ఆర్సీబీ అద్భుతం.. 228 పరుగుల టార్గెట్ ఉఫ్.. విరాట్ వీర విహారం.. జితేశ్ విధ్వంసం.. లక్నోను చిత్తుచేసి టాప్-2లో చోటు-rcb chased down 228 to win over lucknow super giants to enter into top 2 of ipl 2025 will play qualifier 1 kohli jitesh ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ఆర్సీబీ అద్భుతం.. 228 పరుగుల టార్గెట్ ఉఫ్.. విరాట్ వీర విహారం.. జితేశ్ విధ్వంసం.. లక్నోను చిత్తుచేసి టాప్-2లో చోటు

ఆర్సీబీ అద్భుతం.. 228 పరుగుల టార్గెట్ ఉఫ్.. విరాట్ వీర విహారం.. జితేశ్ విధ్వంసం.. లక్నోను చిత్తుచేసి టాప్-2లో చోటు

ఆర్సీబీ అదరగొట్టింది. ఐపీఎల్ 2025 లీగ్ దశలో టాప్-2లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో అద్భుతం చేసింది. విరాట్ కోహ్లి, జితేశ్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో లక్నోను చిత్తుచేసింది.

చెలరేగిన జితేశ్ శర్మ (PTI)

ఆర్సీబీ సాధించింది. ఐపీఎల్ 2025లో అద్భుతం నమోదు చేసింది. మంగళవారం (మే 27) లక్నో సూపర్ జెయింట్స్ పై 6 వికెట్ల తేడాతో అసాధారణ విజయం సాధించింది. 228 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. తాత్కాలిక కెప్టెన్ జితేశ్ శర్మ (33 బంతుల్లో 85 నాటౌట్; 8 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లి (30 బంతుల్లో 54; 10 ఫోర్లు) వీర విధ్వంసం చూపించారు. 4 వికెట్లే కోల్పోయిన ఆర్సీబీ 18.4 ఓవర్లలోనే టార్గెట్ రీచ్ అయింది.

మయాంక్ అగర్వాల్ (23 బంతుల్లో 41 నాటౌట్; 5 ఫోర్లు) ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విజయంతో సెకండ్ ప్లేస్ లో నిలిచిన ఆర్సీబీ.. గురువారం (మే 29) క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. శుక్రవారం (మే 30) ఎలిమినేటర్ లో ముంబయి ఇండియన్స్ ను గుజరాత్ టైటాన్స్ ఢీ కొడుతుంది.

కోహ్లి విధ్వంసం

ఐపీఎల్ 2025లో టాప్-2లో నిలవాలంటే లక్నోపై ఆర్సీబీ కచ్చితంగా గెలవాలి. ఈ పరిస్థితుల్లో ఛేజింగ్ లో విరాట్ కోహ్లి చెలరేగిపోయాడు. ఓ దశలో 200కు పైగా స్ట్రైక్ రేట్ తో పరుగులు సాధించాడు. ఒరోర్క్ వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో కోహ్లి వరుసగా నాలుగు ఫోర్లు కొట్టాడు. ఫిల్ సాల్ట్ (30) కూడా చెలరేగడంతో ఆర్సీబీ 5 ఓవర్లకే 60 పరుగులు చేసింది.

వికెట్ పడ్డా

జోరుమీదున్న ఫిల్ సాల్ట్ ను ఆకాశ్ సింగ్ ఔట్ చేసినా కోహ్లి బాదుడు కొనసాగించాడు. కానీ మరోవైపు ఒరోర్క్ వరుస బంతుల్లో రజత్ పటీదార్ (14), లివింగ్ స్టన్ (0)ను ఔట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. అయినా కోహ్లి ఆగలేదు. 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు విరాట్. ఈ సీజన్ లో అతనికి ఇది ఎనిమిదో ఫిఫ్టీ. మరోవైపు ఆకాశ్ ఓవర్లో మయాంక్ అగర్వాల్ హ్యాట్రిక్ ఫోర్లు రాబట్టాడు.

జితేశ్, మయాంక్ జోరు

11 ఓవర్లకు 122/3తో నిలిచిన ఆర్సీబీ అదే జోరు కొనసాగిస్తే గెలిచేలా కనిపించింది. కానీ అవేశ్ ఆ తర్వాతి ఓవర్లోనే కోహ్లిని ఔట్ చేసి ఆర్సీబీకి బ్రేక్ వేయాలని చూశాడు. అయినా మయాంక్, జితేశ్ శర్మ కలిసి లక్నో బౌలింగ్ ను చిత్తుచిత్తు చేశారు. షాబాజ్ అహ్మద్ ఓవర్లో జితేశ్ రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టాడు. 15 ఓవర్లకు స్కోరు 177/4.

లాస్ట్ లో ఉత్కంఠ

ఆర్సీబీ విజయానికి చివరి అయిదు ఓవర్లలో 51 పరుగులు కావాల్సి రావడంతో ఉత్కంఠ నెలకొంది. అవేశ్ వేసిన 16వ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దిగ్వేష్ బౌలింగ్ లో సిక్సర్ తో జితేశ్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఆ ఓవర్లో జితేశ్ ను మాన్కడింగ్ రనౌట్ చేసేందుకు దిగ్వేష్ ట్రై చేశాడు. కానీ పంత్ అప్పీల్ వెనక్కి తీసుకున్నాడు.

చివరి మూడు ఓవర్లలో ఆర్సీబీ గెలవాలంటే 28 పరుగులు చేయాల్సిన పరిస్థితి. కానీ జితేశ్ బాదుడుతో ఆర్సీబీకి ఇబ్బంది లేకుండా పోయింది. ఒరోర్క్ వేసిన 18వ ఓవర్లో జితేశ్ వరుసగా 4, 0, 4, 6, 6 బాదడంతో మొత్తం 21 పరుగులు వచ్చాయి. ఈక్వేషన్ 12 బంతుల్లో 7 పరుగులుగా మారిపోయింది. ఆ తర్వాతి ఓవర్లోనే జితేశ్ సిక్సర్ తో మ్యాచ్ ముగించాడు.

పంత్ సెంచరీ

అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 227 పరుగులు చేసింది. లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ (61 బంతుల్లో 118 నాటౌట్; 11 ఫోర్లు, 8 సిక్సర్లు) అజేయ సెంచరీతో అదరగొట్టాడు. ఎట్టకేలకు లాస్ట్ లీగ్ మ్యాచ్ లో సత్తాచాటాడు. మిచెల్ మార్ష్ (37 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా మెరిశాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం