Rinku Singh Sixes: రింకు సింగ్ మళ్లీ కొట్టేశాడు.. సూపర్ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లతో గెలిపించిన స్టార్
Rinku Singh Sixes: రింకు సింగ్ మళ్లీ కొట్టేశాడు.. సూపర్ ఓవర్లో విజయానికి 17 పరుగులు అవసరం కాగా.. వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి గెలిపించాడు. ఇది తనకు మాత్రమే సాధ్యమైన ఆట.
Rinku Singh Sixes: ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటర్ రింకు సింగ్ వరుసగా ఐదు సిక్స్‌లు కొట్టి అసాధ్యమనుకున్న మ్యాచ్ గెలిపించిన తీరు గుర్తుందా? అదేదో గాలివాటంగా కొట్టిన సిక్స్ లు కాదని రింకు ఆ తర్వాత కూడా ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. తాజాగా మరోసారి అదే పని చేశాడు. విజయం కోసం సూపర్ ఓవర్లో 17 పరుగులు అవసరం కాగా.. సింపుల్ గా మూడు సిక్స్‌లు కొట్టేశాడు.
ట్రెండింగ్ వార్తలు
యూపీ టీ20 లీగ్ లో భాగంగా రింకు సింగ్ మరోసారి ఓ మ్యాచ్‌కు తనదైన స్టైల్ ఫినిషింగ్ ఇచ్చాడు. మీరట్ మావ్రిక్స్, కాశీ రుద్రాస్ మధ్య జరిగిన మ్యాచ్ ఇది. మీరట్ మావ్రిక్స్ తరఫున ఆడిన రింకు.. సూపర్ ఓవర్లో వరుసగా మూడు సిక్స్‌లతో అద్భుతమే చేశాడు. ఈసారి అతని దూకుడుకు బలైన బౌలర్ పేరు శివ సింగ్. అతడు లెఫ్టామ్ స్పిన్నర్.
ఈ మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ తప్పలేదు. మొదట కాశీ రుద్రాస్ 16 రన్స్ చేశాడు. తర్వాత బరిలోకి దిగిన రింకు సింగ్.. తొలి బంతికి పరుగు తీయలేకపోయాడు. అయితే తర్వాతి మూడు బంతులకు వరుసగా మూడు సిక్స్‌లు కొట్టి మ్యాచ్ ముగించాడు. మొదటి సిక్స్ లాంగాఫ్ మీదుగా, రెండో సిక్స్ మిడ్ వికెట్ మీదుగా.. మూడో సిక్స్ లాంగాఫ్ మీదుగా బాది మీరట్ ను గెలిపించాడు.
ఈ మధ్యే ఐర్లాండ్ సిరీస్ లో ఇండియా తరఫున అరంగేట్రం చేసిన రింకు సింగ్.. ఫినిషర్ రోల్ లో నిలకడగా రాణిస్తూ సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తూనే ఉన్నాడు. ఈ మ్యాచ్ లో రెండు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో 181 పరుగులే చేయడంతో టై అయింది. అయితే అసలు ఇన్నింగ్స్ లో మాత్రం రింకు 22 బంతుల్లో కేవలం 15 పరుగులు చేసి నిరాశ పరిచినా.. సూపర్ ఓవర్లో తన ప్రతాపం చూపించాడు.
రింకు సామర్థ్యంపై నమ్మకం ఉన్న మీరట్ ఫ్రాంఛైజీ.. అతన్నే సూపర్ ఓవర్లో బ్యాటింగ్ కు దింపింది. తన ఫ్రాంఛైజీ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అతడు వమ్ము చేయలేదు. ఇక ఈ నెల చివర్లో జరగబోయే ఏషియన్ గేమ్స్ లో మరోసారి రింకు సింగ్ ఇండియా తరఫున ఆడనున్నాడు.