Rinku Singh vs Starc: ఐపీఎల్లో రిచెస్ట్ ప్లేయర్‌ను దంచి కొట్టిన రింకు సింగ్.. ఆందోళనలో కేకేఆర్ టీమ్
Rinku Singh vs Starc: ఐపీఎల్లో రిచెస్ట్ ప్లేయర్ అయిన మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో దంచి కొట్టాడు రింకు సింగ్. ఓ ప్రాక్టీస్ మ్యాచ్ లో రింకు, మనీష్ పాండే అతని బౌలింగ్ ను సులువుగా ఆటాడుకున్నారు.
Rinku Singh vs Starc: ఐపీఎల్లో ఇప్పటి వరకూ అత్యంత ఖరీదైన ప్లేయర్ గా ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ కు పేరుంది. అతన్ని గత వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అలాంటి బౌలర్ ను ప్రాక్టీస్ మ్యాచ్ లోనే కేకేఆర్ బ్యాటర్లు రింకు సింగ్, మనీష్ పాండే చిత్తు చిత్తుగా కొట్టడం గమనార్హం.
రింకు vs స్టార్క్
మంగళవారం (మార్చి 19) రాత్రి కేకేఆర్ టీమ్ రెండుగా విడిపోయి ఓ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. శనివారం (మార్చి 23) సొంతగడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ నేపథ్యంలో కేకేఆర్ ప్రాక్టీస్ చేస్తోంది. అయితే ఈ మ్యాచ్ లో ఆ టీమ్ స్టార్ ప్లేయర్, ఐపీఎల్లోనే అత్యధిక ధర పలికిన ఆటగాడైన మిచెల్ స్టార్క్ తన 4 ఓవర్ల కోటా ఏకంగా 40 పరుగులు సమర్పించుకున్నాడు.
2015లో చివరిసారి ఐపీఎల్లో ఆడిన స్టార్క్.. మళ్లీ ఇప్పుడు ఈ మెగా లీగ్ లోకి దిగుతున్నాడు. అయితే తొలి ప్రాక్టీస్ మ్యాచ్ లో భారీగా పరుగులు ఇచ్చాడు. ముఖ్యంగా రింకు సింగ్, మనీష్ పాండే డెత్ ఓవర్లలో స్టార్క్ ను చితకబాదారు. టీమ్ గోల్డ్, టీమ్ పర్పుల్ గా టీమ్స్ ను విభజించి ఈ మ్యాచ్ ఆడించారు. ఇందులో టీమ్ పర్పుల్ తరఫున స్టార్క్ బరిలోకి దిగాడు.
తాను వేసిన తొలి ఓవర్లోనే రెహ్మనుల్లా గుర్బాజ్ వికెట్ తీయడంతోపాటు కేవలం ఒకే పరుగు ఇచ్చాడు స్టార్క్. అయితే రెండో ఓవర్ నుంచీ స్టార్క్ పరుగులు లీక్ చేయడం మొదలు పెట్టాడు. అతని రెండో ఓవర్లో 22 ఏళ్ల రఘువన్శీ అనే యువ బ్యాటర్ రెండు ఫోర్లు కొట్టాడు. ఆ తర్వాత 14 ఓవర్ల పాటు స్టార్క్ బౌలింగ్ చేయకుండా కేవలం ఫీల్డింగే పరిమితమయ్యాడు.
డెత్ ఓవర్లలో స్టార్క్‌కు షాక్
ఇన్నింగ్స్ 18వ ఓవర్లో స్టార్క్ మరోసారి బంతి అందుకున్నాడు. ఆ సమయానికి క్రీజులో రింకు సింగ్, మనీష్ పాండే ఉన్నారు. అప్పటికి గోల్డ్ స్కోరు 8 వికెట్లకు 148 పరుగులుగా ఉంది. ఆ ఓవర్లో రింకు రెండో ఫోర్లు కొట్టడంతో మొత్తంగా పది పరుగులు వచ్చాయి. ఇక స్టార్క్ తన చివరి ఓవర్లో మరింత భారీగా పరుగులు ఇచ్చాడు. తొలి బంతినే రింకు సిక్స్ కొట్టాడు.
తర్వాతి బంతికి సింగిల్ తీసి మనీష్ పాండేకు స్ట్రైక్ ఇచ్చాడు. మూడో బంతికి పాండే ఫోర్ కొట్టాడు. తర్వాతి బంతికి స్టార్క్ రౌండ్ ద వికెట్ వచ్చినా పాండే మరో బౌండరీ బాదాడు. ఐదో బంతికి సింగిల్ రాగా.. చివరి బంతికి రింకు మరో ఫోర్ కొట్టాడు. ఇలా చివరి ఓవర్లోనే స్టార్క్ మొత్తంగా 20 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. ఒక సిక్స్, మూడు ఫోర్లు ఇచ్చాడు.
స్టార్క్ పై కేకేఆర్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సీజన్లో అతడేదో మ్యాజిక్ చేస్తాడని ఏకంగా రూ.24.75 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. మరి అసలు టోర్నీలో అతడు ఏం చేస్తాడో చూడాలి.