ఈ సాలా కప్ న‌మ్‌దు.. కోహ్లి కల తీరిన వేళ..ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ..తొలిసారి టైటిల్ సొంతం.. ఫైనల్లో పంజాబ్ పై గెలుపు-rcb lifts the ipl trophy for the first time defeated punjab kings by wickets ipl 2025 final kohli bhuvneshwar krunal ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఈ సాలా కప్ న‌మ్‌దు.. కోహ్లి కల తీరిన వేళ..ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ..తొలిసారి టైటిల్ సొంతం.. ఫైనల్లో పంజాబ్ పై గెలుపు

ఈ సాలా కప్ న‌మ్‌దు.. కోహ్లి కల తీరిన వేళ..ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ..తొలిసారి టైటిల్ సొంతం.. ఫైనల్లో పంజాబ్ పై గెలుపు

ఆర్సీబీ సాధించింది. ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణకు ముగింపు పలికింది. ఐపీఎల్ కప్ ను ముద్దాడాలనే కోహ్లి కల తీరింది. ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. కొత్త ఐపీఎల్ ఛాంపియన్ గా అవతరించింది. ఫైనల్లో పంజాబ్ కింగ్స్ ను ఓడించింది.

ఐపీఎల్ 2025 ఛాంపియన్ ఆర్సీబీ (REUTERS)

ఐపీఎల్ లో కొత్త చరిత్ర. గత 17 సీజన్లలో కప్ కోసం పోరాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు కల నిజం చేసుకుంది. రజత్ పాటీదార్ కెప్టెన్సీలో ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. కింగ్ కోహ్లి కలను నిజం చేసింది. మంగళవారం (జూన్ 3) అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో పంజాబ్ పై గెలిచింది.

191 పరుగుల లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ 184/7కే పరిమితమైంది. శశాంక్ సింగ్ (30 బంతుల్లో 61 నాటౌట్; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) పోరాటం పంజాబ్ ను గెలిపించలేకపోయింది. ఆర్సీబీ గొప్పగా బౌలింగ్ చేసింది. కృనాల్ పాండ్య 4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్ రెండు వికెట్లు తీసుకున్నాడు.

ప్రియాన్ష్, ప్రభ్ సిమ్రన్ ధనాధన్

ఫస్ట్ బాల్ కే ప్రియాన్ష్ ఆర్య ఫోర్.. లాస్ట్ బాల్ కు ప్రభ్ సిమ్రన్ సిక్సర్.. ఇదీ ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సీబీతో ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ మొదలైన తీరు. అక్కడి నుంచి ఓపెనర్లు చెలరేగిపోయారు. 2 ఓవర్లకే స్కోరు 23. కానీ హేజిల్‌వుడ్ బౌలింగ్ కు రాగానే కథ మారిపోయింది. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో హేజిల్‌వుడ్ 5 పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాతి ఓవర్లో భువనేశ్వర్ 4 రన్స్ ఇచ్చాడు. బౌండరీలు రాబట్టాలనే ప్రెషర్ తో హేజిల్‌వుడ్ కు చిక్కాడు ప్రియన్ష్ ఆర్య.

కృనాల్ మ్యాజిక్

ఓ ఎండ్ లో జోష్ ఇంగ్లిస్ (23 బంతుల్లో 39; ఓ ఫోర్, 4 సిక్సర్లు) బౌండరీలతో పోరాడాడు. కానీ స్పిన్నర్ కృనాల్ పాండ్య అద్భుతమైన బౌలింగ్ తో పంజాబ్ కింగ్స్ ను దెబ్బకొట్టాడు. ప్రభ్ సిమ్రన్ (26)ను ఔట్ చేసి సెకండ్ వికెట్ పార్ట్ నర్ షిప్ విడగొట్టాడు కృనాల్. ఈ వికెట్ తో పంజాబ్ ఇన్నింగ్స్ షేక్ అయింది.

ఆ తర్వాతి ఓవర్లోనే అత్యంత ముఖ్యమైన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (1) వికెట్ సాధించాడు షెఫర్డ్. బౌండరీ దగ్గర లివింగ్ స్టన్ పట్టిన సూపర్ క్యాచ్ తో ఇంగ్లిష్ ను వెనక్కిపంపాడు కృనాల్. దీంతో 72/1తో ఉన్న పంజాబ్ 98/4తో కష్టాల్లో పడింది.

లాస్ట్ లో డ్రామా

పంజాబ్ విజయానికి లాస్ట్ 5 ఓవర్లలో 72 రన్స్ కావాల్సి వచ్చింది. అప్పటివరకూ నెమ్మదిగా ఆడిన శశాంక్ సింగ్, నేహాల్ వధెరా గేరు మార్చారు. హేజిల్‌వుడ్ ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టాడు శశాంక్. సమీకరణం 24 బంతుల్లో 55 పరుగులుగా మారింది. కానీ 17వ ఓవర్లో భువనేశ్వర్ అదరగొట్టాడు. నేహాల్ తో పాటు స్టాయినిస్ ను ఔట్ చేసి మ్యాచ్ ను ఆర్సీబీ వైపు తిప్పేశాడు. ఆ వెంటనే అజ్మతుల్లాను యశ్ ఔట్ చేయడంతో పంజాబ్ పనైపోయింది.

కోహ్లి ఎమోషనల్

లాస్ట్ ఓవర్లో పంజాబ్ విక్టరీకి 29 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ ఫస్ట్ రెండు బాల్స్ ను హేజిల్‌వుడ్ డాట్ చేయడంతో ఆర్సీబీ విజయం ఖాయమైంది. వెంటనే కోహ్లి ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు ఆపుకున్నాడు. మ్యాచ్ ముగిసిన వెంటనే ప్లేయర్లందరూ కోహ్లి వైపు దూసుకొచ్చి సంబరాలు చేసుకున్నారు. లాస్ట్ నాలుగు బంతుల్లో శశాంక్ సింగ్ వరుసగా 6, 4, 6, 6 కొట్టినా ఫలితం లేకుండా పోయింది.

ఆర్సీబీ ఫైటింగ్ స్కోరు

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింకు దిగిన ఆర్సీబీ ఫైటింగ్ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లి (35 బంతుల్లో 43; 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కెప్టెన్ రజత్ పాటీదార్ (26), లివింగ్ స్టన్ (25), జితేశ్ శర్మ (24), మయాంక్ అగర్వాల్ (24) కీలక పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో జేమీసన్, అర్ష్ దీప్ సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం