Rohit Sharma: సేమ్ సీన్ రిపీట్ - రంజీ మ్యాచ్‌లో రోహిత్ విఫలం - జైస్వాల్, గిల్ కూడా!
Rohit Sharma: రంజీ ట్రోఫీలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నిరాశపరిచాడు. జమ్ము కశ్మీర్‌తో గురువారం మొదలైన రంజీ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్‌గా బరిలో దిగిన రోహిత్ కేవలం మూడు పరుగులలు మాత్రమే చేసి ఔటయ్యాడు. టీమిండియా క్రికెటర్లు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ కూడా దారుణంగా విఫలమయ్యారు.
Rohit Sharma: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో దారుణంగా విఫలమై విమర్శలను ఎదుర్కొన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రంజీ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. పేలవమైన ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం మూడు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎదురైన పరాభవం నేపథ్యంలో టీమిండియా ప్లేయర్లు దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బీసీసీఐ కొత్తగా రూల్ పెట్టింది. స్టార్ క్రికెటర్లు సైతం ఈ రూల్‌ను పాటించాల్సిందేనని హుకుం జారీ చేసింది.
ముంబై టీమ్‌లో...
బీసీసీఐ రూల్‌లో భాగంగా రోహిత్ శర్మ రంజీ ట్రోఫీలోకి ముంబై జట్టు తరఫున బరిలోకి దిగాడు. గురువారం జమ్ము కశ్మీర్‌తో మొదలైన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బ్యాటింగ్ దిగిన రోహిత్ శర్మ 19 బాల్స్ ఎదుర్కొని కేవలం 3 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఉమర్ నజీర్ బౌలింగ్‌లో డోగ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
రోహిత్ శర్మతో పాటు ముంబై జట్టు తరఫున ఈ మ్యాచ్ ఆడుతోన్న టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. రోహిత్‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌ను ఆరంభించిన యశస్వి జైస్వాల్ కూడా నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. ముంబై టీమ్‌కు అంజిక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్నాడు.
ఫ్యాన్స్ విమర్శలు...
రంజీలో విఫలమైన రోహిత్‌పై అభిమానులు విమర్శలు గుప్పిస్తోన్నారు. సీనియర్లపై ఆధార పడకుండా జట్టులో మార్పులు చేయాల్సిన టైమ్ వచ్చిందని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో ముంబై తరఫున ఆడుతోన్న మరో టీమిండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ తాను ఎదుర్కొన్న ఫస్ట్ బాల్‌నే సిక్స్ కొట్టాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్, అజింక్య రహానే క్రీజులో ఉన్నారు.
గిల్ కూడా...
రోహిత్, యశస్వి జైస్వాల్‌తో శుభ్‌మన్ గిల్ కూడా రంజీ ట్రోఫీ ఆడుతోన్నాడు. పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోన్న గిల్ కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. కర్ణాటక, పంజాబ్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా గురువారం రంజీ మ్యాచ్ ఆరంభమైంది.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నది. పంజాబ్ తరఫున ఓపెనర్‌గా బరిలో దిగిన శుభ్‌మన్ గిల్ నాలుగు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరుకున్నాడు. కర్ణాటక పేసర్ల దెబ్బకు పంజాబ్ 14 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.