Rohit Sharma on Bazball: పంత్ అని ఒకడు ఉండేవాడు.. అతన్ని మీరు చూసి ఉండరు: బజ్‌బాల్‌పై రోహిత్ దిమ్మ దిరిగే పంచ్
Rohit Sharma on Bazball: తమ బజ్‌బాల్ ను చూసి యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడుతున్నాడన్న ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ కామెంట్స్ పై రోహిత్ శర్మ దిమ్మదిరిగే పంచ్ ఇచ్చాడు. ఈ సందర్భంగా పంత్ పేరును ప్రస్తావించడం విశేషం.
Rohit Sharma on Bazball: ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బజ్‌బాల్ అంటూ యశస్వి జైస్వాల్ పై చేసిన కామెంట్స్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గట్టి కౌంటర్ ఇచ్చాడు. రిషబ్ పంత్ అని ఒకడు ఉండేవాడని, అతని ఆట బహుషా మీరు చూసి ఉండరంటూ ఇంగ్లండ్ టీమ్ దిమ్మదిరిగే పంచ్ ఇచ్చాడు. ధర్మశాలలో ఐదో టెస్ట్ జరగనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్.. బజ్‌బాల్ చర్చకు తనదైన సమాధానమిచ్చాడు.
పంత్‌ను మీరు చూసి ఉండరు: రోహిత్
ధర్మశాలలో గురువారం (మార్చి 7) నుంచి ఇంగ్లండ్ తో టీమిండియా చివరిదైన ఐదో టెస్ట్ ఆడనుంది. ఈ సందర్భంగా బుధవారం కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడాడు. తమను చూసిన తర్వాతే యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడుతున్నాడంటూ గతంలో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ చేసిన కామెంట్స్ ను ఓ జర్నలిస్ట్ రోహిత్ ముందు ప్రస్తావించారు.
దీనిపై రోహిత్ తనదైన స్టైల్లో స్పందించాడు. "బెన్ డకెట్ ను చూసి యశస్వి జైస్వాల్ నేర్చుకున్నాడా? రిషబ్ పంత్ మా జట్టులో ఒకడు ఉండేవాడు. బహుషా బెన్ డకెట్ అతని ఆట చూసి ఉండడు" అని రోహిత్ శర్మ సూపర్ పంచ్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్ ను కూడా టీ20 స్టైల్లో ఆడటం పంత్ కు అలవాటు. ఆ ఆటతీరుతోనే పంత్ కొన్ని కీలకమైన మ్యాచ్ లలో టీమిండియాను గెలిపించాడు.
ఇక బెన్ డకెట్ కామెంట్స్ పై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ కూడా తీవ్రంగానే స్పందించాడు. యశస్వి మిమ్మల్ని చూసి కాదు.. తాను చిన్నతనం నుంచి పడిన శ్రమ నుంచి నేర్చుకున్నాడంటూ డకెట్ కు ఘాటుగానే రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు రోహిత్ కూడా మరింత ఘాటుగా స్పందించాడు.
బజ్‌బాల్ అంటే ఏంటో తెలియదు: రోహిత్
ఇక ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ ఆడుతున్న తీరును అందరూ బజ్‌బాల్ అని పిలుస్తున్నారు. కానీ అసలు దీనికి అర్థమేంటో తనకు కూడా తెలియదని రోహిత్ శర్మ అన్నాడు. "బజ్‌బాల్ కు అర్థమేంటో నాకు తెలియదు. ఏ బ్యాటర్ ధాటిగా ఆడటం నేను చూడలేదు.
ఇంగ్లండ్ కిందటి సారి ఇక్కడికి వచ్చినప్పటి కంటే ఇప్పుడు మెరుగైన క్రికెట్ ఆడుతోంది. కానీ ఇప్పటికీ నాకు బజ్ బాల్ అంటే ఏంటో మాత్రం తెలియదు" అని రోహిత్ అన్నాడు.
ధర్మశాల పిచ్‌పై..
ఇక చివరి టెస్ట్ జరగబోయే ధర్మశాలలోని పిచ్ పైనా రోహిత్ స్పందించాడు. మంగళవారం (మార్చి 5) ధర్మశాలలో అడుగుపెట్టగానే రోహిత్ మొదట పిచ్ ను పరిశీలించాడు. ఇది సాంప్రదాయ ఇండియన్ పిచ్ లాగా ఉంటుందని అతడు స్పష్టం చేశాడు.
"ధర్మశాలలో నేను టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. 2017 టెస్టులో సీమర్స్, స్పిన్నర్లు రాణించారు. ఇది మంచి పిచ్ లాగా కనిపిస్తోంది. మొదట్లో, చివర్లో కాస్త మూవ్‌మెంట్ ఉండే సాంప్రదాయ ఇండియన్ పిచ్ ఇది" అని రోహిత్ అన్నాడు. ఈ పిచ్ పై అదనపు పేస్ బౌలర్ ను ఆడించే అవకాశం ఉన్నట్లు కూడా అతడు చెప్పాడు.