Rohit Sharma Furious: అదేం ప్రశ్న.. అలాంటి వాటికి సమాధానం చెప్పను: రిపోర్టర్లపై రోహిత్ శర్మ సీరియస్
Rohit Sharma Furious: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సహనం కోల్పోయాడు. ఇంగ్లండ్ తో తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడిన అతడు.. తన ఫామ్, భవిష్యత్తు ప్రణాళికలపై అడిగిన ప్రశ్నలపై అసహనం వ్యక్తం చేశాడు.
Rohit Sharma Furious: రోహిత్ శర్మ రిపోర్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్ తో గురువారం (ఫిబ్రవరి 6) తొలి వన్డే జరగనుండగా.. బుధవారం సాయంత్రం నాగ్‌పూర్ లో మీడియాతో మాట్లాడాడు. వరుస ఓటములు, ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న రోహిత్ పై ఊహించినట్లే ప్రతికూల ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఎప్పుడూ కూల్ గా ఉండే రోహిత్ కూడా ఈ ప్రశ్నలు విని అసహనం వ్యక్తంగా చేశాడు.

అదేం ప్రశ్న: రోహిత్
టెస్టు క్రికెట్ లో రోహిత్ శర్మ దారుణమై ఫామ్ కనబరిచాడు. ఈ నేపథ్యంలో తనకు ఎంతగానో అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో చాలాకాలం తర్వాత ఆడబోతున్నాడు. ఈ నేపథ్యంలో మీరు కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ కు దిగగలరా అని ఓ రిపోర్టర్ ప్రశ్నించాడు.
దీనిపై రోహిత్ అసహనం వ్యక్తం చేశాడు. "అదేం ప్రశ్న. ఇది భిన్నమైన ఫార్మాట్. భిన్నమైన సమయం. క్రికెటర్లుగా ఎత్తుపల్లాలు ఉంటాయని మాకు తెలుసు. నా కెరీర్లో అలాంవి చాలా చూశాను. ఇదేమీ కొత్త కాదు. ప్రతి రోజూ కొత్తదే. ప్రతి సిరీసూ కొత్తదే. సవాలుకు నేను సిద్ధం.
గతం గురించి ఆలోచించడం లేదు. మీరు కూడా ఆలోచించకండి. ముందు ఏముందో దాని గురించే ఆలోచిస్తాను" అని రోహిత్ స్పష్టం చేశాడు. గతేడాది రోహిత్ శర్మ 14 టెస్టులలో కేవలం 25 సగటుతో రన్స్ మాత్రమే చేశాడు.
ఇలాంటి ప్రశ్నలకు సమాధానమివ్వను
రోహిత్ శర్మ మరో ప్రశ్న విషయంలోనూ కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత మీ భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకోవాలని బీసీసీఐ మీకు సూచించిందన్న వార్తలు నిజమేనా అని మరో రిపోర్టర్ ప్రశ్నించాడు. దీనిపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
"దానికి, దీనికి సంబంధం ఏంటి? నేను ఇక్కడికి మూడు వన్డేల సిరీస్, రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీ గురించి మాట్లాడటానికి వచ్చాను. అలాంటి రిపోర్టులు ఏళ్లుగా వస్తూనే ఉన్నాయి. వాటిపై వివరణ ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు. ప్రస్తుతానికి ఈ మ్యాచ్ లపైనే నా దృష్టంతా. తర్వాత ఏం జరగుతుందో చూద్దాం" అని రోహిత్ అన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవాల్సిందిగా బీసీసీఐ రోహిత్ కు సూచించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ఒకటి వెల్లడించింది. దీనిపై ప్రశ్నించినప్పుడే రోహిత్ అసహనంగా కనిపించాడు.
ఇండియా, ఇంగ్లండ్ మధ్య గురువారం (ఫిబ్రవరి 6) నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఈ సిరీస్ సన్నద్ధత కోసం ఎంతో కీలకం కానుంది. మరి టీ20 సిరీస్ లో యంగిండియా చూపిన స్ఫూర్తితో వన్డే టీమ్ కూడా చెలరేగుతుందా లేదా చూడాలి.
సంబంధిత కథనం