Rohit Sharma: రిషబ్ పంత్‌కు క్లాస్ పీకిన కెప్టెన్ రోహిత్ శర్మ.. అది అతడే తెలుసుకోవాలంటూ..
Rohit Sharma: రిషబ్ పంత్ కు క్లాస్ పీకాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. మెల్‌బోర్న్ టెస్టు రెండు ఇన్నింగ్స్ లో నిర్లక్ష్యంగా ఆడి వికెట్ పారేసుకున్నాడతడు. దీంతో ఈ మ్యాచ్ ఓడిన తర్వాత మీడియాతో మాట్లాడిన రోహిత్.. దూకుడుకు, నిర్లక్ష్యంగా ఆడటానికి మధ్య తేడాను రిషబ్ గుర్తించాలన్నట్లుగా మాట్లాడాడు.
Rohit Sharma: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో టీమిండియా ఓటమికి నాంది రిషబ్ పంత్ వికెట్ తోనే పడింది. చివరి సెషన్ లో ఓ నిర్లక్ష్యపు షాట్ ఆడి పంత్ ఔటైన తర్వాత వరుసగా వికెట్లు పడిపోయాయి. అయితే పంత్ ఔటైన తీరుపై కెప్టెన్ రోహిత్ శర్మ తన అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ అనూహ్య ఓటమి తర్వాత అతడు మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎలా ఆడాలో అతడే అర్థం చేసుకోవాలని, ఇందులో తాను చెప్పేదేమీ లేదని అనడం గమనార్హం.
పంత్‌కు రోహిత్ క్లాస్
మెల్‌బోర్న్ టెస్టును టీమిండియా డ్రా చేసుకోగలదన్న నమ్మకం చివరి రోజు టీ సమయానికి అందరికీ కలిగింది. రెండో సెషన్ అంతా వికెట్ పడకుండా జైస్వాల్ తో కలిసి పంత్ నిలకడగా ఆడాడు. ఈ ఇద్దరూ క్రీజులో ఉంటే.. చివర్లో టీమ్ విజయం కోసం కూడా ప్రయత్నిస్తుందన్న నమ్మకంతో అభిమానులు ఉన్నారు. కానీ చివరి సెషన్ లో లయన్ బౌలింగ్ లో ఓ చెత్త షాట్ ఆడటానికి ప్రయత్నించి లాంగాన్ లో మిచెల్ మార్ష్ కు క్యాచ్ ఇచ్చాడు పంత్.
అప్పటి వరకూ ఎంతో ఓపిగ్గా ఆడిన అతడు.. అనవసరంగా ఆ షాట్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్ లోనూ పంత్ ఇలాంటి షాట్ కే ఔటవగా.. కామెంటరీలో ఉన్న గవాస్కర్ తీవ్రంగా స్పందిస్తూ.. అది మూర్ఖపు షాట్ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇక ఇప్పుడు మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ కూడా అలాగే స్పందించాడు.
"అది అలా జరిగిపోయింది. దాని గురించి మేమేమీ చర్చించలేదు. టీమ్ ఓడిపోయింది. రిషబ్ పంత్ విషయానికి వస్తే అతడు తన నుంచి ఏం అవసరమో అది తనకు తానే అర్థం చేసుకోవాలి. మేము అతనికి చెప్పడం కంటే తనకు తానే ఎలా ఆడాలో ఆలోచించుకోవాలి. గతంలో ఇలాంటి ఆటతీరుతోనే అతడు మాకు విజయాలు సాధించి పెట్టాడు.
ఓ కెప్టెన్ గా దీనిపై నేను మిక్స్‌డ్ రియాక్షన్ ఇవ్వగలను. ఒక్కోసారి అతడు అలా ఆడితేనే బాగుంటుందని అనిపిస్తుంది. ఇలా జరిగినప్పుడు మాత్రం చికాకు వస్తుంది. కానీ అదే నిజం. సక్సెస్, ఫెయిల్యూర్ ను బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ విషయంపై అతనితో గతంలోనూ మాట్లాడాను. పరిస్థితులను బట్టి అతడు ఆడాలి. రిస్క్ తీసుకోవాలని అనుకున్నప్పుడు ఆ పరిస్థితిని కూడా అంచనా వేసుకోవాలి" అని రోహిత్ అన్నాడు.
పంత్ ఔటవడంతో..
రిషబ్ పంత్ మెల్‌బోర్న్ టెస్టు రెండు ఇన్నింగ్స్ లో 28, 30 పరుగులు చేశాడు. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడినప్పుడు జైస్వాల్ తో కలిసి 88 పరుగులు జోడించాడు. తన దూకుడైన ఆటతీరుకు విరుద్ధంగా 104 బంతుల పాటు ఓపిగ్గా క్రీజులో ఉన్నాడు. మరికొన్ని ఓవర్లు అతడు అలాగే క్రీజులో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేది.
కానీ అప్పటి వరకూ ఓపిగ్గా ఆడిన అతడు.. లయన్ బౌలింగ్ లో ఓ భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఆ తర్వాత 34 పరుగుల వ్యవధిలోనే టీమిండియా 7 వికెట్లు కోల్పోయి అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ ఓటమి వల్ల సిరీస్ లో 1-2తో వెనకబడింది. చివరిదైన సిడ్నీ టెస్టును కచ్చితంగా గెలిస్తేనే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని నిలుపుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు డబ్ల్యూటీసీ ఫైనల్ పైనా ఆశలు పెట్టుకోవచ్చు. డ్రా లేదా ఓడిపోతే మాత్రం రెండూ చేజారిపోతాయి.