ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‍లో భారత కెప్టెన్ రోహిత్ శర్మపైనే అందరి దృష్టి ఎక్కువగా నిలిచింది. న్యూజిలాండ్‍తో నేడు (మార్చి 9) తుదిపోరు తర్వాత వన్డేలకు రోహిత్ గుడ్‍బై చెబుతాడన్న ఊహాగానాలు ఉండటంతో అతడు ఎలా ఆడతాడనే ఆసక్తి మరింతగా ఏర్పడింది. అయితే, ఈ తుదిపోరులో రోహిత్ శర్మ అదరగొట్టాడు. బ్యాటింగ్‍కు కష్టంగా ఉన్న పిచ్‍పై లక్ష్యఛేదనలో హిట్‍మ్యాన్ దుమ్మురేపాడు. అర్ధ శతకంతో జోరు చూపాడు. అయితే కీలక దశలో ఔటయ్యాడు. ఆ వివరాలివే..
ఫైనల్‍లో 252 పరుగుల లక్ష్యఛేదనలో భారత ఓపెనర్ రోహిత్ శర్మ చెలరేగి ఆడాడు. బిగ్ మ్యాచ్‍లో 83 బంతుల్లో 76 పరుగులతో అదిరే అర్ధ శతకం చేశాడు. 7 ఫోర్లు, 3 సిక్స్‌లు బాదాడు హిట్‍మ్యాన్. టార్గెట్ ఛేజింగ్‍లో ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు రోహిత్. ఓ వైపు శుభ్‍మన్ గిల్ (31) నిలకడగా ఆడితే.. హిట్‍మ్యాన్ మాత్రం దూకుడు మార్గమే ఎంచుకున్నాడు. మంచి హిట్టింగ్ చేశాడు. దీంతో 10 ఓవర్లలో 64 రన్స్ చేసింది భారత్.
ఆ తర్వాత కూడా రోహిత్ శర్మ బాగా ఆడాడు. కానీ శుభ్‍మన్ గిల్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (1) నాలుగు బంతుల వ్యవధిలోనే ఔటవటంతో కాస్త దూకుడు తగ్గించాడు రోహిత్. ఆచితూడి ఆడాడు. 41 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరాడు రోహిత్.
భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి వచ్చాక కాస్త నెమ్మదిగా ఆరంభించాడు. న్యూజిలాండ్ స్పిన్నర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయటంతో పరుగులు వేగంగా రాలేదు. శ్రేయస్ ఆడిన 26వ ఓవర్ మెయిడిన్ అయింది. ఒత్తిడి పెరిగింది. దీంతో కివీస్ స్పిన్నర్ రచిన్ రవీంద్ర వేసిన ఆ తదుపరి 27వ ఓవర్ తొలి బంతికే భారీ షాట్ ఆడేందుకు రోహిత్ డిసైడ్ అయ్యాడు. అందుకే క్రీజు వదిలి ఫ్రంట్‍కు దూసుకొచ్చాడు. అయితే, బంతి స్పిన్ అయి రోహిత్ బ్యాట్‍కు తగలకుండానే కివీస్ కీపర్ టామ్ లాథమ్ చేతికి వెళ్లింది. కీపర్ లాథమ్ వికెట్లను గిరాటేయడంతో క్రీజు బయటే ఉన్న రోహిత్ శర్మ స్టంపౌట్ అయ్యడు. ఒత్తిడిలో భారీ షాట్‍కు యత్నించి హిట్‍మ్యాన్ పెవిలియన్ చేరాడు.
రోహిత్ శర్మ ఈ ఫైనల్‍లో చాలా మంచి ఫ్లోలో బ్యాటింగ్ చేశాడు. తన వింటేజ్ హిట్టింగ్ చూపింటాడు. తడబాటు లేకుండా పరుగులు రాబట్టాడు. దీంతో హాఫ్ సెంచరీ తర్వాత రోహిత్ శతకం చేయడం ఖాయమనే ఆశలు భారత అభిమానుల్లో చిగురించాయి. అందులోనూ అతడికి చివరి వన్డే ఇన్నింగ్స్ అనే పుకార్లు ఉండటంతో సెంచరీ చేయాలని చాలా మంది కోరుకున్నారు. అందులోనూ రోహిత్ కుదురుకుంటే భారీ స్కోరు చేయడం చాలాసార్లు జరిగింది. అయితే, 76 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద స్టంపౌట్ అయి పెవిలియన్ చేరాడు హిట్‍మ్యాన్. సెంచరీ మిస్ అవటంతో అభిమానులు నిరాశ చెందారు.
రోహిత్ శర్మ ఔటయ్యే సమయానికి భారత్ 26.1 ఓవర్లలో 3 వికెట్లకు 122 పరుగులు చేసింది. ఈ ఫైనల్‍లో గెలిచిందుకు 23.5 ఓవర్లలో 130 పరుగులు అవసరం. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేస్తున్నారు. 252 లక్ష్యాన్ని ఛేదిస్తే భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకుంటుంది.
ఫైనల్‍లో అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 251 రన్స్ చేసింది.
సంబంధిత కథనం