rohit-kohli: ‘రో’ దంచేశాడు.. మరి ‘కో’ సంగతేంటీ? రోహిత్ సెన్సేషనల్ సెంచరీ.. కోహ్లి ఫామ్ పై ప్రశ్నలు
rohit-kohli: టీమ్ఇండియాకు మెయిన్ పిల్లర్స్ రోహిత్, కోహ్లి. వీళ్లలో రోహిత్ ఇంగ్లండ్ పై రెండో వన్డేతో ఫామ్ లోకి వచ్చాడు. మరి కోహ్లి సంగతేంటీ? విరాట్ వైఫల్యంపై ఆందోళన కొనసాగుతోంది. రోకో రాణిస్తేనే ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ గెలుపు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.

రోకో రాణిస్తేనే
ప్రస్తుత భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి రెండు మెయిన్ పిల్లర్స్. వీళ్లను అభిమానులు ముద్దుగా ‘రోకో’ అని పిలుచుకుంటారు. ఈ టాప్ ప్లేయర్లు ఇద్దరు రాణిస్తే టీమ్ఇండియాకు అసలు తిరుగే ఉండదు. గతంలో చాలా మ్యాచ్ ల్లో రోకో బ్యాటింగ్ లో అదరగొట్టి జట్టను గెలిపించారు. ఫిబ్రవరి 19న ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభమవుతున్న నేపథ్యంలో వీళ్లిద్దరూ ఫామ్ అందుకోవడం కీలకం.
రోహిత్ సెంచరీతో
రోకో లో ఒకరైన రోహిత్ తాజాగా ఇంగ్లండ్ తో రెండో వన్డేలో శతకంతో సత్తాచాటాడు. దాదాపు 16 నెలల తర్వాత వన్డే సెంచరీతో ఫామ్ లోకి వచ్చాడు. ఒకప్పటిలా చెలరేగి ఆడాడు. 7 సిక్సర్లు కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. హిట్ మ్యాన్ సెంచరీతో భారత జట్టుకు సగం ప్రాబ్లం సాల్వ్ అయింది.
కోహ్లి కూడా అందుకుంటే
రోహిత్ సెంచరీతో సత్తాచాటడంతో ఇప్పుడు అందరి ఫోకస్ కేవలం కోహ్లీపైనే ఉంది. ఈ సీనియర్ బ్యాటర్ కూడా రోహిత్ లా ఫామ్ లోకి రావాలని అందరూ ఆశిస్తున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు చివరగా భారత్.. ఇంగ్లండ్ తో మూడో వన్డే ఆడుతుంది. ఈ మ్యాచ్ లో కోహ్లి తిరిగి పరుగుల బాట పడితే భారత జట్టుకు ఇక ఎలాంటి సమస్య ఉండదు.
అప్పుడే చివరి సెంచరీ
కోహ్లి వన్డేల్లో చివరగా 2023 నవంబర్ 15న వాంఖడేలో న్యూజిలాండ్ పై సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఆసీస్ పై హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అనంతరం ఆడిన నాలుగు వన్డేల్లో కలిపి 63 పరుగులే చేశాడు. ఇంగ్లండ్ తో తొలి వన్డేకు మోకాలి వాపుతో దూరమైన కోహ్లి..రెండో వన్డేలో 5 పరుగులకే ఔటయ్యాడు. బుధవారం (ఫిబ్రవరి 12) ఇంగ్లండ్ తో జరిగే మూడో వన్డేలో కోహ్లి రాణించాలని టీమ్, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
సంబంధిత కథనం