రాజస్థాన్ కూడా ఔట్.. ప్లేఆఫ్స్ కు దూరం.. ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తు-rajasthan royals out of ipl 2025 play offs race heavy defeat against mumbai indians as bumrah boult bowling fiery ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  రాజస్థాన్ కూడా ఔట్.. ప్లేఆఫ్స్ కు దూరం.. ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తు

రాజస్థాన్ కూడా ఔట్.. ప్లేఆఫ్స్ కు దూరం.. ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తు

మాజీ ఛాంపియన్ రాజస్థాన్ రాయల్స్ కు నిరాశ తప్పలేదు. ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి ఆ టీమ్ నిష్క్రమించింది. ముంబయి ఇండియన్స్ చేతిలో చిత్తుగా ఓడిన రాజస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది.

రాజస్థాన్ పై ముంబయి ఇండియన్స్ ఘన విజయం (REUTERS)

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి మరో టీమ్ నిష్క్రమించింది. చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు దూరమైన మరుసటి రోజే రాజస్థాన్ రాయల్స్ కూడా అదే బాటలో సాగింది. ఆశలు నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో గురువారం (మే 1) రాజస్థాన్ రాయల్స్ చిత్తుచిత్తుగా ఓడింది. ఆ టీమ్ పై ముంబయి ఇండియన్స్ 100 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

జస్ప్రీత్ బుమ్రా (2/15), బౌల్ట్ (3/28), కర్ణ్ శర్మ (3/23) కలిసి రాజస్థాన్ పనిపట్టారు. 218 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఆ టీమ్ 117 పరుగులకు ఆలౌటైంది. 11 మ్యాచ్ ల్లో 8వ ఓటమితో ఆ టీమ్ ప్లేఆఫ్స్ కు దూరమైంది. మరోవైపు ముంబయికి ఇది వరుసగా ఆరో విజయం. 11 మ్యాచ్ ల్లో ఏడో విజయంతో ముంబయి పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లింది.

బౌల్ట్, బుమ్రా అదుర్స్

భారీ టార్గెట్.. అయినా హోం గ్రౌండ్ లో రాజస్థాన్ రాయల్స్ పై అంచనాలు. ఎందుకంటే గత మ్యాచ్ లో ఇదే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ పై 210 టార్గెట్ ను 15.5 ఓవర్లలోనే కంప్లీట్ చేసిందా టీమ్. కానీ ముంబయి ఇండియన్స్ పై మాత్రం ఆ టీమ్ నిలబడలేకపోయింది. బౌల్ట్, బుమ్రా ధాటికి టాపార్డర్ లేచిపోయింది.

వైభవ్ జీరో

గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లోనే సెంచరీ కొట్టిన 14 ఏళ్ల ఆటగాడు వైభవ్ సూర్యవంశీ ముంబయిపై ఫెయిల్ అయ్యాడు. ఫస్ట్ ఓవర్లోనే అతణ్ని దీపక్ చాహర్ ఔట్ చేశాడు. రెండు బంతులాడిన వైభవ్ ఒక్క పరుగూ చేయలేకపోయాడు. ఆ తర్వాత బౌల్ట్ తన వరుస ఓవర్లలో యశస్వి జైస్వాల్, నితీశ్ రాణాను ఔట్ చేశాడు.

ఇక బుమ్రా మరోసారి ప్రత్యర్థిని వణికించాడు. వరుస బంతుల్లో రియాన్ పరాగ్, హెట్ మయర్ ను ఔట్ చేశాడు. దీంతో 47 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ ఓటమి ఖాయమైంది. ఇంపాక్ట్ ప్లేయర్ శుభమ్ దూబెను హార్దిక్ తన ఫస్ట్ బాల్ కే ఔట్ చేశాడు.

కర్ణ్ మ్యాజిక్

ముంబయి స్పిన్నర్ కర్ణ్ శర్మ అదరగొట్టాడు. అప్పటికే గెలుపు ఖాయమైన మ్యాచ్ లో ఈ లెగ్ స్పిన్నర్ టకటకా వికెట్లు తీసి మ్యాచ్ ను త్వరగా ముగించాడు. ధ్రువ్ జూరెల్ ను ఔట్ చేసిన కర్ణ్.. ఆ తర్వాత ఒకే ఓవర్లో తీక్షణ, కుమార్ కార్తీకేయ వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. చివర్లో ఆర్చర్ (30) రాజస్థాన్ స్కోరును 110 దాటించాడు. అతణ్ని ఔట్ చేసిన బౌల్ట్ మ్యాచ్ ముగించాడు.

ముంబయి భారీ స్కోరు

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో రెండు వికెట్లకు 217 పరుగులు చేసింది. ఓపెనర్లు రికిల్టన్ (38 బంతుల్లో 61; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), రోహిత్ శర్మ (36 బంతుల్లో 53; 9 ఫోర్లు) అదరగొట్టారు. ఫస్ట్ వికెట్ కు 11.5 ఓవర్లలో 116 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు.

రికిల్టన్, రోహిత్ ఔటైన తర్వాత సూర్యకుమార్, హార్దిక్ పాండ్య రెచ్చిపోయారు. ఈ ఇద్దరు కూడా 23 బంతుల్లోనే 48 పరుగులతో నాటౌట్ గా నిలవడం విశేషం. సూర్య 4 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టగా.. హార్దిక్ 6 ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం