ODI World Cup 2023: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ చాలా ఏళ్ల నుంచి భారత క్రికెట్ జట్టుపై చాలా సార్లు అక్కసు వెళ్లగక్కుతూనే ఉన్నారు. వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. భారత మాజీలు చాలాసార్లు వాన్‍కు గట్టి కౌంటర్లు ఇస్తూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే ప్రపంచకప్‍లో పాకిస్థాన్‍పై భారత్ భారీ విజయం సాధించింది. అక్టోబర్ 14న అహ్మదాబాద్ స్టేడియంలో జరిగిన పోరులో పాక్‍ను టీమిండియా చిత్తు చేసింది. దీనిపై వాన్ తాజాగా మాట్లాడాడు.
అహ్మదాబాద్ స్టేడియంలో ‘దిల్ దిల్ పాకిస్థాన్’ డీజే సాంగ్ ప్లే చేయనందుకే ఓడిపోయామనేలా పాకిస్థాన్ హెడ్ కోచ్ మికీ ఆర్థర్ ఇటీవల వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఐసీసీ ఈవెంట్‍లా కాకుండా ఇది దైపాక్షిస సిరీస్‍లా ఉందని అన్నారు. దీనిపైనే వాన్ స్పందించారు. అయితే, ఆర్థర్‌ను ఆటపట్టిస్తూ ఆ వ్యాఖ్యలు చేశారా.. నిజంగానే భారత కెప్టెన్ రోహిత్ శర్మపై అక్కసు వెళ్లగక్కారా అనే విషయంలో క్రికెట్ అభిమానులను వాన్ తికమక పెట్టారు. ఆయన ఏమన్నారంటే..
తాజాగా ఓ పోడ్‍కాస్ట్‌లో మైకేల్ వాన్ పాల్గొన్నారు. ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఆజమ్ గిల్‍క్రిస్ట్ కూడా దీంట్లో ఉన్నారు. పాకిస్థాన్‍పై భారత్ గెలిచిన తీరు, రోహిత్ శర్మ కెప్టెన్సీని గిల్‍క్రిస్ట్ ప్రశంసించారు. దీనిపై వాన్ స్పందించారు. “మైదానంలో వ్యూహాలపై రోహిత్ శర్మ బాగా అవగాహనతో ఉంటాడు. ప్లేయర్లను బాగా వినియోగించుకుంటాడు. మహమ్మద్ సిరాజ్‍కు అదనపు ఓవర్ ఇవ్వడం వల్ల అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు. అయితే, అన్నింటికన్నా రోహిత్ చేసిన బెస్ట్ పని ఏంటంటే.. దిల్.. దిల్ పాకిస్థాన్ డీజేను ప్లే చేయవద్దని చెప్పడమే. దీని వల్లనే మ్యాచ్ గెలిచారు. ఒకవేళ దిల్.. దిల్ పాకిస్థాన్ పాట ప్లే చేసి ఉంటే.. పాకిస్థాన్ గెలిచి ఉండేది. చాలా మంది కెప్టెన్లు.. మ్యూజిక్, డీజే గురించి పట్టించుకోరు. కానీ రోహిత్ తన కాలానికంటే ముందున్నాడు” అని మైకేల్ వాన్ అన్నాడు.
మైదానంలో ‘దిల్.. దిల్ పాకిస్థాన్’ డీజే ప్లే చేయకుండా జాగ్రత్తలు తీసుకోవడమే రోహిత్ శర్మ చేసిన అత్యుత్తమమైన చర్య అని వాన్ అన్నాడు. అయితే, ఆ పాట ప్లే చేయనందుకే ఓడిపోయామని పాక్ హెడ్ కోచ్ చేసిన వ్యాఖ్యలకు వాన్ ఇలా కౌంటర్ ఇచ్చారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరికొందరేమో ఇండియాపై వాన్ మరోసారి అసూయ చూపుతున్నారని కామెంట్లు చేస్తున్నారు.