Ravindra Jadeja: నేను రేపే మళ్లీ గాయపడొచ్చు.. అందుకే ఆ పని చేయదలచుకోలేదు: జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్-ravindra jadeja about injuries england style of palying cricket ashwin 500th test wicket and more india vs england ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ravindra Jadeja: నేను రేపే మళ్లీ గాయపడొచ్చు.. అందుకే ఆ పని చేయదలచుకోలేదు: జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Ravindra Jadeja: నేను రేపే మళ్లీ గాయపడొచ్చు.. అందుకే ఆ పని చేయదలచుకోలేదు: జడేజా ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

Ravindra Jadeja: రవీంద్ర జడేజా తన వరుస గాయాలపై స్పందించాడు. ఇంగ్లండ్ తో గురువారం (ఫిబ్రవరి 15) నుంచి మూడో టెస్ట్ జరగనున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అతడు.. రేపే నేను గాయపడొచ్చు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

తన వరుస గాయాలపై స్పందించిన రవీంద్ర జడేజా (PTI)

Ravindra Jadeja: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో గాయం నుంచి కోలుకొని జట్టులోకి వస్తున్నాడు. మిడిలార్డర్ బలహీనంగా ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ తో మూడో టెస్టులో బ్యాట్ తోనూ జడేజా సేవలు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో అతడు తన గాయాలు, అశ్విన్ 500వ టెస్ట్ వికెట్ కు దగ్గర్లో ఉండటం, ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ ఆడుతున్న తీరుపై స్పందించాడు.

గాయాలపై జడేజా కామెంట్స్ ఇవీ

గత మూడేళ్లుగా జడేజా తరచూ గాయపడుతున్నాడు. టీమ్ కు ఆడినప్పుడల్లా బ్యాట్, బాల్, ఫీల్డింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నా.. గాయాలు మాత్రం అతన్ని పరీక్షిస్తున్నాయి. తాజాగా గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమైన అతడు రాజ్‌కోట్ లో జరగబోయే మూడో టెస్టుకు జట్టులోకి వచ్చాడు. అయితే ఈ మ్యాచ్ లో తాను ఫీల్డింగ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటానని అతడు స్పష్టం చేశాడు.

"నా వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తాను. కానీ నా శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను. మరీ అవసరమైతే తప్ప ఫీల్డ్ లో డైవ్ చేయను. తరచూ గాయాలు చికాకు తెప్పిస్తాయి. కానీ ఈ రోజుల్లో చాలా క్రికెట్ ఆడుతున్నాం. అది కూడా చూడాలి. నా ఫీల్డింగ్ విషయానికి వస్తే నేనేమీ తప్పించుకోను.

ఫార్మాట్ తో సంబంధం లేకుండా ఫీల్డింగ్ లో చురుగ్గా ఉంటాను. అందుకేనేమో తరచూ బాల్ నా దగ్గరకు వస్తుంది. ఓ మంచి క్యాచ్ పట్టుకోవాలని, రనౌట్ చేయాలని టీమ్ కోరుకుంటుంది. నా శరీరం విషయంలో నేను ఇంకాస్త స్మార్ట్ గా ఉంటే సరిపోతుంది. అయినా అది కూడా గ్యారెంటీ ఏమీ లేదు. రేపే నేను మళ్లీ గాయపడొచ్చు. చెప్పలేం కదా" అని జడేజా అన్నాడు.

అశ్విన్ 500వ వికెట్‌పై..

ఇక టెస్ట్ క్రికెట్ లో అశ్విన్ 500 వికెట్లు తీయడానికి మరో వికెట్ దూరంలో ఉన్నాడు. నిజానికి విశాఖపట్నంలోనే ఈ రికార్డు అందుకుంటాడని అనుకున్నా.. అతడు 499 వికెట్ల దగ్గర ఆగిపోయాడు. దీనిపైనా జడేజా స్పందించాడు. "అశ్విన్ 500 వికెట్లకు చేరువలో ఉండటం ఉత్సాహం అనిపిస్తోంది. అతడు తొలి టెస్టులోనే ఈ ఘనత సాధిస్తాడని అనుకున్నా. కానీ విధి.. ఇప్పుడతడు ఆ మైలురాయిని నా సొంతూరులో చేరుకోబోతున్నాడు" అని జడేజా అన్నాడు.

ఇంగ్లండ్‌ను ఓడించడం కష్టం కాదు

ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ ఆడుతున్న తీరుపైనా జడేజా స్పందించాడు. వాళ్లు క్రికెట్ ను భిన్నంగా ఆడుతున్నారు తప్ప.. వాళ్లను ఓడించడం కష్టమేమీ కాదని జడేజా అన్నాడు. "ఇంగ్లండ్ ను ఓడించడం కష్టమేమీ కాదు. కేవలం వాళ్లు క్రికెట్ ను భిన్నంగా ఆడుతున్నారు అంతే. కాస్త దూకుడుగా ఆడుతున్నారు. ఆ స్టైల్ కు అలవాటు పడి.. అందుకు తగినట్లు ప్లాన్ చేసుకుంటే చాలు" అని జడేజా అన్నాడు.

ఇంగ్లండ్ తో టీమిండియా మూడో టెస్ట్ గురువారం (ఫిబ్రవరి 15) నుంచి రాజ్‌కోట్ లో జరగనుంది. ఈ మ్యాచ్ కు కోహ్లి, రాహుల్, అయ్యర్ లాంటి సీనియర్లు దూరం కావడంతో ఇండియన్ టీమ్ మిడిలార్డర్ బలహీనమైంది. ఈ నేపథ్యంలో రవీంద్ర జడేజా బ్యాట్ తోనూ కీలకం కానున్నాడు.