Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీనే రోహిత్ శర్మకు చివరిది కానుందా? ఆ సిరీస్‍కు సెలెక్టర్లు ఎంపిక చేయరట-rohit sharma international cricket career may end with champions trophy 2025 report ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీనే రోహిత్ శర్మకు చివరిది కానుందా? ఆ సిరీస్‍కు సెలెక్టర్లు ఎంపిక చేయరట

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీనే రోహిత్ శర్మకు చివరిది కానుందా? ఆ సిరీస్‍కు సెలెక్టర్లు ఎంపిక చేయరట

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత భారత జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడని ఓ రిపోర్ట్ పేర్కొంది. అతడి అంతర్జాతీయ కెరీర్ ముగియనుందని వెల్లడించింది.

Rohit Sharma: ఛాంపియన్స్ ట్రోఫీనే రోహిత్ శర్మకు చివరి టోర్నీ కానుందా? ఆ సిరీస్‍కు సెలెక్టర్లు ఎంపిక చేయరట (HT_PRINT)

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కష్టకాలం నడుస్తోంది. బ్యాటింగ్‍లో అతడు తీవ్రంగా తడబడుతున్నాడు. ఇటీవల జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పేవలమైన ప్రదర్శన చేశాడు. అలాగే, కెప్టెన్సీ విషయంలోనూ హిట్‍మ్యాన్‍పై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. అతడి సారథ్యంలో న్యూజిలాండ్‍తో టెస్టు సిరీస్‍ను 0-3తో భారత్ కోల్పోయింది. టెస్టు చరిత్రలో సొంతగడ్డపై ఓ టెస్టు సిరీస్‍లో భారత్ క్లీన్ స్వీప్ అవడం ఇదే తొలిసారి. అలాగే, ఇటీవల ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్‍లోనూ 1-3తో టీమిండియా కోల్పోయింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్‍షిప్ ఫైనల్‍లో చోటు దక్కించుకోలేకపోయింది. ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగిలాయి. దీంతో రోహిత్ శర్మ.. అంతర్జాతీయ కెరీర్ ఇక ఛాంపియన్స్ ట్రోఫీతో ముగుస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఆస్ట్రేలియాతో ఐదో టెస్టులోనే రోహిత్ శర్మ పక్కన కూర్చున్నాడు. దీంతో అతడు చివరి మ్యాచ్ ఆడేశాడనే రూమర్లు వచ్చాయి. అయితే, తాను ఎక్కడికి వెళ్లడం లేదంటూ రోహిత్ కామెంట్స్ చేశాడు. రిటైర్మెంట్ వాదనలను కొట్టిపారేశాడు. అయితే, అతడిని కొనసాగించేందుకు సెలెక్టర్లు విముఖంగా ఉన్నారట.

ఇంగ్లండ్ టెస్టు సిరీస్‍కు దూరం!

ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ తన చివరి అంతర్జాతీయ క్రికెట్ ఆడతాడని దైనిక్ జాగరణ్ రిపోర్ట్ పేర్కొంది. భారత్ తరఫున అదే అతడికి చివరిది కానుందని వెల్లడించింది. ఆ తర్వాత ఇంగ్లండ్‍తో ఆ దేశంలో జరిగే టెస్టు సిరీస్‍కు రోహిత్ శర్మను ఎంపిక చేసేందుకు సెలెక్టర్లు విముఖంగా ఉన్నారని తెలిపింది. ఇంగ్లండ్ పర్యటనకు హిట్‍మ్యాన్ ఎంపికయ్యే అవకాశాలు అత్యల్పం అని ఆ రిపోర్ట్ పేర్కొంది.

రోహిత్ ఘోరమైన ఫామ్

రోహిత్ శర్మ కొంతకాలంగా ఘోరమైన ఫామ్‍లో ఉన్నాడు. తన చివరి మూడు సిరీస్‍ల్లో కేవలం 164 పరుగులే చేశాడు. అందులో ఒక్కటే హాఫ్ సెంచరీ ఉంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడు టెస్టులు ఆడిన రోహిత్.. కేవలం 31 పరుగులే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. ఈ సిరీస్‍లో అతడి సగటు 6.2 మాత్రమే. ఆసీస్‍లో పర్యటించి ఓ టెస్టు సిరీస్‍లో అత్యల్ప పరుగులు చేసిన కెప్టెన్‍గా రోహిత్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

ఇటీవల జరిగిన సమావేశంలోనూ రోహిత్ శర్మపై బీసీసీఐ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం బయటికి వచ్చింది. కొంతకాలంగా అతడి ప్రదర్శనపై నిరాశగానే ఉన్నారట. ఈ తరుణంలో ఛాంపియన్స్ ట్రోఫీనే రోహిత్ శర్మకు టీమిండియా తరఫున చివరిది అయ్యే అవకాశాలు ఉన్నట్టు అంచనాలు వస్తున్నాయి.

ఇంగ్లండ్‍తో స్వదేశంలో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 12 మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీస్‍లను భారత్ ఆడనుంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న మొదలుకానుంది. కాగా, ఐదు టస్టుల సిరీస్ ఆడేందుకు ఈ ఏడాది జూన్‍లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది భారత జట్టు.

సంబంధిత కథనం