పేరుకే డిఫెండింగ్ ఛాంపియన్ కానీ ఆట మాత్రం పేలవం.. ఈ ఐపీఎల్ 2025లో కోల్ కతా నైట్ రైడర్స్ పై వస్తున్న విమర్శ ఇది. అవును.. కేకేఆర్ ఛాంపియన్ టీమ్ లా కాదు కదా కనీసం ఓ సాధారణ జట్టులాగా కూడా ఆడటం లేదు. లో స్కోరు టార్గెట్ నూ రీచ్ కాలేక.. హై స్కోరు సాధించలేక కంప్లీట్ గా ఫెయిల్ అవుతోంది. 8 మ్యాచ్ ల్లో కేకేఆర్ మూడు మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్ లు ఓడింది. 6 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
ఐపీఎల్ 2025లో కేకేఆర్ ఒత్తిడిని తట్టుకోలేకపోతోంది. కీలక సమయాల్లో ప్రెషర్ కు లోనై మ్యాచ్ లు చేజార్చుకుంటోంది. పంజాబ్ కింగ్స్ ఫస్ట్ 111 స్కోరు చేసింది. కానీ ఆ స్వల్ప లక్ష్యాన్ని అందుకోలేక కేకేఆర్ బొక్కబోర్లా పడింది. ఇక తర్వాతి మ్యాచ్ లో గుజరాత్ 198 రన్స్ చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో ఆ టీమ్ పూర్తిగా ఫెయిల్ అయింది. లక్నోతో మ్యాచ్ లో కేలవం 4 పరుగుల తేడాతో ఓడింది. ఒక్క బౌండరీ అదనంగా కొట్టలేకపోయింది.
కేకేఆర్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా విఫలమవుతోంది. డికాక్, నరైన్, వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్.. ఇలా ఏ ఒక్కరూ నిలకడగా రాణించలేకపోతున్నాడు. కెప్టెన్ రహానె (271) మాత్రమే ఫర్వాలేదనిపిస్తున్నాడు. కానీ అతని బ్యాటింగ్ టీమ్ ను గెలిపించలేకపోతోంది. రూ.23.75 కోట్ల ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ 8 మ్యాచ్ ల్లో చేసింది 135 రన్స్ మాత్రమే.
బ్యాటింగ్ ఆర్డర్లో నమ్మదగ్గ ఆటగాడు లేకపోవడం, దూకుడు లోపించడం మరో సమస్య. నరైన్, రింకు సింగ్, రసెల్ లాంటి పవర్ హిట్టర్లు ఈ సీజన్ లో సైలెంట్ అయిపోయారు.
పోని కేకేఆర్ బౌలింగ్ అయినా బెటర్ గా ఉందా? అంటే అదీ లేదు. నిలకడగా వికెట్లు తీసే బౌలర్లే కనిపించడం లేదు. పేసర్ హర్షిత్ రాణా (11 వికెట్లు) కాస్తో కూస్తో బెటర్. కానీ ఓ మ్యాచ్ లో చెలరేగిపోయే అతను మరో మ్యాచ్ లో తుస్ మంటున్నాడు. ఇక ప్రమాదకర స్పిన్ ద్వయం నరైన్, వరుణ్ చక్రవర్తి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. వీళ్ల బౌలింగ్ మెరుపులు ఒక్కో మ్యాచ్ కే పరిమితమవుతున్నాయి.
ఏ టీమ్ ఫెయిల్యూర్ లోనైనా కెప్టెన్ పాత్ర ఉంటుంది. ఇప్పుడు ఐపీఎల్ 2025లో కేకేఆర్ వైఫల్యానికి కెప్టెన్ అజింక్య రహానెను కారణంగా చూపించొచ్చు. గతేడాది కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలిపాడు. ఇప్పుడు కూడా ఆ టీమ్ లో ఎక్కువ మంది ఆటగాళ్లు గత సీజన్ లో ఆడిన వాళ్లే ఉన్నారు. కోచ్ గా చంద్రకాంత్ కొనసాగుతున్నాడు.
కానీ కెప్టెన్ గా రహానె ఎఫెక్ట్ చూపించలేకపోతున్నాడు. బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపిస్తున్నా నాయకుడిగా మాత్రం జట్టును నడిపించడంలో విఫలమవుతున్నాడు. బౌలింగ్ మార్పులు, ఫీల్డింగ్ ఛేంజ్ ల్లో రహానె ప్లాన్ బెడిసికొడుతున్నాయి. సహచరుల్లోనూ రహానె స్ఫూర్తి నింపలేకపోతున్నాడు.
సంబంధిత కథనం