ఇండియాతో రెండో టెస్టు.. ఇంగ్లాండ్ టార్గెట్ 608 రన్స్. ఆ టీమ్ గెలవాలంటే ఇంకా 536 పరుగులు చేయాలి. ఇప్పటికే మూడు వికెట్లు పడ్డాయి. భారత్ గెలవాలంటే చివరి రోజు ఆటలో మరో ఏడు వికెట్లు పడగొట్టాలి. ఎలా చూసుకున్నా భారత్ కే గెలిచేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ టీమిండియా అవకాశాలపై వరుణుడు దెబ్బకొట్టేలా కనిపిస్తున్నాడు. ఆదివారం (జూలై 6) బర్మింగ్ హమ్ లో ఆట స్టార్ట్ కాకుండా వర్షం అంతరాయం కలిగిస్తోంది.
ఇంగ్లాండ్ తో ఫస్ట్ టెస్టులో చేజేతులారా భారత్ ఓడింది. కానీ రెండో టెస్టులో మాత్రం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి గెలుపు బాటలు వేసుకుంది. ఇంగ్లిష్ టీమ్ కు ఏకంగా 608 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. నాలుగో రోజే (జూలై 5) మూడు వికెట్లు పడగొట్టింది. ఈ రోజు మిగిలిన వికెట్లు త్వరగా పడగొట్టి గెలిచేయాలని అనుకుంది. కానీ టీమిండియా జోరుకు వాన బ్రేక్ వేసింది. వర్షం కారణంగా ఆట ఇంకా ప్రారంభం కాలేదు. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకే గేమ్ స్టార్ట్ కావాలి.
బర్మింగ్ హమ్ లో వర్షం తగ్గి ఆట ప్రారంభమైతే టీమిండియాకు గెలుపు అవకాశాలుంటాయి. ఇంకా ఆలస్యమైతే మాత్రం ఓవర్లు కోల్పోవాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్ డ్రా కోసం ఆడే అవకాశం ఉంది. అందుకే వరుణుడు వెళ్లిపోయి, ఆట త్వరగా ప్రారంభం అయితే భారత్ కు పరిస్థితులు కలిసొస్తాయి. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ లో ఆ టీమ్ 72/3తో నిలిచింది. ఒలీ పోప్ (24 బ్యాటింగ్), బ్రూక్ (15 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.
ఇంగ్లాండ్ తో రెండో టెస్టులో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించాడు. 387 బంతుల్లో 269 పరుగులు చేశాడు. 30 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 587 పరుగుల భారీ స్కోరు సాధించింది.
ఇక బౌలింగ్ లో హైదరాబాదీ మియా సిరాజ్ చెలరేగిపోయాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు పడగొట్టాడు. అయినా జేమీ స్మిత్ (184 నాటౌట్), హ్యారీ బ్రూక్ (158) పోరాటంతో ఇంగ్లాండ్ 407 పరుగులు చేయగలిగింది.
టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో సెంచరీ బాదేశాడు. 161 పరుగులు సాధించాడు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ ను ఇండియా 427/6 వద్ద డిక్లేర్ చేసింది. అయితే ఇన్నింగ్స్ ను కాస్త ముందుగానే శుభ్‌మన్ గిల్ డిక్లేర్ చేయాల్సిందన్న విమర్శలు వస్తున్నాయి. అయిదో రోజు ఆటకు వర్షం అంతరాయం కారణంగా శుభ్‌మన్ గిల్ నిర్ణయంపై ట్రోల్స్ వస్తున్నాయి.
సంబంధిత కథనం