Ricky Ponting: పంజాబ్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్ రికీ పాంటింగ్.. ఏడు సీజన్లలో ఆరుసార్లు ఇలా..
Ricky Ponting: పంజాబ్ కింగ్స్ తమ హెడ్ కోచ్ ను మళ్లీ మార్చింది. ఈసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు ఆ బాధ్యతలు అప్పగించింది. గత ఏడు సీజన్లలో ఈ బాధ్యతలు చేపట్టిన ఆరో వ్యక్తి పాంటింగ్ కావడం గమనార్హం.
Ricky Ponting: ఐపీఎల్లో ఎలాగైనా తమ రాత మార్చుకోవడానికి పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. వచ్చే సీజన్ కోసం మరోసారి హెచ్ కోచ్ ను మార్చేసింది. తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కు ఆ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు బుధవారం (సెప్టెంబర్ 18) వెల్లడించింది. ఢిల్లీ క్యాపిటల్స్ కు గుడ్ బై చెప్పిన మూడు నెలలకే పాంటింగ్ మళ్లీ ఇలా ఐపీఎల్లోకి అడుగుపెట్టాడు.
రికీ పాంటింగ్.. పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్
ఐపీఎల్ 2025 కోసం మెగా వేలం త్వరలోనే జరగనున్న నేపథ్యంలో పంజాబ్ కింగ్స్ తమ కొత్త హెడ్ కోచ్ గా రికీ పాంటింగ్ ను నియమించడం విశేషం. అయితే గత ఏడు సీజన్లలో ఆరుసార్లు ఆ టీమ్ తమ హెడ్ కోచ్ లను మార్చింది. ఐపీఎల్లో 2008 నుంచి కొనసాగుతున్న ఆ ఫ్రాంఛైజీ.. ఇప్పటి వరకూ కేవలం రెండుసార్లే ప్లేఆఫ్స్ చేరింది.
గత పదేళ్లలో ఎప్పుడూ లీగ్ స్టేజ్ దాటలేదు. ఈ ఏడాది అయితే 9వ స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో ఆస్ట్రేలియాకు రెండుసార్లు వరల్డ్ కప్ అందించిన పాంటింగ్ లాంటి వ్యక్తి అయినా తమ టీమ్ రాత మారుస్తాడన్న ఆశతో పంజాబ్ కింగ్స్ ఉంది. ఇప్పుడతని భుజాలపై పెద్ద బాధ్యతే ఉంది.
పాంటింగ్ ఏం చేస్తాడో?
రికీ పాంటింగ్ ముందు పెద్ద సవాలే ఉంది. పంజాబ్ కింగ్స్ మెగా వేలంలోకి వెళ్లే ముందే.. రిటెయిన్ చేసుకోవాల్సిన ప్లేయర్స్ ను అతడు ఎంపిక చేయాల్సి ఉంది. అంతేకాదు శిఖర్ ధావన్ రిటైర్మెంట్ తో కొత్త కెప్టెన్ ఎవరన్నది కూడా తేలాలి. ఆ బాధ్యత కూడా పాంటింగ్ దే.
ఇక అన్నింటి కంటే ముఖ్యంగా మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ కు ట్రోఫీ అందించే ప్లేయర్స్ ను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ లో హర్షల్ పటేల్, శశాంక్ సింగ్, అశుతోశ్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, జితేశ్ శర్మ, సామ్ కరన్, లియామ్ లివింగ్‌స్టోన్, జానీ బెయిర్‌స్టో, కగిసో రబాడాలాంటి స్టార్లు ఉన్నారు. వీళ్లలో ఎవరిని రిటెయిన్ చేసుకుంటుందన్నది ఆసక్తికరం.
ఐపీఎల్లో పాంటింగ్ ఇలా..
ఐపీఎల్లో ఓ ప్లేయర్ గా రికీ పాంటింగ్ కేవలం రెండు సీజన్లలో మాత్రమే ఆడాడు. 2008లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున, 2013లో ముంబై ఇండియన్స్ తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఆ సీజన్లో ముంబైకి కెప్టెన్ గా ఉన్నా కూడా మధ్యలోనే తప్పుకొని రోహిత్ శర్మకు బాధ్యతలు అప్పగించారు.
అదే ఏడాది అన్ని ఫార్మాట్లకు పాంటింగ్ గుడ్ బై చెప్పాడు. అయితే ముంబై ఇండియన్స్ జట్టుకు మాత్రం సలహాదారుగా కొనసాగాడు. ఆ తర్వాత 2015, 2016లలో అదే ఫ్రాంఛైజీ హెడ్ కోచ్ గా కూడా పని చేశాడు. 2017 నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ తోనే ఉన్నాడు.
2018లో ఆ ఫ్రాంఛైజీ హెడ్ కోచ్ అయ్యాడు. ఆ తర్వాత 2019 నుంచి 2021 వరకు అతని కోచింగ్ లోనే ఆ ఫ్రాంఛైజీ వరుసగా మూడుసార్లు ప్లేఆఫ్స్ చేరింది. 2020లో ఫైనల్ వచ్చినా ట్రోఫీ గెలవలేకపోయింది. ఈ ఏడాది జులైలో ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి అతడు తప్పుకున్నాడు.