IND vs AUS: ఆస్ట్రేలియాతో భారత్‍కు రెండో మ్యాచ్.. టీమిండియాకు తప్పని ఆ ఇబ్బందులు
IND vs AUS 2nd ODI: టీమిండియా క్రికెట్ టీమ్ మంచి ఫామ్‍లో ఉంది. ఇటీవలే ఆసియా కప్ 2023లో కప్పు గెలిచి సత్తా చాటింది. తాజాగా వన్డే వరల్డ్ కప్‍కు ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీసులో బోణి కొట్టి జోరు చూపించింది. అయితే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో మ్యాచ్‍కు ఆ ఇబ్బందులు తప్పేలా లేవు.
IND vs AUS 2nd ODI 2023: వన్డే ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీసులో భారత్ క్రికెట్ ప్లేయర్స్ సత్తా చాటారు. అదిరిపోయే ప్రదర్శనతో బోణి కొట్టారు. మొహాలీ వేదికగా జరిగిన ఈ తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఆసీస్‌పై ఇండియా ఘన విజయం సాధించింది. 277 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ప్లేయర్లు రుతురాజ్ గైక్వాడ్ (71), శుభ్‍మన్ గిల్ (74), కెప్టెన్ కేఎల్ రాహుల్ (58 నాటౌట్), సూర్య కుమార్ యాదవ్ (50) రన్స్ చేసి అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు.
ట్రెండింగ్ వార్తలు
హోల్కర్ స్టేడియం
భారత బ్యాటర్ల గేమ్‍తో 48.4 ఓవర్లలో 5 వికేట్ల నష్టానికి 281 పరుగులు చేసి ఘన విజయం సాధించింది టీమిండియా. దీంతో ఐసీసీ వన్డే టీమ్ ర్యాకింగ్‍ల్లో 116 పాయింట్లతో భారత్ నెంబర్ వన్ జట్టుగా అవతరించింది. ఇప్పుడు ఈ ఆస్ట్రేలియాతో జరిగే సిరీసులో భాగంగా రెండో మ్యాచ్‍పై ఆసక్తి నెలకొంది. ఆదివారం (సెప్టెంబర్ 24) ఇండోర్‍లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ రెండో మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచి 2-0 పాయింట్ల తేడాతో సిరీస్‍ను సొంతం చేసుకోవాలనుకుంటుంది ఇండియా.
వరుణుడి బాధలు
అయితే టీమిండియా ఆశలపై వరుణుడు నీళ్లు జల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో భారత్‍కు జరిగే రెండో మ్యాచ్ సమయంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం రోజు మొత్తం ఆకాశం మేఘావృతమై ఉంటుందని నివేదికలు తెలుపుతున్నాయి. దీంతో భారత్‍కు వరుణుడి బాధలు తప్పేలా లేవని తెలుస్తోంది. మరి ఆటకు ఆటంకం కలిగించకుండా వరుణుడు కరుణిస్తాడో లేదో చూడాలి.
జట్ల అంచనా
ఇక రెండో మ్యాచ్‍లో భారత్ టీమ్.. కేఎల్ రాహుల్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ ఉన్నట్లు అంచనా. అలాగే పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, సీన్ అబాట్, ఆడమ్ జంపాతో ఆస్ట్రేలియా జట్టు అంచనాగా ఉంది.
టాపిక్