ఆర్సీబీ విక్టరీ పరేడ్.. తొక్కిసలాటలో చనిపోయినవారికి పరిహారం ప్రకటించిన ఫ్రాంఛైజీ.. వారికి విలువ కట్టడం లేదంటూ..-rcb victory parade chinnaswamy stadium stampede victims to get compensation from royal challengers bengaluru team ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆర్సీబీ విక్టరీ పరేడ్.. తొక్కిసలాటలో చనిపోయినవారికి పరిహారం ప్రకటించిన ఫ్రాంఛైజీ.. వారికి విలువ కట్టడం లేదంటూ..

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. తొక్కిసలాటలో చనిపోయినవారికి పరిహారం ప్రకటించిన ఫ్రాంఛైజీ.. వారికి విలువ కట్టడం లేదంటూ..

Hari Prasad S HT Telugu

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విక్టరీ పరేడ్ లో భాగంగా చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. వాళ్ల కుటుంబాలకు సంతాపం తెలుపుతూ నష్ట పరిహారం అనౌన్స్ చేసింది ఆర్సీబీ ఫ్రాంఛైజీ.

ఆర్సీబీ విక్టరీ పరేడ్.. తొక్కిసలాటలో చనిపోయినవారికి పరిహారం ప్రకటించిన ఫ్రాంఛైజీ.. వారికి విలువ కట్టడం లేదంటూ.. (AFP)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) విజయోత్సవాలు జరుగుతున్న వేళ, బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అభిమానులు ప్రాణాలు కోల్పోగా, 33 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (కేఎస్‌సీఏ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. విజయోత్సవాలు విషాదంగా మారడంపై సంతాపం ప్రకటించాయి.

ఆర్సీబీ, కేఎస్‌సీఏల ప్రకటన

"ఈరోజు ఎం. చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) నిర్వహించిన విజయోత్సవాల సమయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై ఆర్సీబీ- కేఎస్‌సీఏ తీవ్ర ఆందోళన, ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాయి" అని కేఎస్‌సీఏ తమ ప్రకటనలో తెలిపింది.

"ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయినందుకు, గాయపడినందుకు మేము తీవ్రంగా బాధపడుతున్నాము. ఈ సంఘటన వల్ల ప్రభావితమైన కుటుంబాలకు మా ప్రార్థనలు. ఈ విషాదం పట్ల మేము హృదయపూర్వకంగా చింతిస్తున్నాము. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు సంఘీభావంగా నిలుస్తాము" అని ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు ఆర్సీబీ తమ అధికారిక ప్రకటనలో, చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన దురదృష్టకర సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. "అభిమానులు ప్రాణాలు కోల్పోయినందుకు ఆర్సీబీ సంతాపం తెలుపుతోంది. బాధిత కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. పరిస్థితి గురించి తెలియగానే, మేము వెంటనే మా కార్యక్రమాన్ని సవరించాము. స్థానిక అధికారుల మార్గదర్శకత్వం, సలహా మేరకు నడుచుకున్నాము. మా మద్దతుదారులందరూ దయచేసి సురక్షితంగా ఉండాలని మేము కోరుతున్నాము" అని ప్రకటనలో చెప్పింది.

పరిహారం వాళ్లకు విలువ కట్టడానికి కాదు

ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు కేఎస్‌సీఏ రూ. 5 లక్షల నష్టపరిహారం ప్రకటించింది. "తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ఆర్సీబీ - కేఎస్‌సీఏ రూ.5 లక్షల అందిస్తున్నట్లు ప్రకటిస్తోంది. ఈ సహాయం వారికి ఈ కష్ట సమయంలో కొంత మద్దతు, ఓదార్పును అందిస్తుందని మేము ఆశిస్తున్నాము" అని ప్రకటనలో పేర్కొంది.

"ఈ పరిహారం మానవ ప్రాణాల విలువను నిర్ణయించడానికి లేదా భర్తీ చేయడానికి ఉద్దేశించినది కాదు. అటువంటి కష్ట సమయాల్లో మద్దతు, సంఘీభావ సూచనగా మాత్రమేనని మేము చెప్పాలనుకుంటున్నాము" అని స్పష్టం చేసింది.

చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవ వేడుకలు అరగంట పాటు జరిగాయి. రజత్ పాటిదార్, విరాట్ కోహ్లీ తమ నిరంతర మద్దతుకు అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగించారు.

అసలేం జరిగింది?

బుధవారం (జూన్ 4) సాయంత్రం బెంగళూరులోని విధాన సౌధ నుంచి ఎం. చిన్నస్వామి స్టేడియం వరకు ఆర్సీబీ విజయోత్సవ పరేడ్ నిర్వహించాల్సి ఉంది. అయితే, ఈ పరేడ్‌కు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు అనుమతి నిరాకరించారు. భారీ జనసందోహం వల్ల గందరగోళం చెలరేగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పరేడ్ జరుగుతుందా లేదా అనే విషయంపై అసలు స్పష్టత లేకుండా పోయింది.

ఆర్సీబీ జట్టు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిసేందుకు విధాన సౌధకు చేరుకోగానే, చిన్నస్వామి స్టేడియం వెలుపల తొక్కిసలాట జరిగినట్టు వార్తలు వచ్చాయి. తమ జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకుందని వేడుక చేసుకోవడానికి వేలాది మంది అభిమానులు అక్కడికి చేరుకున్నారు. కానీ, పోలీసులు జనాలను అదుపు చేయడంలో విఫలమవడంతో మైదానం వెలుపల ఈ దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం