Rohit Sharma Sixes: రోహిత్ శర్మ మూడు భారీ సిక్స్‌లు కొట్టినా.. చెత్త షాట్‌తో వికెట్ పారేసుకున్న టీమిండియా కెప్టెన్
Rohit Sharma Sixes: రోహిత్ శర్మ తీరు మారలేదు. రంజీ ట్రోఫీ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో మూడు భారీ సిక్స్ లు కొట్టి ఊపు మీద కనిపించినా.. మరోసారి చెత్త షాట్ ఆడి తన వికెట్ పారేసుకున్నాడు.
Rohit Sharma Sixes: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త ఫామ్ కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ క్రికెట్ లో మళ్లీ గాడిలో పడటానికి తప్పనిసరి పరిస్థితుల్లో మళ్లీ రంజీ ట్రోఫీ బాట పట్టిన అతడు.. ముంబై తరఫున ఆడుతూ జమ్ము కశ్మీర్ పై రెండు ఇన్నింగ్స్ లోనూ విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో మూడు సిక్స్ లు కొట్టి గాడిలో పడినట్లే కనిపించినా.. మళ్లీ చెత్త షాట్ కు తన వికెట్ సమర్పించుకున్నాడు.
రోహిత్ శర్మ మూడు సిక్స్‌లు..
చాలా ఏళ్ల తర్వాత మళ్లీ రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఇన్నింగ్స్ లో 3 పరుగులకే ఔటై నిరాశ పరిచిన విషయం తెలుసు కదా. అయితే రెండో ఇన్నింగ్స్ లో కాస్త భిన్నంగా ఆడాడు. ఒక దశలో 11 బంతుల్లోనే 21 పరుగులు చేశాడు. మూడు భారీ సిక్స్ లు కూడా కొట్టాడు.
దీంతో ముంబైలోని బీకేసీ గ్రౌండ్ లో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ముంబై కా రాజా రోహిత్ శర్మ అనే నినాదాలు మిన్నంటాయి. కానీ వాళ్ల ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఈసారి కూడా రోహిత్ 28 పరుగుల దగ్గరే తన వికెట్ పారేసుకున్నాడు. నాలుగో ఓవర్లోనే ఓసారి ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న అతడు.. తర్వాత మూడు సిక్స్ లతో విరుచుకుపడ్డాడు.
11 బంతుల్లోనే 21 రన్స్ చేసిన తర్వాత మరోసారి నెమ్మదించి తర్వాతి 20 బంతుల్లో ఒకే ఒక్క పరుగు చేశాడు. చివరికి 35 బంతుల్లో 28 రన్స్ చేసి ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ లో ఉమర్ నజీర్ కు వికెట్ ఇచ్చిన రోహిత్.. ఈసారి యుధ్‌వీర్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
అతని బౌలింగ్ లో అంతకుముందే లాఫ్టెడ్ షాట్ తో సిక్స్ కొట్టిన రోహిత్.. మళ్లీ అలాంటి షాటే ఆడబోయి ఇన్‌సైడ్ ఎడ్జ్ కావడంతో మిడ్ వికెట్ లో ఉన్న అబిద్ ముస్తాక్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో స్టేడియంలోని ఫ్యాన్స్ ఉసూరుమన్నారు.
కష్టాల్లో ముంబై
రంజీ ట్రోఫీ గ్రూప్ ఎలో భాగంగా జమ్ముకశ్మీర్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. తొలి ఇన్నింగ్స్ లో కేవలం 120 పరుగులకే ఆ టీమ్ కుప్పకూలిన విషయం తెలిసిందే. తర్వాత తొలి ఇన్నింగ్స్ లో జమ్ముకశ్మీర్ 206 పరుగులు చేసి కీలకమైన 86 పరుగుల ఆధిక్యం సాధించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ లో ముంబై తీరు మారలేదు.
ఓపెనర్లు యశస్వి, రోహిత్ శర్మతోపాటు కెప్టెన్ రహానే (16), శ్రేయస్ అయ్యర్ (17), శివమ్ దూబె (0) మళ్లీ చేతులెత్తేశారు. దీంతో రెండో రోజు లంచ్ సమయానికి 5 వికెట్లకు 86 రన్స్ చేసింది. ఈ మ్యాచ్ లో ముంబై గట్టెక్కడం అంత సులువుగా కనిపించడం లేదు.
సంబంధిత కథనం