హిస్టరీ క్రియేట్ చేసిన పంత్.. ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్.. ధోని రికార్డు బ్రేక్.. లీడ్స్ లో సెంచరీతో అదుర్స్-rishabh pant most centuries by indian wicket keeper scores hundred in leeds agianst england in first test ind vs eng ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  హిస్టరీ క్రియేట్ చేసిన పంత్.. ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్.. ధోని రికార్డు బ్రేక్.. లీడ్స్ లో సెంచరీతో అదుర్స్

హిస్టరీ క్రియేట్ చేసిన పంత్.. ఫస్ట్ ఇండియన్ వికెట్ కీపర్.. ధోని రికార్డు బ్రేక్.. లీడ్స్ లో సెంచరీతో అదుర్స్

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ హిస్టరీ క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. టెస్టుల్లో విదేశాల్లో అత్యత్తుమ ప్రదర్శన చేసే అతను మరోసారి చెలరేగాడు. ఇంగ్లాండ్ తో తొలి టెస్టులో సెంచరీ బాదేశాడు.

రిషబ్ పంత్ (AP)

ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున పేలవ ప్రదర్శన.. కెప్టెన్ గానూ ఫెయిల్యూర్. లాస్ట్ లో సెంచరీ కొట్టినా అప్పటికే టీమ్ కు నష్టం జరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్ తో టెస్టు సిరీస్ కు రిషబ్ పంత్ ఎంపికపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఇంగ్లిష్ గడ్డపై ఎలా ఆడతాడోనని అనుకున్నారు. కానీ ఆ అనుమానాలు పటాపంచలు చేస్తూ పంత్ సెంచరీతో చెలరేగిపోయాడు. ఐపీఎల్ లో లాస్ట్ మ్యాచ్ లో హండ్రెడ్ కొట్టిన పంత్.. ఇంగ్లాండ్ లోనూ అదే జోరు కొనసాగించాడు.

సవాలును దాటి

ఇంగ్లాండ గడ్డపై బ్యాటింగ్ అంటే అంత ఈజీ కాదు. అక్కడి సీమ్, స్వింగ్ పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడం యమ టఫ్. మేటి మేటి బ్యాటర్లు అక్కడ బోల్తా కొట్టారు. కానీ విదేశాల్లో టెస్టు అంటే చాలు చెలరేగిపోయే రిషబ్ పంత్ మరోసారి అదరగొట్టాడు. ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ బాదేశాడు. ధనాధన్ బ్యాటింగ్ తో సత్తాచాటాడు. టెస్టుల్లో టీ20 బ్యాటింగ్ చేసే పంత్.. లీడ్స్ లోనూ అదే దూకుడు కొనసాగించాడు. 146 బంతుల్లోనే సెంచరీ మార్కు అందుకున్నాడు.

ధోనీని దాటి

రిషబ్ పంత్ ఈ సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేశాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన భారత వికెట్ కీపర్ గా నిలిచాడు. ఆరు సెంచరీలు చేసిన ధోని రికార్డును పంత్ బ్రేక్ చేశాడు. పంత్ కు ఇది 44వ టెస్టు. టెస్టుల్లో అతనికి ఇది ఏడో సెంచరీ.

సిక్సర్ తో సెంచరీ

ఇంగ్లాండ్ తో తొలి ఇన్నింగ్స్ లో స్పిన్నర్ బషీర్ బౌలింగ్ లో సిక్సర్ తో పంత్ 90ల్లోకి చేరుకున్నాడు. 99 పరుగుల దగ్గర బషీర్ బౌలింగ్ లోనే మరో సిక్సర్ తో సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. తర్వాత తనదైన స్టైల్లో సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. పంత్ సెంచరీలో 10 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. ఇంగ్లాండ్ తో పంత్ కు ఇది మూడో సెంచరీ. 2018లో ఓవల్ లో, 2022లో బర్మింగ్ హమ్ లో టెస్టు హండ్రెడ్స్ సాధించాడు పంత్.

కెప్టెన్ జోరు

మరోవైపు టీమిండియా కెప్టెన్ గా ఫస్ట్ టెస్టు ఆడుతున్న శుభ్‌మ‌న్ గిల్‌ జోరు కొనసాగిస్తున్నాడు. ఇంగ్లాండ్ తో టెస్టు తొలి రోజే (జూన్ 20) సెంచరీ కంప్లీట్ చేసుకున్న గిల్.. రెండో రోజు కూడా నిలకడగా ఆడుతున్నాడు. అతను 150కి చేరువలో ఉన్నాడు. పంత్, గిల్ దూకుడుతో టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. 100 ఓవర్లు పూర్తయ్యే సరికి టీమ్ 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 426 పరుగులు చేసింది. గిల్ (144 బ్యాటింగ్; 219 బంతుల్లో 19 ఫోర్లు, ఓ సిక్సర్), రిషబ్ పంత్ (112 బ్యాటింగ్; 150 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) క్రీజులో ఉన్నారు. ఫస్ట్ రోజు ఆటలో యశస్వి జైస్వాల్ (101; 159 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్) కూడా సెంచరీ బాదాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం