Rajat Patidar: రజత్ పటీదార్‌కు ఆర్సీబీ కెప్టెన్సీ.. విరాట్ కోహ్లి రియాక్షన్ ఇదీ..
Rajat Patidar: ఆర్సీబీ కెప్టెన్సీని రజత్ పటీదార్ కు ఇవ్వడంపై విరాట్ కోహ్లి స్పందించాడు. అతనికి పూర్తి మద్దతుగా ఉంటానని, ఫ్యాన్స్ కూడా రజత్ కు సపోర్ట్ ఇవ్వాలని కోరాడు. ఓ వీడియో సందేశాన్ని అతడు పంపించాడు.

Rajat Patidar: ఐపీఎల్ 2025 కోసం రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తమ కొత్త కెప్టెన్ గా రజత్ పటీదార్ ను నియమించిన విషయం తెలుసు కదా. దీనిపై ఆ టీమ్ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. నిజానికి కెప్టెన్సీ అతనికే దక్కే అవకాశం ఉందని భావించినా.. చివరికి రజత్ లాంటి యువ ఆటగాడికి కెప్టెన్సీ ఇచ్చి ఆ ఫ్రాంఛైజీ ఆశ్చర్యపరిచింది.
కెప్టెన్సీకి నువ్వు అర్హుడివే: విరాట్ కోహ్లి
ఆర్సీబీ కొత్త కెప్టెన్సీ అనౌన్స్‌మెంట్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో విరాట్ కోహ్లి వీడియో మెసేజ్ పంపించాడు. అందులో అతడు మాట్లాడుతూ.. “రజత్ ముందుగా నీకు శుభాకాంక్షలు. ఆల్ ద వెరీ బెస్ట్. ఈ ఫ్రాంఛైజీలో నువ్వు ఆడిన తీరు, ఎదిగిన తీరుకు కృతజ్ఞతలు.
ఆర్సీబీ ఫ్యాన్స్ హృదయాల్లో నువ్వు చోటు సంపాదించావు. కెప్టెన్సీకి నువ్వు అర్హుడివి. నాతోపాటు టీమ్ సభ్యులంతా నీ వెనుకే ఉంటారు. నీకు కావాల్సిన పూర్తి మద్దతు లభిస్తుంది” అని అన్నాడు.
గతంలో విరాట్ కోహ్లి 9 సీజన్లపాటు ఆర్సీబీకి కెప్టెన్ గా ఉన్నాడు. 2016లో ఫైనల్స్ కు కూడా తీసుకెళ్లాడు. అయితే 2022 సీజన్లో అతడు కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. తర్వాత మూడు సీజన్ల పాటు ఫాఫ్ డుప్లెస్సీ కెప్టెన్సీ చేపట్టాడు.
అతనికి ఇదో గొప్ప గౌరవం: కోహ్లి
ఆర్సీబీ కెప్టెన్సీని రజత్ తన ప్రతిభతో సంపాదించుకున్నాడని విరాట్ అన్నాడు. “ఇదో గొప్ప బాధ్యత. నేను ఎన్నో ఏళ్ల పాటు చేశాను. ఫాఫ్ గత కొన్నేళ్లు చేశాడు. ఇప్పుడు రజత్ ఫ్రాంఛైజీని ముందుకు తీసుకెళ్లబోతున్నాడు. అతనికి ఇదో గొప్ప గౌరవం. ఈ కెప్టెన్సీని నువ్వు ప్రతిభతో సంపాదించుకున్నావు. ఓ ప్లేయర్ గా రెండేళ్లుగా అతడు ఎంతో పరిణతి సాధించాడు” అని కోహ్లి అన్నాడు.
ఆర్సీబీ 2008 నుంచీ ఐపీఎల్లో ఉన్నా ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేదు. గతంలో ద్రవిడ్, కుంబ్లే, పీటర్సన్, వెటోరీ, కోహ్లి, డుప్లెస్సిలాంటి కెప్టెన్లు ఉన్నా కూడా ఆర్సీబీని విజేతగా నిలపలేకపోయారు. ఇప్పుడు రజత్ పటీదార్ లాంటి యువ కెప్టెన్ ఏం చేయబోతున్నాడన్నది చూడాలి.
ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీతో రజత్ చేరాడు. ఆర్సీబీ రిటెయిన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్స్ లో రజత్ ఒకరు. ఆర్సీబీ తరఫున తొలి సీజన్లో ఫెయిలైనా 2022లో 333 రన్స్ చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది. 2023 సీజన్ గాయం కారణంగా ఆడలేదు. ఇక గతేడాది మరింత చెలరేగి 395 రన్స్ చేశాడు.
ఆర్సీబీ తరఫున రజత్ మొత్తం 27 మ్యాచ్ లు ఆడాడు. అందులో 799 రన్స్ చేశాడు. సగటు 34.74. స్ట్రైక్ రేట్ 158.85. అయితే తమ జట్టు తరఫున ఇంత తక్కువ అనుభవం ఉన్న రజత్ కు ఆర్సీబీ కెప్టెన్సీ అప్పగించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సంబంధిత కథనం