IPL Rajastan Royals Captain Parag: శాంసన్ ఉన్నా..ఆ 23 ఏళ్ల కుర్రాడికే కెప్టెన్సీ.. రాజస్థాన్ రాయల్స్ అనూహ్య నిర్ణయం
IPL Rajasthan Royals Captain Parag: ఐపీఎల్ 2025 కు ముందు రాజస్థాన్ రాయల్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులోనే ఉన్నా యువ ఆల్ రౌండర్ కు జట్టు పగ్గాలు అప్పగించింది. అయితే దీని వెనుక ఓ కారణముంది.
ఐపీఎల్ 2025 కు ముందు రాజస్థాన్ రాయల్స్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ సీజన్ కు గాను తమ కెప్టెన్ గా యువ ఆల్ రౌండర్ రియాన్ పరాగ్ పేరును ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ సంజు శాంసన్ జట్టులోనే ఉన్నా రాజస్థాన్ రాయల్స్ ఈ నిర్ణయం తీసుకుంది. శాంసన్ ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించకపోవడమే ఇందుకు కారణం. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తొలి మూడు మ్యాచ్ లకు పరాగ్ కెప్టెన్.
కేవలం బ్యాటర్ గానే
రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్‌ను ఐపీఎల్ 2025లో తమ తొలి మూడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా నియమించినట్లు ఫ్రాంచైజీ గురువారం ప్రకటించింది. సంజూ శాంసన్ పూర్తి ఫిట్‌నెస్ పొందిన తర్వాతే కెప్టెన్‌గా తిరిగి రావాలని నిర్ణయించుకోవడంతో ఈ ప్రకటన వెలువడింది. శాంసన్ కేవలం బ్యాటర్ గానే ఆడబోతున్నాడు. ఇంకా పూర్తి ఫిట్ నెస్ సాధించలేదు. వికెట్ కీపింగ్ కూడా చేసే ఛాన్స్ లేదు.
అనౌన్స్ చేసిన శాంసన్
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తొలి మూడు మ్యాచ్ లకు రియాన్ పరాగ్ కెప్టెన్సీ చేస్తాడని రెగ్యులర్ సారథి శాంసన్ ఆనౌన్స్ చేశాడు. ఫ్రాంఛైజీ గురువారం (మార్చి 20) పోస్టు చేసిన వీడియోలో శాంసన్ ఈ మేరకు మాట్లాడాడు.
‘‘వచ్చే మూడు మ్యాచ్ లకు నేను పూర్తి ఫిట్ నెస్ తో లేను. మన గ్రూప్ లో చాలా మంది లీడర్స్ ఉన్నారు. కొన్నేళ్లుగా జట్టుతోనే ఉన్నారు. వచ్చే మూడు మ్యాచ్ లకు జట్టును రియాన్ పరాగ్ నడిపించబోతున్నాడు. అతనికా సామర్థ్యం ఉందని నమ్ముతున్నా. అతనికి సపోర్ట్ గా ఉండాలి. మద్దతునివ్వాలి’’ అని టీమ్ మీటింగ్ లో శాంసన్ చెప్పాడు.
కెప్టెన్సీ అనుభవం
2019 నుంచి రియాన్ పరాగ్ ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్నాడు. లీగ్ లో కెరీర్ స్టార్టింగ్ నుంచి అతను అదే జట్టుతో ఉన్నాడు. ఇప్పటివరకూ 70 మ్యాచ్ లాడిన పరాగ్ 1173 పరుగులు చేేశాడు. ఈ స్పిన్నర్ 4 వికెట్లు కూడా పడగొట్టాడు. దేశవాళీ క్రికెట్లో అస్సాం జట్టుకు నాయకత్వం వహించిన అనుభవం పరాగ్ కు ఉంది.
ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తొలి మ్యాచ్ లో ఈ నెల 23న సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడనుంది. ఆ తర్వాత మార్చి 26న కోల్ కతా నైట్ రైడర్స్ తో, మార్చి 30న చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడనుంది. ఈ మూడు మ్యాచ్ లకు రాజస్థాన్ కు పరాగ్ కెప్టెన్. అప్పటివరకూ శాంసన్ పూర్తి ఫిట్ నెస్ సాధిస్తే తిరిగి సారథ్య పగ్గాలు చేపడతాడు.
సంబంధిత కథనం