Rohit Sharma: ఇక టీ20లకు రోహిత్ శర్మ దూరం.. అతని నెక్ట్స్ ప్లాన్ ఇదే-rohit sharma not to play t20s again says a bcci source ,cricket న్యూస్
Telugu News  /  Cricket  /  Rohit Sharma Not To Play T20s Again Says A Bcci Source

Rohit Sharma: ఇక టీ20లకు రోహిత్ శర్మ దూరం.. అతని నెక్ట్స్ ప్లాన్ ఇదే

Hari Prasad S HT Telugu
Nov 22, 2023 09:19 PM IST

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇక టీ20లు ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే అతడు బీసీసీఐ, సెలక్టర్లకు స్పష్టం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (PTI)

Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిలు ఇండియా తరఫున టీ20 మ్యాచ్ లు ఆడక ఏడాది అవుతోంది. 2022లో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓటమి తర్వాత వీళ్లు మళ్లీ ఈ ఫార్మాట్లో కనిపించలేదు. అయితే రోహిత్ ఇక టీ20ల్లో ఆడబోడని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఫార్మాట్లో తన భవిష్యత్తుపై వరల్డ్ కప్ కంటే ముందే బోర్డుతో అతడు చర్చించినట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

టీ20 ఫార్మాట్లో ఏడాది కాలంగా హార్దిక్ పాండ్యానే కెప్టెన్ గా ఉన్నాడు. తాజాగా అతడు గాయపడటంతో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కు సూర్యకుమార్ కు పగ్గాలు అప్పగించారు. ఇండియా తరఫున 148 టీ20లు ఆడిన రోహిత్ శర్మ నాలుగు సెంచరీలతో 3853 రన్స్ చేయడం విశేషం. ఇప్పటికీ ఈ ఫార్మాట్ ఆడే సత్తా అతనిలో ఉన్నా కూడా మిగతా ఫార్మాట్లలో గాయాలు లేకుండా కొనసాగడానికి ఈ ఫార్మాట్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

యువకులకు ఛాన్స్

ఇన్నాళ్లూ వన్డే వరల్డ్ కప్ పై దృష్టి సారించడానికే రోహిత్, కోహ్లి టీ20లకు దూరంగా ఉన్నారని, తర్వాత ఈ ఫార్మాట్ కూడా ఆడతారని భావించారు. కానీ ఇక తాను ఈ ఫార్మాట్ ఆడబోనని బీసీసీఐ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ లకు ఇప్పటికే రోహిత్ చెప్పేసినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ టీ20 ఫార్మాట్లో యువకులకే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని టీమ్ భావిస్తోంది.

రోహిత్ కాకుండా గిల్, యశస్వి, ఇషాన్, రుతురాజ్ రూపంలో నలుగురు యువ ఓపెనర్లు ఈ ఫార్మాట్ కోసం అందుబాటులో ఉన్నారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో యువకులకు ఎక్కువ అవకాశాలు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ఒకవేళ వాళ్లు అంతగా రాణించకపోతే.. రోహిత్ ను మరోసారి టీ20లకు పిలవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు పీటీఐ తన రిపోర్టులో వెల్లడించింది.

ఇక నుంచి టెస్టులపై ఎక్కువగా దృష్టి సారించనున్న రోహిత్.. ఐపీఎల్లో మాత్రం కొనసాగనున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లి పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. రోహిత్ తో పోలిస్తే అతని ఫిట్‌నెస్ ఎంతో మెరుగ్గా ఉంది. అతడు మళ్లీ టీ20లు ఆడే అవకాశం కొట్టిపారేయలేం కానీ.. ఇప్పట్లో కోహ్లి కూడా ఈ ఫార్మాట్ కు తిరిగి వచ్చే అవకాశాలైతే కనిపించడం లేదు.

WhatsApp channel