Rinku Singh Bike: తండ్రికి రూ.3 లక్షల విలువైన బైక్ గిఫ్ట్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్
Rinku Singh Bike: టీమిండియా స్టార్ క్రికెటర్ రింకు సింగ్ తన తండ్రికి ఏకంగా రూ.3.19 లక్షల విలువైన బైకును గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. ఈ బైకుపై అతని తండ్రి తిరుగుతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Rinku Singh Bike: టీమిండియా, కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయర్స్ రింకు సింగ్ ఒకప్పుడు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడో మనకు తెలుసు. ఒక దశలో క్రికెట్ వదిలి ఏదో ఒక ఉద్యోగం చూసుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. అలాంటి ప్లేయర్ ఇప్పుడు తన తండ్రికి ఏకంగా రూ.3.19 లక్షల విలువ చేసే బైకు గిఫ్ట్ గా ఇచ్చే స్థాయికి చేరుకున్నాడు. రింకు తండ్రి కొత్త బైకుపై రయ్ రయ్‌మంటూ తిరుగుతున్న వీడియో వైరల్ అవుతోంది.

రింకు సింగ్ కొత్త బైక్
ఒకప్పుడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న రింకు సింగ్ ఫ్యామిలీ.. ఇప్పుడతని క్రికెట్ మెరుపులతో ఆర్థికంగా నిలదొక్కుకుంది. తన కుటుంబానికి అండగా నిలవడమే కాదు.. తన తండ్రి కలను కూడా అతడు నెరవేర్చాడు. తాజాగా రింకు రూ.3.19 లక్షల విలువైన కవాసకి నింజా బైకును తన తండ్రి ఖంచంద్ర సింగ్ కు కొనిచ్చాడు.
ఈ కొత్త బైకును ఆయన నడుపుతున్న వీడియో ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ లో వైరల్ అయింది. హీరో అనే క్యాప్షన్ తో రింకు సింగ్ కూడా ఈ వీడియోను తన ఇన్‌స్టా రీల్స్ లో షేర్ చేశాడు. ఇక ఈ మధ్య రింకు సింగ్ కు సంబంధించిన మరో వీడియో కూడా వైరల్ అయింది. ఓ ఈవెంట్లో పాల్గొన్న అతడు అక్కడి వెయిటర్స్ కు డబ్బు ఇస్తుండటం అందులో చూడొచ్చు.
ఎంపీని పెళ్లి చేసుకుంటున్నాడా?
రింకు సింగ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన మరో వార్త ఈ మధ్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అతడు సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఎంపీ ప్రియా సరోజ్ ను పెళ్లి చేసుకోబోతున్నాడని, ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగిందని వార్తలు వచ్చాయి. జనవరి 16న రింకు సింగ్ తండ్రితో పెళ్లి విషయం మాట్లాడినట్లు ప్రియా తండ్రి, ఎమ్మెల్యే తుఫానీ సరోజ్ చెప్పినట్లు ఇండియా టుడే రిపోర్టు తెలిపింది.
అయితే ఇప్పటి వరకూ నిశ్చితార్థం మాత్రం జరగలేదని ఆయన స్పష్టం చేశారు. రింకు, ప్రియకు ఏడాదిగా పరిచయం ఉందని, పెద్దల అంగీకారంతో వాళ్లు పెళ్లి చేసుకోవాలని భావించారని, అందుకు ఇరు కుటుంబాలు అంగీకరించాయని కూడా తుఫానీ సరోజ్ చెప్పారు. రింకు సింగ్ ప్రస్తుతం ఇంగ్లండ్ తో ఐదు టీ20ల సిరీస్ కు సిద్ధమవుతున్నాడు.