Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడికి లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ
Rishabh Pant: ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేసిన రిషబ్ పంత్ కే లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ దక్కింది. ఈ విషయాన్ని సోమవారం (జనవరి 20) ఆ ఫ్రాంఛైజీ అధికారికంగా అనౌన్స్ చేసింది.
Rishabh Pant: రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ కొత్త కెప్టెన్ అయ్యాడు. గతేడాది నవంబర్ లో జరిగిన మెగా వేలంలో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు క్రియేట్ చేసిన పంత్ కే లక్నో ఫ్రాంఛైజీ తమ జట్టు పగ్గాలు అప్పగించింది. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా పంత్ పెద్దగా ప్రభావం చూపకపోయినా.. లక్నో సూపర్ జెయింట్స్ అతనిపైనే నమ్మకం ఉంచింది.

రిషబ్ పంత్.. ఢిల్లీ టు లక్నో
రిషబ్ పంత్.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడు. ఏకంగా రూ.27 కోట్లు పెట్టి అతన్ని లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కొనుగోలు చేసింది. ఊహించినట్లే అతనికే కెప్టెన్సీ అప్పగించింది. సోమవారం (జనవరి 20) అధికారిక ప్రకటన జారీ చేసింది. కేఎల్ రాహుల్ ను వదిలేయడంతో లక్నో కెప్టెన్సీ స్థానం ఖాళీ అయింది. వేలంలో పంత్ ను కొనుగోలు చేయగానే అతనికే కెప్టెన్సీ అప్పగిస్తారని అందరూ ఊహించారు. మొత్తానికి ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చింది. గతేడాది పాయింట్ల టేబుల్లో ఏడో స్థానంలో నిలిచిన లక్నో టీమ్.. పంత్ పై భారీ ఆశలే పెట్టుకుంది.
అయితే కెప్టెన్ గా గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్ ను కూడా పంత్ సమర్థంగా ముందుకు నడిపించలేకపోయాడు. ఆ టీమ్ ఆరోస్థానంతో సరిపెట్టుకుంది. మరి ఇప్పుడు లక్నోతో అతడు ఏం మాయ చేస్తాడో చూడాలి. కానీ పంత్ పై లక్నో టీమ్ ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. "ఐపీఎల్ బెస్ట్ కెప్టెన్లలో ఒకరిగా రిషబ్ పంత్ నిలుస్తాడని అనుకుంటున్నాను. వచ్చే 10, 12 ఏళ్లలో పంత్ పేరు ధోనీ, రోహిత్ ల సరసన నిలుస్తుంది" అని అనడం గమనార్హం.
రిషబ్ పంత్ ఏం చేస్తాడో?
రిషబ్ పంత్ కొన్నాళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా ఉన్న విషయం తెలిసిందే. కారు ప్రమాదం కారణంగా 2023 ఐపీఎల్ కు దూరమైన అతడు.. గతేడాది తిరగి వచ్చాడు. ఇక ఈ మధ్యే ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ అతడు బ్యాట్ తో దారుణంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్ లో కేవలం 200 రన్స్ చేశాడు. ఒకే ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది.
అయినా అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఐపీఎల్ కు ముందు ఈ మెగా టోర్నీలో అతడు ఎంతమేర రాణిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. గతేడాది జరిగిన మెగా వేలంలో పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఏకంగా రూ.27 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. ఇప్పటికే నికొలస్ పూరన్, డేవిడ్ మిల్లర్, ఏడెన్ మార్‌క్రమ్, మిచెల్ మార్ష్ లాంటి ప్లేయర్స్ ఆ జట్టులో ఉన్నారు.
కేఎల్ రాహుల్ స్థానంలో లక్నో కొత్త కెప్టెన్ అయిన పంత్.. ఎలా రాణిస్తాడో చూడాలి. 2016లో తొలిసారి ఐపీఎల్ ఆడిన రిషబ్ పంత్.. 111 మ్యాచ్ లలో 3284 రన్స్ చేశాడు. 2018 సీజన్లో అత్యధికంగా 684 రన్స్ చేశాడు. మూడు సీజన్లలో అతడు 400కుపైగా పరుగులు చేయడం విశేషం.