RR vs RCB: టాస్ గెలిచి సంజూ సేన.. బెంగళూరుతో పోరుకు స్పెషల్ జెర్సీతో బరిలోకి రాజస్థాన్.. ఎందుకంటే..-rajasthan royals wears all pink special jersey against royal challengers bengaluru toss final xis ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Rr Vs Rcb: టాస్ గెలిచి సంజూ సేన.. బెంగళూరుతో పోరుకు స్పెషల్ జెర్సీతో బరిలోకి రాజస్థాన్.. ఎందుకంటే..

RR vs RCB: టాస్ గెలిచి సంజూ సేన.. బెంగళూరుతో పోరుకు స్పెషల్ జెర్సీతో బరిలోకి రాజస్థాన్.. ఎందుకంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 06, 2024 07:39 PM IST

RR vs RCB IPL 2024: హ్యాట్రిక్ విజయాలతో ఈ ఐపీఎల్ సీజన్‍లో జోష్‍లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో నేడు తలపడుతోంది. మళ్లీ గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకుంది రాజస్థాన్. తుది జట్లు ఎలా ఉన్నాయంటే..

RR vs RCB: టాస్ గెలిచి సంజూ సేన.. బెంగళూరుతో పోరుకు స్పెషల్ జెర్సీతో బరిలోకి రాజస్థాన్.. ఎందుకంటే..
RR vs RCB: టాస్ గెలిచి సంజూ సేన.. బెంగళూరుతో పోరుకు స్పెషల్ జెర్సీతో బరిలోకి రాజస్థాన్.. ఎందుకంటే..

RR vs RCB: ఐపీఎల్ 2024 సీజన్‍లో మళ్లీ గెలుపు బాటపట్టేందుకు తపిస్తున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. రాజస్థాన్‍ రాయల్స్ టీమ్‍ను ఢీకొట్టేందుకు బరిలోకి దిగింది. నాలుగు మ్యాచ్‍ల్లో మూడు ఓడిన బెంగళూరు.. పుంజుకోవాలని ప్రయత్నిస్తుంటే.. హ్యాట్రిక్ విజయాలతో దుమ్మురేపిన రాజస్థాన్ జోష్ కొనసాగించాలని కసిగా ఉంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‍సింగ్ స్టేడియం వేదికగా నేడు (ఏప్రిల్ 6) రాజస్థాన్, బెంగళూరు మధ్య పోరు షురూ అయింది. ఈ మ్యాచ్‍లో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ముందుగా బౌలింగ్ ఎంపిక చేసుకున్నాడు. దీంతో బెంగళూరు ఫస్ట్ బ్యాటింగ్‍కు దిగనుంది.

గత మ్యాచ్ తుది జట్టునే రాజస్థాన్ రాయల్స్ కొనసాగించింది. అయితే, ఆ జట్టు ప్రధాన పేసర్ సందీప్ శర్మ ఇంకా అందుబాటులోకి రాలేదు. పిచ్ సీమర్లకు సహకరించేలా కనిపిస్తుందని, తర్వాత కాస్త మంచు ఉండే అవకాశం ఉందని టాస్ సమయంలో సంజూ శాంసన్ చెప్పాడు. అందుకే ముందుగా బౌలింగ్ చేసేందుకు నిర్ణయించుకున్నట్టు చెప్పాడు. బెంగళూరు జట్టులో యువ ప్లేయర్ సౌరభ్ చౌహాన్ చోటు దక్కించుకున్నాడు.

రాజస్థాన్ స్పెషల్ జెర్సీ

బెంగళూరుతో ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లు ప్రత్యేకమైన పింక్ కలర్ జెర్సీ ధరించారు. రాజస్థాన్ గ్రామీణ మహిళా సాధికారతకు మద్దతు తెలియజేస్తూ ఇలా ఈ మ్యాచ్‍లో ప్రత్యేకమైన జెర్సీ వేసుకొని బరిలోకి దిగారు. ఆల్ పింక్ కిట్‍తో వచ్చారు. అలాగే, ఈ మ్యాచ్‍ కోసం అమ్ముడైన ఒక్కో టికెట్టుపై రూ.100ను మహిళల వృద్ధికి ఆ ప్రాంచైజీ విరాళంగా ఇవ్వనుంది. అలాగే, ఈ మ్యాచ్‍లో కొట్టే ఒక్కో సిక్సర్‌కు.. రాజస్థాన్‍లోని ఆరు కుటుంబాలకు సొలార్ పవర్‌ను ఆ ఫ్రాంచైజీ అందించనుంది.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు: విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్ (వికెట్ కీపర్), సౌరవ్ చౌహాన్, రీస్ టోప్లీ, మయాంక్ దగర్, మహమ్మద్ సిరాజ్, యశ్ దయాల్

బెంగళూరు సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: సుయాష్ ప్రభుదేశాయ్, మహిపాల్ లోమ్రోర్, హిమాన్షు శర్మ, విజయ్‍కుమార్ వైశాక్, స్వప్నిల్ సింగ్

రాజస్థాన్ రాయల్స్ తుదిజట్టు: యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, షిమ్రన్, హిట్మైర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఆవేశ్ ఖాన్, నాండ్రే బర్గర్, యజువేంద్ర చాహల్

రాజస్థాన్ సబ్ ఇంపాక్ట్ ఆప్షన్లు: రావ్మన్ పావెల్, తనుష్ కొటియన్, కుల్దీప్ సేన్, శుభమ్ దూబే, అబిద్ ముస్తాక్

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈ సీజన్‍లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్‍ల్లో మూడు ఓడి తీవ్రంగా నిరాశపరించింది. చెన్నైపై తన తొలి మ్యాచ్‍లో ఓడిన ఆర్సీబీ.. ఆ తర్వాత పంజాబ్‍పై గెలిచి గాడిలో పడినట్టు కనిపించింది. అయితే, ఆ తర్వాత కోల్‍కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లపై డుప్లెసిస్ సేన ఓడింది. ముఖ్యంగా గత రెండు మ్యాచ్‍ల్లో కనీస పోరాటం లేకుండా బెంగళూరు పరాజయం చెందింది. లక్నోపై గత పోరులో 28 పరుగుల తేడాతో ఓడిపోయింది. లక్ష్యఛేదనలో చేతులెత్తేసి ఆర్సీబీ చతికిలపడింది. అయితే, రాజస్థాన్‍తో ఈ మ్యాచ్‍లో సత్తాచాటి మళ్లీ గెలుపు బాటపట్టాలని భావిస్తోంది.

Whats_app_banner