Rohit Sharma Felicitation: ఆ నలుగురు టీ20 వరల్డ్ కప్ స్టార్లకు మరో సన్మానం.. విక్టరీ పరేడ్ మరుసటి రోజే..
Rohit Sharma Felicitation: టీ20 వరల్డ్ కప్ హీరోలు వరుస సన్మానాలతో బిజీగా ఉంటున్నారు. గురువారం (జులై 4) విక్టరీ పరేడ్ తర్వాత మరుసటి రోజే మరో నలుగురు స్టార్లను మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సన్మానించారు.
Rohit Sharma Felicitation: టీ20 వరల్డ్ కప్ ను 17 ఏళ్ల తర్వాత గెలిచిన టీమిండియా ప్లేయర్స్ ఇప్పుడా సక్సెస్ ను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. గురువారం ప్రధాని మోదీని కలిసిన తర్వాత ముంబైలో విక్టరీ పరేడ్ లో పాల్గొన్న ప్లేయర్స్.. శుక్రవారం (జులై 5) మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేని కలిశారు. ఆయనను కలిసిన వాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు మరో ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు.
టీమిండియా స్టార్లకు సన్మానం
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబెలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను కలిశారు. వాళ్లను సీఎం సన్మానించారు. శాలువా కప్పడంతోపాటు ఓ గణేషుడి విగ్రహాన్ని అందించి ప్లేయర్స్ కు శుభాకాంక్షలు చెప్పారు. గురువారమే ఈ నలుగురు ప్లేయర్స్ కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపించారు.
గురువారం (జులై 4) బార్బడోస్ నుంచి ఢిల్లీలో ల్యాండైన తర్వాత టీమిండియా ప్లేయర్స్ ప్రధాని మోదీని ఆయన అధికార నివాసానికి వెళ్లి కలిసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ముంబై వచ్చి విక్టరీ పరేడ్ లో పాల్గొన్నారు. తర్వాత వాంఖెడే స్టేడియంలో ప్లేయర్స్ ను బీసీసీఐ సన్మానించింది. ఈ సందర్భంగా వాళ్లకు రూ.125 కోట్ల చెక్ అందించింది.
టీమిండియా విజయయాత్రను చూడటానికి వేల మంది అభిమానులు తరలి వచ్చారు. దీంతో ముంబైలోని మెరైన్ డ్రైవ్ జనసంద్రాన్ని తలపించింది. ఓపెన్ టాప్ బస్సుపై చేతుల్లో వరల్డ్ కప్ ట్రోఫీని పట్టుకొని ప్రేక్షకులకు చూపిస్తూ.. వాళ్ల విక్టరీ పరేడ్ సాగింది. తర్వాత స్టేడియంలోనూ ప్రేక్షకులు పూర్తిగా నిండిపోయారు.
సిరాజ్ విజయయాత్ర
ముంబైలో విక్టరీ పరేడ్ పూర్తి చేసుకొని శుక్రవారం హైదరాబాద్ వచ్చాడు పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్. అక్కడి విజయయాత్రలాగే సిరాజ్ యాత్రను కూడా విజయవంతం చేయడానికి అభిమానులు సిద్ధమయ్యారు. పెద్ద ఎత్తున తరలిరావాలని సిరాజ్ కూడా కోరాడు. మెహదీపట్నంలోని సరోజిని దేవి ఐ హాస్పిటల్ నుంచి ఈద్గా మైదానం వరకు ఈ విజయయాత్ర సాగనుంది.
టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సిరాజ్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. అయితే తొలి మ్యాచ్ తర్వాత అతనికి మళ్లీ అవకాశం దక్కలేదు. సిరాజ్ స్థానంలో కుల్దీప్ ను తీసుకోగా.. అతడు సక్సెస్ కావడంతో అదే జట్టును కొనసాగించారు.