “లేదు. నా బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు. అందుకే పక్కన కూర్చుంటానని సెలెక్టర్లు, కోచ్‍కు నేనే చెప్పా” అని రోహిత్ వెల్లడించాడు.
వాళ్లు నిర్ణయించలేరు
తన రిటైర్మెంట్‍పై వస్తున్న రూమర్లపై రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. “ల్యాప్‍టాప్ తీసుకొని, పెన్ను పేపర్ పెట్టుకొని బయటకూర్చునే వారు.. నా రిటైర్మెంట్ ఎప్పుడు వస్తుందో నిర్ణయించలేరు. ఆ నిర్ణయం నేను తీసుకోవాలి” అని రోహిత్ స్పష్టం చేశాడు.
మళ్లీ కమ్‍బ్యాక్ చేస్తా
తాను ఇప్పట్లో టీమిండియాకు వీడ్కోలు చెప్పనని, ఈ మ్యాచ్ నుంచి మాత్రమే తప్పుకున్నానని రోహిత్ చెప్పేశాడు. తాను మళ్లీ సత్తాచాటగలననే నమ్మకం ఉందని అన్నాడు. “ఇప్పట్లో ఆటను వదిలేయాలని అనుకోవడం లేదు. ఫామ్‍లో లేనందునే బయట ఉన్నా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో మనకు తెలియదు. నేను మళ్లీ స్కోర్ చేయడం ప్రారంభించవచ్చు. లేకపోతే అలా జరగకపోవచ్చు. కానీ నేను కచ్చితంగా కమ్‍బ్యాక్ ఇస్తాననే నమ్మకం ఉంది” అని రోహిత్ చెప్పాడు.
నేను ఎక్కడికి వెళ్లడం లేదు
ఈ క్రమంలో థాంక్యూ రోహిత్ అని కామెంటేటర్ జతిన్ సప్రూ అన్నారు. దీంతో.. అరే భాయ్.. నేను ఎక్కడికి వెళ్లడం లేదు అని నవ్వుతూ అన్నాడు రోహిత్ శర్మ. దీంతో ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థాంక్యూ అంటూ జతిన్ స్పష్టంగా చెప్పారు.
మ్యాచ్ పరిస్థితి ఇలా..
ఐదో టెస్టు రెండో రోజు లంచ్ విరామ సమయానికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 101 పరుగులు చేసింది. వెబ్‍స్టర్ (28 నాటౌట్), అలెక్స్ కేరీ (4 నాటౌట్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ చెరో రెండు వికెట్లతో సత్తాచాటారు. ప్రసిద్ధ్ కృష్ణకు ఓ వికెట్ దక్కింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 185 పరుగులు చేసింది. ఈ ఐదు టెస్టుల సిరీస్‍లో ఆసీస్ 2-1తో ముందంజలో ఉంది. దీంతో ఈ సిరీస్ డ్రా కావాలంటే ఈ చివరి మ్యాచ్‍లో భారత్ గెలువాల్సిందే.
సంబంధిత కథనం