Nitish Kumar Reddy: నితీష్ కుమార్ సెంచరీ - కామెంటరీ బాక్స్‌లో కన్నీళ్లు పెట్టుకున్న రవి శాస్త్రి - వీడియో వైరల్
Nitish Kumar Reddy: నితీష్ కుమార్ రెడ్డిపై క్రికెట్ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తోన్నారు. నితీష్ కుమార్ సెంచరీ సాధించడంతో ఈ మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్న రవి శాస్త్రి ఎమోషనల్ అయ్యాడు. రవి శాస్త్రి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
Nitish Kumar Reddy: బాక్సిండ్ డే టెస్ట్‌లో మూడో రోజు సెంచరీతో అదరగొట్టి మెల్‌బోర్న్ హీరోగా నిలిచాడు తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి. రోహిత్, కోహ్లి వంటి దిగ్గజాలు సైతం ఆస్ట్రేలియా బౌలర్లను ఎదుర్కోలేక చేతుతెల్తేసిన తరుణంలో ఎనిమిదో నంబర్ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన నితీష్ టీమిండియాను సెంచరీతో ఆదుకున్నాడు. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి తొమ్మిదో వికెట్‌కు ఏకంగా 127 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించాడు. ఈ మ్యాచ్‌తో పలు రికార్డులను నితీష్ తన ఖాతాలో వేసుకున్నాడు.
రవి శాస్త్రి ఎమోషనల్...
నితీష్ కుమార్ సెంచరీ సాధించడంతో మ్యాచ్ ప్రత్యక్షంగా వీక్షిస్తోన్న అతడి తండ్రి ముత్యాలు రెడ్డితో పాటు పలువురు ఎమోషనల్ అయ్యారు. వారిలో టీమిండియా దిగ్గజ క్రికెటర్ రవి శాస్త్రి కూడా ఉన్నాడు. నాలుగో టెస్ట్‌కు ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి రవి శాస్త్రి కామెంటేటర్‌గా వ్యవహరిస్తోన్నాడు.
నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ పూర్తిచేయగానే కామెంటరీ బాక్స్‌లో ఉన్న పఠాన్‌తో పాటు మరో కామెంటేటర్ సంబరాలు చేసుకున్నారు. కానీ నితీష్ సెంచరీ చూసి రవి శాస్త్రి మాత్రం ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించాడు. రవి శాస్త్రి కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
చాలా కాలం గుర్తుండిపోతుంది...
నితీష్ కుమార్ రెడ్డి ఆటతీరును ఉద్దేశించి రవిశాస్త్రి ఓ ట్వీట్ చేశాడు. నితీష్ ఇన్నింగ్స్ చాలా కాలం పాటు క్రికెట్ అభిమానులందరికి గుర్తుండిపోతుందని అన్నాడు. ఒత్తిడిని జయిస్తూ ఈ 21 ఏళ్ల క్రికెటర్ సాగించిన అసమాన పోరాటం, ఆటతీరు క్రికెట్ అభిమానులందరిని కన్నీళ్లు పెట్టించింది అని రవి శాస్త్రి ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ప్యూర్ గోల్డ్, అద్భుతంగా ఆడవంటూ నితీష్‌పై రవి శాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
సచిన్, పంత్ తర్వాత...
మెల్‌బోర్న్‌లో సెంచరీతో అదరగొట్టిన నితీష్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 25 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ మ్యాచ్ ద్వారా ఆస్ట్రేలియాపై టెస్టుల్లో సచిన్ టెండూల్కర్, రిషబ్ పంత్ తర్వాత సెంచరీ సాధించిన అతి చిన్న వయస్కుడిగా నితీష్ కుమార్ రికార్డ్ క్రియేట్ చేశాడు.