Ashwin Farewell: నా కోసం ఎవరూ ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చకూడదు.. ఘనమైన వీడ్కోలు అవసరం లేదు: అశ్విన్
Ashwin Farewell: అశ్విన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అతనికి ఘనమైన వీడ్కోలు పలకకపోవడంపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేయడంపై స్పందిస్తూ.. అలాంటివేవీ అవసరం లేదని, తన కోసం ఎవరూ ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చకూడదని అన్నాడు.
Ashwin Farewell: టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ సడెన్ గా జరిగిపోయింది. అతనికి టీమ్ మెంబర్స్ కనీసం సరైన వీడ్కోలు కూడా పలకలేకపోయారు. దీనిపై మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ.. తాను అక్కడ ఉండి ఉంటే.. అశ్విన్ కు మంచి గౌరవంతో వీడ్కోలు పలికేవాడినని అన్నాడు. దీనిపై తాజాగా అశ్విన్ ఓ యూట్యూబ్ షోలో మాట్లాడాడు. తనకు అలాంటి ఘనమైన వీడ్కోలు అవసరం లేదని, తనకోసం ఎవరూ కన్నీటి చుక్క కార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
ముఖ్యంగా మీరు నాకు గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వకూడదు. నా కోసం ఎవరూ ఒక్క కన్నీటి చుక్క కూడా కార్చకూడదు. సూపర్ సెలబ్రిటీ కల్చర్ లోనే ఈ గ్రాండ్ సెండాఫ్స్ భాగం" అని అశ్విన్ అన్నాడు.
అది ఆటకే అగౌరవం
"మనం ఎవరి వెంటైనా ఎందుకు వెళ్లాలి? వాళ్లపై మనకున్న ప్రేమ వల్లే వాళ్ల వెంట పడతాం. కానీ ఎవరైనా వాళ్లు సాధించిన ఘనతలను చూసి స్ఫూర్తి పొందాలి. వాళ్లు ఆటను వదిలిపెట్టిన తీరు గురించి మాట్లాడుకోవాలి. కానీ ఫేర్‌వెల్స్ మాత్రం తప్పు. నా కోసం ప్రత్యేకంగా ఓ మ్యాచ్ నిర్వహించడం అనేది ఆటనే అగౌరవపరచడం అవుతుంది" అని అశ్విన్ అన్నాడు.
"నాకు ఎలాంటి బాధా లేదు. 537 వికెట్లతో కూడా సంతోషంగా లేకపోతే.. ఇంక నాకు ఆనందం కలిగించేది ఏది? లేని దాని గురించి నేను బాధపడటం దేనికి? ఉన్నదాన్ని అంగీకరించడంలో గొప్ప సంతోషం ఉంటుంది. మనకు లేని దాని వెంట మనం పడుతూ ఉంటాం. కానీ లేని దాని గురించి బాధపడొద్దు" అని అశ్విన్ స్పష్టం చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ లో జరిగిన మూడో టెస్టు ముగియగానే అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించి ఇండియాకు వచ్చేసిన విషయం తెలిసిందే. మరుసటి రోజు వరకు కూడా ఆగకుండా అదే రోజు అతడు ఇండియాకు వచ్చేయడం గమనార్హం. అతనికి సరైన వీడ్కోలు ఇవ్వకపోవడంపై కపిల్ దేవ్ లాంటి మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.