DC vs RR: పంత్‍కు మైల్‍స్టోన్ మ్యాచ్.. ఢిల్లీ తరఫున ఆ మార్క్ చేరే తొలి ఆటగాడిగా నిలువనున్న స్టార్.. బోణీ కొట్టేనా!
Rishabh Pant - DC vs RR IPL 2024: ఢిల్లి క్యాపిటల్స్ జట్టు నేడు రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్‍తో ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ ఘనత సాధించనున్నారు. అలాగే, ఈ మ్యాచ్‍లో తుది జట్లు ఎలా ఉండే అవకాశం ఉందో ఇక్కడ చూడండి.
DC vs RR IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్‍లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టేందుకు కసితో ఉంది. నేడు (మార్చి 28) రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య నేడు జైపూర్‌లోని సవాయ్ మాన్‍సింగ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‍లో ఇప్పటికే రాజస్థాన్ బోణీ కొట్టగా.. తన తొలి మ్యాచ్‍లో ఢిల్లీ ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతా తెరువాలని రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ పట్టుదలగా ఉంది. అయితే, ఈ మ్యాచ్‍తో పంత్ ఓ అరుదైన ఫీట్ సాధించనున్నాడు.
రికార్డు సృష్టించనున్న పంత్
భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్‍కు ఇది 100వ ఐపీఎల్ మ్యాచ్. తన కెరీర్లో మొత్తం ఐపీఎల్‍లో అతడు ఢిల్లీకే 99 మ్యాచ్‍లు ఆడాడు. అయితే, రాజస్థాన్ రాయల్స్‌తో నేటి మ్యాచ్‍తో పంత్ అరుదైన ఘనత సాధించనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున 100 మ్యాచ్‍లు ఆడిన తొలి ప్లేయర్‌గా అతడు రికార్డులకెక్కకనున్నాడు. ఈ మైల్‍స్టోన్ మ్యాచ్‍లో సత్తాచాటాలని పంత్ కసిగా ఉన్నాడు.
2022లో జరిగిన రోడ్డు ప్రమాదం వల్ల 15 నెలలుగా క్రికెట్‍కు దూరమైన పంత్.. ఐపీఎల్ 2024 సీజన్ ద్వారానే మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. ఈ సీజన్‍లో పంజాబ్ కింగ్స్ జట్టుపై ఆడిన తన తొలి మ్యాచ్‍లో ఢిల్లీ ఓటమి పాలైంది. దీంతో రాజస్థాన్‍తో జరిగే పోరుతో బోణీ చేయాలని తహతహలాడుతోంది.
ఈ సీజన్‍లో రాజస్థాన్ తన తొలి మ్యాచ్‍లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్‍పై 20 పరుగుల తేడాతో గెలిచింది. భారత యంగ్ స్టార్ సంజూ శాంసన్ సారథ్యంలోని ఆ జట్టు పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది. ఢిల్లీపై గెలిచి ఈ సీజన్‍లో హోం గ్రౌండ్ సెంటిమెంట్‍ను కొనసాగించాలని సంజూసేన భావిస్తోంది.
DC vs RR హెడ్ టూ హెడ్
ఐపీఎల్‍లో ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు పరస్పరం 27 మ్యాచ్‍లు ఆడాయి. ఇందులో 14 మ్యాచ్‍ల్లో రాజస్థాన్ గెలిస్తే.. 13సార్లు ఢిల్లీ విజయం సాధించింది. ఇరు జట్లు మధ్య హెడ్ టూ హెడ్ చాలా దగ్గర్లో ఉంది.
తుది జట్లు ఇలా..
ఈ మ్యాచ్‍లోనూ భారత యంగ్ బ్యాటర్ పృథ్వి షాకు ఢిల్లీ క్యాపిటల్స్ తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ ఎన్రిచ్ నోర్జే అందుబాటులోకి రావడం ఆ జట్టుకు బలంగా మారింది. అతడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడే ఛాన్స్ ఉంది.
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు (అంచనా): డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయో హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), రికూ భుయ్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, సుమీత్ కుమార్, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్
రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు (అంచనా): జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, షిమ్రన్ హిట్మైర్, ధృవ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, సందీప్ శర్మ, యజువేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్
ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఈ మ్యాచ్ నేడు (మార్చి 28) రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లు, జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ చూడొచ్చు.