IPL 2024: గాల్లో తేలుతూ ఐపీఎల్ మ్యాచ్ చూసేలా.. నయా ఐడియా-rajasthan royals introduces hot air balloon to experience ipl matches from 45 feet height ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2024: గాల్లో తేలుతూ ఐపీఎల్ మ్యాచ్ చూసేలా.. నయా ఐడియా

IPL 2024: గాల్లో తేలుతూ ఐపీఎల్ మ్యాచ్ చూసేలా.. నయా ఐడియా

Chatakonda Krishna Prakash HT Telugu
Apr 11, 2024 02:33 PM IST

IPL 2024 - Rajasthan Royals: రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ కొత్త ఐడియాను అమలు చేస్తోంది. ఎయిర్ బెలూన్ నుంచి మ్యాచ్ చూసే అవకాశాన్ని కొందరికి కల్పిస్తోంది. ఆ వివరాలివే..

IPL 2024: గాల్లో తేలుతూ ఐపీఎల్ మ్యాచ్ చూసేలా.. రాజస్థాన్ రాయల్స్ నయా ఐడియా
IPL 2024: గాల్లో తేలుతూ ఐపీఎల్ మ్యాచ్ చూసేలా.. రాజస్థాన్ రాయల్స్ నయా ఐడియా

IPL 2024: ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. కొందరు లక్కీ ఫ్యాన్స్ గాలిలో తేలుతూ మ్యాచ్ చూసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా హాట్ ఎయిర్ బెలూన్లను ఏర్పాటు చేసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‍సింగ్ స్టేడియంలో జరిగే మ్యాచ్‍లను 45 అడుగుల ఎత్తు నుంచి చూసేలా కొందరు అభిమానులకు అవకాశం కల్పిస్తోంది.

ఆ మ్యాచ్‍కు కూడా..

రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య బుధవారం (మార్చి 10) జరిగిన మ్యాచ్‍తో ఈ హాట్ ఎయిర్ బెలూన్లు మొదలయ్యాయి. ఈ బెలూన్‍లో కూర్చొని ఆ మ్యాచ్ చేసే అవకాశం కొందరు లక్కీ అభిమానులకు దక్కింది. ఏప్రిల్ 22వ తేదీన జైపూర్ సవాయి మాన్‍సింగ్ స్టేడియంలో హోం టీమ్ రాజస్థాన్‍తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‍కు కూడా ఈ హాట్ ఎయిర్ బెలూన్స్ ఉండనున్నాయి. ఆ తర్వాతి మ్యాచ్‍లకు కూడా కొనసాగించే అవకాశం ఉంది.

ఈ హాట్ ఎయిర్ బెలూన్ ద్వారా సుమారు 45 అడుగుల ఎత్తు నుంచి మ్యాచ్ వీక్షించవచ్చు. విహంగ వీక్షణం ద్వారా సరికొత్త అనుభూతితో తిలకించవచ్చు. తొలిసారి ఐపీఎల్‍లో ఈ హాట్ ఎయిర్ బెలూన్‍ను రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తీసుకొచ్చింది.

ప్రతీ బెలూన్‍లో ఇద్దరు

ప్రతీ హాట్ ఎయిర్ బెలూన్‍కు ఓ రూమ్ ఉంటుంది. ఇందులో ఇద్దరు ఫ్యాన్స్, ఓ పైలట్ ఉంటారు. ఈ బెలూన్ రైడ్ గాల్లోకి స్టేడియం 10 గేట్ నుంచి మొదలవుతుంది. ఈ ఎయిర్ బెలూన్ల కోసం అన్ని రకాల రక్షణ జాగ్రత్తలను రాజస్థాన్ ఫ్రాంచైజీ తీసుకుంది. అభిమానులకు ఎప్పటికీ మర్చిపోలేని విధమైన అనుభూతిని కల్పించేందుకు ఎయిర్ బెలూన్ నుంచి మ్యాచ్ చూసే సదుపాయం తీసుకొచ్చినట్టు ఆ ఫ్రాంచైజీ వెల్లడించింది.

రాజస్థాన్ జోరుకు బ్రేక్

ఐపీఎల్ 2024 సీజన్‍లో వరుసగా నాలుగు విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ జోరుకు బ్రేక్ పడింది. జైపూర్ వేదికగా బుధవారం (ఏప్రిల్ 10) జరిగిన మ్యాచ్‍లో గుజరాత్ టైటాన్స్ చేతిలో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అలవోకగా గెలుస్తుందన్న దశ నుంచి బౌలింగ్‍లో తేలిపోయి ఓటమి పాలైంది సంజూ శాంసన్‍ సేన్. చివరి బంతికి గెలిచింది గుజరాత్.

కెప్టెన్ సంజూ శాంసన్ (68 నాటౌట్), రియాన్ పరాగ్ (76) అర్ధ శతకాలతో అదరగొట్టడంతో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 196 పరుగులు చేసింది. అయితే, లక్ష్యఛేదనలో ఓ దశలో చాలా వెనుకబడిన గుజరాత్ ఆఖర్లో దుమ్మురేపి సత్తాచాటింది. గుజరాత్ కెప్టెన్ శుభ్‍మన్ గిల్ (72) హాఫ్ సెంచరీతో దుమ్మురేపగా.. చివర్లో రాహుల్ తెవాతియా (22), రషీద్ ఖాన్ (24 నాటౌట్) మెరుపులు మెరిపించారు. చివరి బంతికి విజయానికి 2 పరుగులు అవసరం కాగా.. ఫోర్ కొట్టి జట్టును గెలిపించాడు రషీద్.

ఈ మ్యాచ్‍లో రాజస్థాన్ ఓడినా.. ఐదు మ్యాచ్‍ల్లో నాలుగు గెలిచినందున ప్రస్తుతం ఐపీఎల్ 2024 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఆరు మ్యాచ్‍ల్లో మూడు గెలిచిన గుజరాత్ ఆరో స్థానానికి చేరింది.

Whats_app_banner