Rohit Sharma: జోక్ చేస్తున్నారా.. నేను ఉన్నంత వరకూ అలా జరగదు: టీమిండియా ఓటమిపై రోహిత్ కామెంట్స్ వైరల్
Rohit Sharma: 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్ ఓటమిపై కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలసత్వం వల్లే ఇలా జరిగిందా అన్న ప్రశ్నకు జోక్ చేస్తున్నారా అంటూ అతడు స్పందించాడు.
Rohit Sharma: టీమిండియాకు అసలు ఊహించని పరాభవం ఎదురైంది. స్టార్లతో నిండిన ఇండియన్ టీమ్.. అనామక శ్రీలంక చేతుల్లో వన్డే సిరీస్ ఓడిపోవడం అభిమానులకు మింగుడు పడటం లేదు. స్పిన్ ఆడేందుకు కిందా మీదా పడిన మన బ్యాటర్లు తగిన మూల్యం చెల్లించుకున్నారు. అయితే ఈ ఓటమికి తమ అలసత్వం మాత్రం కారణం కాదని కెప్టెన్ రోహిత్ శర్మ అంటున్నాడు.
అదొక జోక్: రోహిత్
శ్రీలంకతో సిరీస్ ఓటమిలో జట్టు అలసత్వమే కారణమని అనుకుంటున్నారా అని మూడో వన్డే తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మను ప్రశ్నించగా.. అతడు అదొక జోక్ అంటూ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశాడు. "అదొక జోక్. ఇండియాకు ఆడుతున్న సమయంలో ఎప్పుడూ అలసత్వం అనేది ఉండదు.
నేను ఉన్నంత వరకూ అలా జరగనే జరగదు" అని రోహిత్ అనడం గమనార్హం. శ్రీలంక మంచి క్రికెట్ ఆడిందని, తమ కంటే వాళ్లు బాగా ఆడినట్లు అతడు అంగీకరించాడు.
ఆందోళన అవసరం లేదు
టీమిండియా ఈ సిరీస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం స్పిన్ బౌలింగ్ ను ఎదుర్కోలేకపోవడమే. మూడు వన్డేల్లో 27 వికెట్లు లంక స్పిన్నర్లే తీయడం విశేషం. ముఖ్యంగా యువ స్పిన్నర్ వెల్లాలగె బౌలింగ్ ఆడటానికి మన వాళ్లు చాలా ఇబ్బంది పడ్డారు. అయితే దీనిపై మరీ అంత ఆందోళన అవసరం లేదని, అయితే స్పిన్ బౌలింగ్ ఆడేటప్పుడు ప్రతి బ్యాటర్ కాస్త సీరియస్ గా తమ ప్లాన్స్ గురించి ఆలోచించుకోవాలని అన్నాడు.
"ఇదేమీ ఆందోళన చెందాల్సిన విషయం కాదని అనుకుంటున్నాను. అయితే కాస్త తీవ్రంగా పరిగణించాల్సిన అంశమే. మా వ్యక్తిగత ప్రణాళికల గురించి మాత్రం ఆలోచించుకోవాలి. ఈ సిరీస్ లో అదే లోపించింది" అని రోహిత్ చెప్పాడు. ఈ సిరీస్ ఓటమితో ప్రపంచమేమీ అంతమైపోలేదని అతడు అనడం విశేషం.
"నా వరకు సిరీస్ ఓటమితో ప్రపంచమేమీ ముగిసిపోదు. ఈ ప్లేయర్స్ అందరూ కొన్నేళ్లుగా బాగా ఆడుతున్నారు. నిలకడగా ఆడుతున్నారు. ఎప్పుడో ఒక సిరీస్ ఓడిపోతూ ఉంటాం. ఈ సిరీస్ ఓటమి తర్వాత చాలా అంశాలను సమీక్షించుకోవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆడటానికి ఏం చేయాలన్న అంశాన్ని పరిశీలించాలి" అని రోహిత్ అన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లాంటి సీనియర్ ప్లేయర్స్ ఉన్న టీమ్.. లంక యువ స్పిన్నర్లను ఎదుర్కోలేకపోవడం మాత్రం కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. స్పిన్ ఆడటంలో విఫలం కావడం వల్లే 27 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతుల్లో టీమిండియా ఓ వన్డే సిరీస్ ఓడిపోయింది.