T20 World Cup 2024: రెండు గంటల పాటు చర్చించిన రోహిత్ శర్మ, ద్రవిడ్, అగార్కర్! ముఖ్యమైన విషయాలివే..-rohit sharma rahul dravid and ajit agarkar meets for 2 hours and finalised india squad for t20 world cup 2024 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  T20 World Cup 2024: రెండు గంటల పాటు చర్చించిన రోహిత్ శర్మ, ద్రవిడ్, అగార్కర్! ముఖ్యమైన విషయాలివే..

T20 World Cup 2024: రెండు గంటల పాటు చర్చించిన రోహిత్ శర్మ, ద్రవిడ్, అగార్కర్! ముఖ్యమైన విషయాలివే..

T20 World Cup 2024 - Team India: టీ20 ప్రపంచకప్ టోర్నీకి భారత జట్టు ఎంపికపై తీవ్రమైన కసరత్తులు జరుగుతున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా రెండు గంటల పాటు చర్చించారని తెలుస్తోంది.

T20 World Cup 2024: రెండు గంటల పాటు చర్చించిన రోహిత్ శర్మ, ద్రవిడ్, అగార్కర్! ముఖ్యమైన విషయాలివే.. (ANI)

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీకి భారత జట్టు ప్రకటనకు సమయం సమీపిస్తోంది. జూన్‍లో జరగనున్న ఈ మెగాటోర్నీ కోసం మే 1వ తేదీలోగా జట్టును బీసీసీఐ ప్రకటించనుంది. 15 మందితో కూడిన జట్టును 48 గంటల్లోనే ఎప్పుడైనా వెల్లడించనుంది. అయితే, ప్రపంచకప్ కోసం భారత దళంలో ఎవరికి చోటు దక్కుతుందనే విషయం ఉత్కంఠగా మారింది. ఈ తరుణంలో ప్రపంచకప్‍కు భారత జట్టు ఎంపిక కోసం కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తాజాగా రెండు గంటల పాటు చర్చించారనే సమాచారం బయటికి వచ్చింది.

దాదాపు తుది నిర్ణయం!

రోహిత్ శర్మ, ద్రవిడ్, అగార్కర్ ఢిల్లీలో సుమారు రెండు గంటల పాటు చర్చించారని తెలుస్తోంది. ఏప్రిల్ 26నే ఓసారి ఈ ముగ్గురు భేటీ అయ్యారట. అయితే, ఆదివారం జరిగిన మీటింగ్‍లో కీలక విషయాలను చర్చించారని సమాచారం. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టును దాదాపు ఫైనలైజ్ చేశారని రెవ్‍స్పోర్ట్స్ రిపోర్ట్ వెల్లడించింది. ఈ మీటింగ్ తర్వాత రోహిత్, అగార్కర్, ద్రవిడ్ ఢిల్లీ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ 2024 సీజన్‍లో ముంబై ఇండియన్ తరఫున ఆడుతున్న రోహిత్ శర్మ.. లక్నోతో తదుపరి మ్యాచ్ కోసం బయలుదేరాడు.

ఐపీఎల్ మాత్రమే కాదు

టీ20 ప్రపంచకప్‍కు టీమిండియా ఎంపిక కోసం ఆటగాళ్ల ఐపీఎల్ ఫామ్‍ను మాత్రమే కాకుండా ఓవరాల్ పర్ఫార్మెన్స్‌ను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే, వెస్టిండీస్ పిచ్‍లు స్లోగా ఉండే కారణంగా ఆ విషయంపై కూడా చర్చించారట. ఆ పిచ్‍లకు ఎవరు సరిపోతారో కూడా మాట్లాడుకున్నారని తెలుస్తోంది.

బ్యాకప్ ఓపెనర్.. వికెట్ కీపింగ్ ఆప్షన్లు

టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయడం దాదాపు ఖాయమైంది. ఇక బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‍నే సెలెక్టర్లు ఎంపిక చేయనున్నారని తెలుస్తోంది. శుభ్‍మన్ గిల్‍కు నిరాశ ఎదురవక తప్పేలా లేద. గతేడాది గిల్ అద్భుతంగా ఆడినా.. కొంతకాలంగా ఫామ్ లేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో జైస్వాల్‍కే సెలెక్టర్లు మొగ్గు చూపుతున్నారు.

వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఎంపికపడం దాదాపు ఖాయంగా మారింది. అయితే, సంజూ శాంసన్, కేఎల్ రాహుల్‍లో ఎవరిని తీసుకోవాలనే విషయంపై జోరుగా చర్చసాగిందని తెలుస్తోంది. ఐపీఎల్‍లో సంజూ ఫుల్ ఫామ్‍లో ఉన్నాడు. దీంతో అతడికే ఛాన్స్ దక్కుతుందని కూడా అంచనాలు ఉన్నాయి.

హార్దిక్‍కు చోటు!

ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‍లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‍గా ఉన్న స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా రాణించలేకపోతున్నాడు. అయినా, టీ20 ప్రపంచకప్‍కు అతడిని ఎంపిక చేసేందుకే సెలెక్టర్లు మెగ్గుచూపుతున్నారని తెలుస్తోంది. అలాగే, శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా కూడా టీమ్‍లో ఉంటారని తెలుస్తోంది.

టీ20 ప్రపంచకప్‍కు భారత జట్టులో పేసర్లుగా జస్‍ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ ఉండనున్నారు. ఒకవేళ ఫామ్‍లో లేని సిరాజ్ వద్దనుకుంటే ఆవేశ్ ఖాన్‍ పేరును కూడా సెలెక్టర్లు పరిశీలించారని తెలుస్తోంది. స్పెషలిస్ట్ స్పిన్నర్‌ కుల్దీప్ యాదవ్ ఉండడం ఖాయం. మొత్తంగా టీ20 ప్రపంచకప్ భారత జట్టులో ఎవరికి చోటు దక్కుతుందో మరో రెండు రోజుల్లోగానే ఉత్కంఠ వీడుతుంది.

అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా జూన్ 1వ తేదీన నుంచి జూన్ 29వ తేదీ వరకు టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ జరగనుంది.