ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. ఆసీస్ పేసర్లు ఇలా!-rcb pacer josh hazlewood to return india for ipl 2025 resume mitchell starc opted out delhi capitals ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. ఆసీస్ పేసర్లు ఇలా!

ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్.. ఆసీస్ పేసర్లు ఇలా!

ఐపీఎల్ 2025 రీస్టార్ట్ కు సిద్ధమవుతున్న ఆర్సీబీకి గుడ్ న్యూస్. అదే టైమ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. ఈ రెండు జట్ల కు ఆడుతున్న ఆస్ట్రేలియా కీలక పేసర్లలో ఒకరు లీగ్ కోసం తిరిగి వస్తుండగా.. మరొకరు దూరమవుతున్నారు.

ఆర్సీబీ పేసర్ హేజిల్‌వుడ్‌ (AP)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ప్లేఆఫ్స్ కు అడుగు దూరంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు గుడ్ న్యూస్. ఆ టీమ్ కు ఆడుతున్న ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌ తిరిగి రానున్నాడు. ప్లేఆఫ్స్ కు ముందు అతను జట్టుతో చేరనున్నాడు. మరోవైపు ప్లేఆఫ్స్ రేసులో పోటీపడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్ తగిలింది. ఆస్ట్రేలియా టాప్ పేసర్ మిచెల్ స్టార్క్ మిగిలిన ఐపీఎల్ మ్యాచ్ లకు దూరమయ్యాడు.

గాయంతో ఉన్నా

భారత్, పాక్ ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025ను వారం రోజుల పాటు సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ శనివారం (మే 17) పున:ప్రారంభం కానుంది. సీజన్ రీస్టార్ట్ అయినా విదేశీ క్రికెటర్లు ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు తిరిగి రావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ భుజం గాయంతో ఉన్నప్పటికీ హేజిల్‌వుడ్‌ ప్లేఆఫ్స్ కోసం ఫ్రాంచైజీకి అందుబాటులో ఉండబోతున్నాడు.

‘‘మే చివరి వారం వరకు భారత్ కు వచ్చేందుకు హేజిల్‌వుడ్‌ సిద్ధమవుతున్నాడు. ప్లేఆఫ్స్ కోసం అతను ఫ్రాంచైజీకి అందుబాటులో ఉంటాడు' అని విశ్వసనీయ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు ధృవీకరించాయి.

ఆర్సీబీలో జోష్

ఐపీఎల్ 2025 సీజన్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హేజిల్‌వుడ్‌ మూడో స్థానంలో ఉన్నాడు. 10 మ్యాచుల్లో 18 వికెట్లు పడగొట్టి ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. భుజం గాయం కారణంగా చిన్నస్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ కు ఈ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ దూరమయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్ వాయిదా పడటంతో ఈ పేసర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పుడు తిరిగి వస్తుండటంతో ఆర్సీబీలో జోష్ నిండింది.

మిచెల్ స్టార్క్ దూరం

ఐపీఎల్ 2025 పునఃప్రారంభానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ తాను తిరిగి వచ్చే ఉద్దేశం లేదని ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యానికి తెలియజేశాడు. జేక్ ఫ్రేజర్-మెక్ గుర్క్ తర్వాత మిగిలిన టోర్నీ నుంచి తప్పుకున్న రెండో ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడిగా స్టార్క్ నిలిచాడు.

‘‘తాను తిరిగి రానని స్టార్క్ డీసీ యాజమాన్యానికి తెలిపాడు. అతని నిర్ణయాన్ని ఫ్రాంచైజీ అంగీకరించింద’’' అని విశ్వసనీయ వర్గాలు హిందుస్థాన్ టైమ్స్ కు తెలిపాయి.

ఎన్ఓసీ కోరలేదని

జేక్ ఫ్రేజర్-మెక్ గుర్క్ స్థానంలో బంగ్లాదేశ్ కు చెందిన ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఢిల్లీ ఎంపిక చేసింది. అయితే ఈ లెఫ్టార్మ్ పేసర్ తమ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కోరలేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పేర్కొనడంతో ఐపీఎల్ 2025లో ముస్తాఫిజుర్ పాల్గొనడం ప్రశ్నార్థకంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా మూడు మ్యాచ్ లు మిగిలి ఉండగానే పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం